అంతా ఆమె.. | Women Priority in GES Summit | Sakshi
Sakshi News home page

అంతా ఆమె..

Published Tue, Nov 28 2017 8:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Women Priority in GES Summit  - Sakshi - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: అన్ని రంగాల్లోనూ మహిళల  ప్రాధాన్యత పెరుగుతోంది. సమాజ అభివృద్ధిలో ఒక నిర్ణాయక భాగస్వామిగా మహిళలు ఎదుగుతున్నారు. పారిశ్రామిక రంగంలోనూ ప్రధాన భూమికను  పోషిస్తున్న  మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని  అందజేసేందుకు, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార మహిళలకు  ఒక వేదికను  కల్పించే దిశగా  ఈ ఏడా ది గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సమ్మిట్‌  (జీఈఎస్‌ –2017) ‘మహిళలే ముందు సంపద అందరికీ (విమెన్‌ ఫస్ట్‌ ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌)’  అనే ఉన్నతమైన ఆశయంతో  నిర్వహిం చనున్నారు.  అనేక దేశాల నుంచి   వందలాది మంది మహిళా పారిశ్రామిక వేత్తలు  పాల్గొననున్న  ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం  విశేషం. 

‘విమెన్‌ ఫస్ట్‌’ అనే స్ఫూర్తిని అందజేస్తున్న  మన విశ్వనగరంలో ఆ స్ఫూర్తికి తగిన విధంగానే వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం  ఉంది. కొన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నా మరి కొన్ని రంగాల్లో నిర్ణాయకమైన  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నింటా పురుషులతో సమానంగా ‘సగం’వాటాకు ఇంకా  చేరుకోలేకపోయినా  ఆ దిశగా పురోగమనం కనిపిస్తోంది. అసంఘటిత, కార్మిక వర్గాల్లో మహిళలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో వివిధ కేడర్‌లలో పని చేస్తున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

ఐటీ రంగంలో ..
నగరంలో  ఐటీ రంగం అనూహ్యంగా విస్తరిస్తోంది. వేలాది  సాఫ్ట్‌వేర్‌ సంస్థలు వెలిశాయి. కొన్ని సార్టప్‌ సంస్థలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయి. హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని  సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య  క్రమంగా పెరుగుతోంది. సైబరాబాద్‌ ప్రాంతంలో  మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వారిలో భరోసాను కలిగిస్తున్నాయి. మూడేళ్ల క్రితం  కేవలం  20 శాతం ఉన్న మహిళా ఉద్యోగులు ఇప్పుడు  35 శాతానికి పెరిగారు. ఈ  భాగస్వామ్యం ఇంకా పెరగాల్సి ఉంది. కానీ  షీటీమ్స్‌ వంటి పోలీసు బృందాలు, షీ షటిల్స్‌ వంటి రవాణా సదుపాయాలు, సుమారు  200 మహిళల వసతి గృహాల్లో పెరిగిన  భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల నిఘా వంటివి సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో  నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం ధైర్యంగా పని చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నట్లు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ ఉపాధ్యక్షులు, సీఈవోలు వంటి కీలకమైన స్థానాల్లో మాత్రం  ఇంకా  3 శాతం మహిళలే ఉన్నారు. ప్రోగ్రామర్స్‌గా,  ప్రాజెక్టు అధికారులుగా మహిళలు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. 

ప్రభుత్వంలో...
అలాగే  నగరంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పటితో పోల్చితే   ఎంతో మెరుగ్గానే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్య,వైద్య రంగాల్లో, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, ఆర్టీసీ వంటి వివిధ విభాగాల్లో మహిళల  భాగస్వామ్యం కీలకంగా నిలిచింది.

స్త్రీ సమానత్వానికి సమ్మిట్‌ ఓ  సదవకాశం
యూఎస్‌ అంబాసిడర్‌ కెన్నెత్‌ ఐ జస్టర్‌
సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామిక రంగంలో స్త్రీలు సమాన అవకాశాలను అందింపుచ్చుకునేందుకు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఒక సదవకాశంగా భావించాలని, తక్షణావసరాలు కాకుండా పారిశ్రామిక రంగంలో  ఇరుదేశాల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ సదస్సు లక్ష్యంలో ఉమిడి ఉన్నాయని అమెరికా రాయబారి కెన్నెత్‌ ఐ జస్టర్‌ అభిప్రాయపడ్డారు.ఇదిఎనిమిదవ ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తల సదస్సు అని,  ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొనడం ఇదే తొలిసారి అని అన్నారు. గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సదస్సు వివరాలను వెల్లడించేందుకు గచ్చిబౌలిలోని రహేజా ఐటీ పార్క్, వెస్టిన్‌లో నీతి ఆయోగ్‌ నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో కెన్నెత్‌ ఐ జస్టర్‌ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించగలిగితేనే సమాజం పురోగమిస్తుందన్నది ఇరుదేశాల విధానమని అన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సు ద్వారా సమాన అవకాశాలు, ప్రోత్సాహం, కొత్త పెట్టుబడులు, నూతన పరిశ్రమలకు అవకాశం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ మొత్తం 150 దేశాల నుంచి 1500 మంది పారిశ్రామిక వేత్తలు,  పెట్టుబడిదారులు పాల్గొంటున్న ఈ సదస్సులో సగానికిపైగా మహిళలే కావడం విశేషం అన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో 52.5 శాతం మంది ప్రపంచ దేశాల మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నట్టు వెల్లడించారు.ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇస్రాయిల్‌ సహా మొత్తం పది దేశాలనుంచి ప్రతినిధులంతా మహిళలే కావడం విశేషం.  

నగరపాలనలో ప్రత్యేక ముద్ర
సాక్షి,సిటీ బ్యూరో: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జిల్లా పాలనా యంత్రాంగంలో ఉన్నతాధికారులంతా మహిళలే. జిల్లా కలెక్టర్‌ నుంచి వీఆర్వోల వరకు మహిళలు సమర్థవంతమైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.అధికార యంత్రాంగానికి  గుండెకాయలాంటి రెవెన్యూతోపాటు సంక్షేమ, వైద్య శాఖలో కూడా మహిళా ఉద్యోగులదే పైచేయి. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా కొనసాగుతున్నారు.
మూడు నెలల క్రితం పాలన పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే కలెక్టర్‌ యోగితా రాణా అధికార యంత్రాంగాన్ని   ఉరుకులు పరుగులు పెట్టిస్తూ పలు సంస్కరణలతో ముందుకు సాగుతున్నారు.  
జాయింట్‌ కలెక్టర్‌గా ప్రశాంతి గతేడాదినుంచి కొనసాగుతున్నారు.  
జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులో  భూ సేకణ విభాగం  స్పెషల్‌ కలెక్టర్‌ సరళా వందనం ఇంచార్జి డీఆర్వోగా కొనసాగుతున్నారు.  
కలెక్టరేట్‌ పరిపాలనాధికారి పోస్టులో స్పెషల్‌ కలెక్టర్‌ రాధిక రమణి ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విభాగానికి కూడా ఆమెనే  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రభుత్వ భూముల న్యాయ విభాగం అధికారిగా స్పెషల్‌ కలెక్టర్‌ సంగీత సేవలందిస్తున్నారు.  
హైదరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో సికింద్రాబాద్‌ ఆర్డీఓ చంద్రకళ అదనపు బాధ్యతలతో  కొనసాగుతున్నారు.  
జిల్లా రేషనింగ్‌ అధికారిగా బాలమాంబ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పద్మజా, అదనపు డీఎంహెచ్‌వో సరళా కుమారి,  ఈ–డిస్ట్రిక్‌ మేనేజర్‌గా సరోజ. హైదరాబాద్‌ ఎస్టేట్‌ అధికారి నిఖిల విధులు నిర్వర్తిస్తూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు.

అతిథుల సేవలో నిథమ్‌ విద్యార్థులు
రాయదుర్గం: గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ నేపథ్యంలో ఆతిథ్య సేవలు అందిం చడంలో గచ్చిబౌలిలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజమ్‌ అండ్‌ హస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (డాక్టర్‌ వైఎస్సార్‌నిథమ్‌)కు పెద్దపీట వేశారు. పర్యాటక, ఆతిథ్యరంగంలో విద్యా, శిక్షణాసంస్థల్లో జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సాధించిన నిథమ్‌ నుండి గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆతిథ్య సేవలందించేందుకు 150 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు.  
నిథమ్‌ నుంచి బీబీఏ, ఎంబీఏ చదువుతున్న 80 మంది బాలికలు, 70 మంది బాలురు ఉన్నారు. ఎంపిక చేసిన వారు  ఎయిర్‌పోర్టు, హోటళ్ళు, హెచ్‌ఐసీసీల వద్ద ఒక్కో విద్యార్థికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించడం ప్రారంభించారు.
అయిదు విడతల్లో శిక్షణ...
గెస్‌ సదస్సులో ఆతిథ్య సేవలందించే నిథమ్‌ విద్యార్థులకు అయిదు విడతల్లో శిక్షణ ఇచ్చారు. మూడేసి గంటల చొప్పున  రెండుమార్లు నిథమ్‌ ప్రాంగణంలో, ఒక్కోసారి నిఫ్ట్, హెచ్‌ఐసీసీ, తారామతి బారాదారిలో శిక్షణ ఇచ్చారు. తారామతిబారాదారిలో ఇచ్చిన శిక్షణలో కేంద్ర,రాష్ట్ర అధికారులే కాకుండా అమెరికా అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే అతిథులకు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలుకడం, ఆతర్వాత వారి బస ఏర్పాటు చేసిన చోటుకు చేర్చడం వంటి సేవలను అందిస్తారు. రోజుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున నాలుగు రోజులు నాలుగు వేల రూపాయలను పారితోషికంగా అందిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement