
సాక్షి, హైదరాబాద్: వందలాది కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలన్నీ ఒకే చోట పంచుకునేందుకు ఈ నెల 28న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వేదిక అవుతోంది. ‘వీటన్నింటినీ చూసేందుకు రండి.. తరలిరండి..’అంటూ భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతోంది. దేశంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఇలాంటి స్టార్టప్‌లన్నింటితో పారిశ్రామిక సదస్సులో ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తోంది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త ఆవిష్కరణలు, వినూత్న పరిశ్రమలను ఈ సదస్సులో భాగంగా ఒకే గొడుగు తీసుకొచ్చింది. ఇప్పటికే ఎంపిక చేసిన దాదాపు వందకుపైగా ఉత్తమ స్టార్టప్‌లకు కేంద్ర పారిశ్రామిక శాఖ ఈ అవకాశం కల్పించింది. సదస్సులో వారంతా తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తుల గురించి చాటి చెప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
ప్రారంభోత్సవానికి ముందే..
ఈ నెల 28న పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే హెచ్‌ఐసీసీలో ఈ ‘ఇండియన్ ఎడ్జ్’ప్రదర్శన ఉంటుంది. అత్యాధునిక దృశ్య శ్రవణ సాంకేతిక పరిజ్ఞానంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) విభాగం ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అనే నినాదంతో కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తోంది. టచ్ స్క్రీన్లు, మల్టీ టచ్ ఇంటరాక్టివ్ వాల్, సెన్సర్ స్కీన్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లను వినియోగిస్తున్నారు. స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తమ సంస్థలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం, అవకాశాలు, ప్రయోజనాలు, ఆ రంగంలో ఉన్న భవిష్యత్తు తదితర అంశాలను చాటిచెప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో కంపెనీలు తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను సైతం ప్రదర్శించేలా ఎగ్జిబిషన్‌ను అధునాతనంగా రూపొందిస్తున్నారు. సదస్సులో తొలి రోజున సాయంత్రం 4 గంటల నుంచి 4.25 వరకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ ఈ ప్రదర్శనను తిలకిస్తారు. ‘ది ఇండియన్ ఎడ్జ్.. అండ్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ త్రూ ఏజెస్’పేరిట ప్రదర్శనను నిర్వహిస్తారు.
అందరూ పాదాలకు చెప్పులతో నడిచేలా భరోసా ఇవ్వగలమా?
పాత చెప్పులను స్లిప్పర్లుగా తయారు చేసి అందించే ‘గ్రీన్‌సోల్’ సాధించి చూపింది. భారత్‌లో ఆ కంపెనీ పెట్టిన ఔత్సాహికులను కలుసుకోవాలనుందా..
భవిష్యత్తు తరాలకు మనమంతా మంచి చేస్తామని హామీ ఇవ్వగలమా?
శిశువుల సంరక్షణకు అవసరమైన ఉత్పత్తులు తయారు చేస్తున్న స్టార్టప్ కంపెనీ ‘బేబి చక్ర’ను అడుగుదాం..
Comments
Please login to add a commentAdd a comment