బాలలూ పర్యావరణాన్ని కాపాడండి..’అంటూ చిన్నారులకు పాఠాలు చెప్పింది బాలీవుడ్ భామ దియామీర్జా. చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా శుక్రవారం ఐమ్యాక్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది.
నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందడి కొనసాగుతోంది. చిన్నారుల చిత్రాలు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంటున్నాయి. రెండోరోజూ ప్రసాద్ ఐమ్యాక్స్ పిల్లల కేరింతలతో కళకళలాడింది. ప్రముఖులూ ఉత్సవంలో పాల్గొని చిన్నారులతో ఆడిపాడారు.
ప్రసాద్ మల్టీఫ్లెక్స్‌లోని 3 స్క్రీన్స్‌లో శుక్రవారం 9 సినిమాలు ప్రదర్శించారు. దేశవిదేశీ చిత్రాలు చిన్నారులను అలరించాయి. నగరం నలుచెరగుల నుంచే కాకుండా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచీ చిన్నారులు తరలివచ్చారు. చికాగో తదితర విదేశీ నగరాల నుంచి కూడా బాలబాలికలు వచ్చి సందడి చేశారు.
ప్రకృతి పరిరక్షణ మరవొద్దు.. సినీ నటి దియామీర్జా
మనం జీవనశైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుగుతామని సినీ నటి దియామీర్జా అన్నారు. చిత్రోత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉదయం టూత్‌బ్రష్ వాడకంతో మొదలెట్టి ఎన్నో రకాలుగా పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేస్తున్నామని అన్నారు. సృష్టిలోని అన్ని ప్రాణులతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో చాలాసేపు ముచ్చటించారు.
మనమేం తీసిపోం..
విదేశీ చిత్రాలతో పోలిస్తే టెక్నికల్‌గా కొంత తేడా తప్పితే.. మనమేం వాళ్లకి తీసిపోం. నార్వే, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర దేశాల చిత్రాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆ లోకేషన్స్ మనకు నచ్చుతాయి. అదే మన లొకేషన్స్‌ను ఆస్వాదించలేం. అలాగే వారికి మన చిత్రాలు నచ్చుతాయి. ఎగిరే తారాజువ్వలు తదితర భారతీయ చిత్రాలకు మంచి గుర్తింపు లభిస్తోంది. మన దగ్గర చిన్నారుల చిత్రాలు థియేటర్లలో ఆడవు. ఆర్థికంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. – రాంప్రసాద్, దర్శకులు
పిల్లలకు ఏవీ..?
బాలల చిత్రం ‘ఆదిత్య క్రియేటివ్ జీనియస్’ రూపొందించాను. కలాం స్ఫూర్తితో సైంటిస్ట్‌గా మారిన ఆదిత్య పాత్రలో బాలనటుడు ప్రేమ్ చక్కగా నటించాడు. ఈ చిత్రానికి తెలుగు ప్రభుత్వాలు పన్ను మినహాయింపునిచ్చాయి. చిన్నారి శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపేందుకు రూపొందించిన చిత్రం ఇది. విదేశాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమా హాల్స్ ఉంటాయి. వారానికి ఒకసారైనా బాలల చిత్రాలను థియేటర్లలో చూపిస్తే పిల్లల్లో ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతుంది. – భీమగాని సుధాకర్‌గౌడ్, దర్శకుడు
టచ్ స్క్రీన్ టు నేచర్ టచ్
బాలల చిత్రం ‘డూడూ డీడీ’ రూపొందించాను. కొమరం భీమ్, దాసి చిత్రాలతో జాతీయ గుర్తింపు పొందిన నటులు భూపాల్ ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. పిల్లలు టచ్ స్క్రీన్ నుంచి నేచర్ టచ్‌లోకి వెళ్లడమే ఈ చిత్ర నేపథ్యం. వారం రోజులే ఈ సందడి. తర్వాత అంతా శూన్యమే. కోట్లు ఖర్చు చేసి కమర్షియల్ సినిమాలు తీసేవారు.. పిల్లల చిత్రాల జోలికి రాకపోవడం దురదృష్టకరం. పిల్లల చిత్రాల రూపకల్పన సామాజిక బాధ్యత. – అల్లాణి శ్రీధర్, బాలల చిత్రాల రూపకర్త
అంశాలపై అవగాహన..
చిత్రోత్సవంలో భాగంగా జేఎన్‌టీయూ ఆడిటోరియంలో వివిధ అంశాల్లో చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి యానిమేషన్‌లో, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఫిల్మ్ మేకింగ్, సాయంత్రం 4:30 గంటల నుంచి స్టోరీ టెల్లింగ్‌లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ముఖేష్‌ఖన్నా శుక్రవారం హాజరై చిన్నారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆటిజం, బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
మనమూ మారాలి..
‘డూడూ డీడీ’లో నేను చేసిన తాత పాత్ర.. నా సొంత క్యారెక్టరే అనిపించింది. పిల్లలకు సొంతంగా సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు ఎంతవరకు అవసరం? పిల్లలు మారాలంటే పెద్దలు మారాలి. తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే పిల్లల్లోనూ మార్పు వస్తుంది. దర్శకులు, నిర్మాతలు వారి బాల్యం వైపు ఒకసారి తిరిగి చూడాలి. ప్రతి నిర్మాత ఒక్క బాలల చిత్రమైనా రూపొందించడం బాధ్యతగా తీసుకుంటే బ్రహ్మాండమైన చిత్రాలు వస్తాయని నా అభిప్రాయం. – భూపాల్, నటుడు
స్ఫూర్తినివ్వాలి..
చిన్నారుల చిత్రాలు వారిలో స్ఫూర్తి నింపేలా, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా ఉండాలి. ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తే అలాంటి సినిమాలు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది. నేను రూపొందించిన ‘సత్యమేవ జయతే’ త్రీడీ యానిమేషన్ సినిమా చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా, వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన సినిమా ఇది. హాలీవుడ్ చిత్రాల శైలిలో తీయడం లేదా వాటిని పునర్నిర్మించడం కన్నా భారతీయతను ప్రతిబింబించే సినిమాలు మనం తీయాలి. – కొత్తపల్లి సీతారామ్, నిర్మాత
యానిమేషన్.. సూపర్బ్
రోజంతా వివిధ భాషా చిత్రాలను చూడడం మంచి అనుభవం. యానిమేషన్ సినిమాలు చాలా బాగున్నాయి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు, పంచుకునేందుకు ఈ చిత్రోత్సవం అవకాశం ఇస్తోంది. హైదరాబాద్‌కు ఫస్ట్‌టైమ్ వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడికి మళ్లీ రావాలనుకుంటున్నాం. – అతేలి డేనియల్, నాగాలాండ్
సినిమా తీస్తా.. అవార్డు కొట్టేస్తా
ఇండియాకు రావడం తొలిసారి. స్కూల్ పిల్లల కేరింతల మధ్య రకరకాల సినిమాలు చూడడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నేను కూడా జంతువులతో పాటు విభిన్న రకాల అంశాలతో షార్ట్‌ఫిల్మ్స్ తీస్తుంటాను. మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఈ చిత్రోత్సవం ఆ కోరిక తీరేందుకు ఉపయోగపడుతుంది. ఈ సినిమాల్లో వినియోగించిన టెక్నాలజీ తదితర నోట్ చేసుకుంటున్నాను. అవార్డు గెలుచుకునే బాలల చిత్రం తీయాలని ఆశ. – డానియల్, చికాగో
నేనూ తీస్తాను...
నేను దర్శకత్వం వహించిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాని చూసేందుకు ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ బాలల సినిమాల ప్రదర్శన, పండగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇంత మంచి ఫెస్టివల్‌కు మన నగరం వేదిక కావడం గర్వంగా అనిపిస్తోంది. ఇది చూస్తుంటే నాకు కూడా మంచి బాలల చిత్రం తీయాలనే ఆలోచన వస్తోంది. తప్పకుండా మంచి సందేశంతో తీస్తాను. – అజయ్ ఆండ్రూస్, దర్శకుడు
Comments
Please login to add a commentAdd a comment