
పరిశ్రమలకు 10% నీరు
అధికారులతో సమీక్షలో కేసీఆర్
సాగునీటి ప్రాజెక్టుల నుంచి కేటాయించేలా చట్టం..
పెట్టుబడిదారులు తెలంగాణకు పరుగులు పెట్టాలి..
దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోగా ఒకే చోట అన్ని అనుమతులు రావాలి
అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ఆదేశం
పారిశ్రామిక కారిడార్‌గా హైదరాబాద్-వరంగల్
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నుంచి పది శాతం నీటిని పరిశ్రమలకు కేటాయిస్తామని, ఈ మేరకు చట్టం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై పరిశ్రమల శాఖ అధికారులతో మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష జరిపారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పరుగులు పెట్టుకుంటూ హైదరాబాద్‌కు రావాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇందుకు అనుగుణంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మూడు నాలుగు రోజుల్లో ఫిక్కీ, ఫ్యాప్సీ వంటి సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలన్నారు. సింగపూర్ లాంటి దేశాలు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచించారు. పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు.. దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోగా అన్ని రకాల అనుమతులు వచ్చేలా ఈ విధానం ఉండాలని నిర్దేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సరళంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా ఈ వ్యవస్థ పనిచేయాలన్నారు. ప్రస్తుతం 17 శాఖల నుంచి 22 రకాల అనుమతులు తెచ్చుకోవడం పరిశ్రమలకు ఇబ్బందిగా మారిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ర్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) వద్ద ప్రస్తుతమున్న భూములను పారిశ్రామిక పార్కులుగా అభివృద్ధి చేసి.. అన్ని అనుమతులు తీసుకురావాలని సూచించారు. రాష్ర్టవ్యాప్తంగా వ్యవసాయానికి ఉపయోగపడని భూములన్నింటినీ టీఎస్‌ఐఐసీకి అప్పగించాలని ఆదేశించారు. ఏ పరిశ్రమకు ఎంత భూమి అవసరం, ఎక్కడ కేటాయించాలనే అంశాలను టీఎస్‌ఐఐసీ పరిశీలించాలన్నారు.
పరిశ్రమల వికేంద్రీకరణ
తెలంగాణవ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అన్ని పరిశ్రమలు ఒకే చోట ఏర్పడటం వల్ల మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిశ్రమ ఏర్పాటయ్యేలా పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాలని పేర్కొన్నారు. రాష్ర్టంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. వరంగల్‌లో 2 వేల ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో 30 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సెయిల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్-వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఆ శాఖ కమిషనర్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.