రాష్ట్ర విద్యుత్ విభాగంలో కొత్తగా 1,919 ఇంజనీర్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ విభాగాల్లో 1,492 అసిస్టెంట్ ఇంజనీర్, 427 సబ్ ఇంజనీర్ పోస్టులను మంజూరు చేసింది.
అదనంగా ఏఈ, ఎస్‌ఈ పోస్టులు
జెన్‌కో ఫైలుకు సర్కారు ఆమోదం
హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ విభాగంలో కొత్తగా 1,919 ఇంజనీర్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ విభాగాల్లో 1,492 అసిస్టెంట్ ఇంజనీర్, 427 సబ్ ఇంజనీర్ పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం జెన్‌కో ఆధ్వర్యంలో అదనంగా 6,280 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే కార్యాచరణకు నడుం బిగించింది.
ఇందుకు అవసరమయ్యే ఇంజనీర్లు, సిబ్బంది కోసం ఖాళీగా ఉన్న 456 అసిస్టెంట్ ఇంజనీర్, 306 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని, కొత్తగా 1,919 పోస్టులు మంజూరు చేయాలని జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని, భర్తీ చేసే ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని సూచించింది. విభాగాల వారీగా కొత్త పోస్టులు, పేస్కేళ్ల వివరాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. అసిస్టెంట్ ఇంజనీర్లకు రూ.41,155-రూ.63,600, సబ్ ఇంజనీర్లకు రూ.20,535- రూ.41,155 స్కేల్ ఆఫ్ పేగా ప్రకటించింది.
ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టులు..
విభాగం ఏఈలు ఎస్‌ఈలు
టీఎస్ జెన్‌కో 788 16
టీఎస్ ట్రాన్స్‌కో 62 42
టీఎస్ ఎస్‌పీడీసీఎల్ 376 139
టీఎస్ ఎన్‌పీడీసీఎల్ 266 230
మొత్తం 1492 427