
ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు ప్రశాంతం
సాక్షి, సిటీబ్యూరో: జంట జిల్లాల్లో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు హైదరాబాద్ జిల్లాలో 64,219మంది హాజరు కావాల్సి ఉండగా, 62,251మంది (97శాతం) పరీక్ష రాశారు. రంగారెడ్డి జిల్లాలో 92,063 మందికి 88,418మంది (96శాతం) పరీక్షకు హాజరైనట్టు జంట జిల్లాల ఆర్‌ఐవోలు తెలిపారు.
మహబూబియా కళాశాల పరీక్షా కేంద్రాన్ని గురువారం ఇంటర్ విద్యా కమిషనర్ అధర్‌సిన్హా, బజార్‌ఘాట్ ప్రభుత్వ ఒకేషన్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో సీటింగ్ అరేంజ్‌మెంట్ డిస్‌ప్లేలు సరిగా పెట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరీక్షా గదుల్లో వెలుతురు సరిగా లే దని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయాకేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జంటనగరాల ఆర్‌ఐవో రవికుమార్‌ను ఆదేశించారు.
బజార్‌ఘాట్‌లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల కేంద్రంలో చీటీలు తెచ్చి రాస్తున్న మెడ్విన్ జూనియర్ కళాశాల పారామెడికల్ విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థి బ్లూటూత్ ద్వారా హైటెక్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన నేపథ్యంలో.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షాకేంద్రాల సీఎస్‌లు, డీవోలను అప్రమత్తం చేయాలని ఆర్‌ఐవోలను బోర్డు అధికారులు ఆదేశించారు.