పరిశ్రమ పచ్చగా.. | telangana government issued guidelines for industries | Sakshi
Sakshi News home page

పరిశ్రమ పచ్చగా..

Published Sun, Nov 30 2014 1:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

పరిశ్రమ పచ్చగా.. - Sakshi

పరిశ్రమ పచ్చగా..

టీ-ఐడియా, టీ-ప్రైడ్ మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: దేశంలోనే వినూత్న పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాయితీల జల్లును కురిపిస్తూ శనివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్  ఇన్సెంటివ్ (టీ-ఐడియా)’, ‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ (టీ-ప్రైడ్)’ పథకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక సంఘాలు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు, సమాలోచనలతో వీటిని రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలకు సంబంధించిన వివరాలతో పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
 రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం టీ-ఐడియా, టీ-ప్రైడ్‌కు వర్తించే రాయితీల వివరాలు..
 
 సూక్ష్మ, చిన్న పరిశ్రమలు..
 
 లీజుకు తీసుకున్న స్థలం/షెడ్డు/భవనాల స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు
 తాకట్లు, బ్యాంకు తాకట్టుతో తీసుకున్న స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు
 పారిశ్రామిక పార్కు/ఎస్టేట్‌లలో స్థలాలకు 25 శాతం రాయితీ.. గరిష్టంగా రూ. 10 లక్షలు
 భూ వినియోగ మార్పిడి చార్జీల్లో 25 శాతం రాయితీ.. (గరిష్టంగా రూ. 10 లక్షల వరకు)
 పరిశ్రమలకు 15 శాతం పెట్టుబడి రాయితీ.. (గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు)
 ఉత్పాదన మొదలుపెట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూపాయి చొప్పున తిరిగి చెల్లింపు (రీయింబర్స్‌మెంట్)
 ఐదేళ్ల పాటు ఉత్పత్తులపై వంద శాతం వ్యా ట్/సీఎస్‌టీ/ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్
 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యంత్రాల (మిషనరీ) కొనుగోలుకు 10 శాతం ప్రారంభ పెట్టుబడి సాయం. పెట్టుబడి రాయితీ నుంచి మినహాయింపు
 ఒక్కొక్కరికి రూ. 2 వేలకు మించకుండా మానవ వనరుల నైపుణ్యం, శిక్షణకు 50 శాతం రీయింబర్స్‌మెంట్
 నాణ్యత ధ్రువపత్రాలు/పేటెంట్ రిజిస్ట్రేషన్ల విలువలో 50% సబ్సిడీ (గరిష్టంగా 2 లక్షలు)
 స్పెసిఫిక్ క్లీనర్ ప్రొడక్షన్ విలువలో 25 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ. 5 లక్షల వరకు)
 పరిశ్రమల ప్రోత్సాహకాల్లో 27 శాతం బీసీలకు, 12 శాతం మైనారిటీలకు కేటాయిస్తారు
 మధ్యతరహా, భారీ పరిశ్రమలకు..
 
 స్టాంపు డ్యూటీ, స్థలాల విలువలో రాయితీ, భూ వినియోగ మార్పిడి, విద్యుత్ రాయితీ, శిక్షణ, పేటెంట్ల రిజిస్ట్రేషన్లు, స్పెసిఫిక్ క్లీనర్ ప్రొడక్షన్ చర్యలు తదితర ప్రోత్సాహకాలన్నీ చిన్న పరిశ్రమలకు వర్తించిన విధంగానే మధ్యతరహా, భారీ పరిశ్రమలకు కూడా అమలవుతాయి.
 
 మధ్య తరహా పరిశ్రమలకు వ్యాట్/సీఎస్‌టీలపై 75%, భారీ పరిశ్రమలకు 50% రీయింబ ర్స్‌మెంట్ ఏడేళ్ల పాటు అమలవుతుంది.
 
 రోడ్లు, విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలకు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ (ఐఐడీఎఫ్) 50 శాతం నిధులు సమకూరుస్తుంది. (ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లకు పది కిలోమీటర్ల కంటే దూరంగా ఉన్న యూనిట్ల కు.. వాస్తవ పెట్టుబడిలో 15 శాతం మించకూడదనే షరతులు వర్తిస్తాయి)
 
 ప్రస్తుతమున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు క్వాలిటీ సర్టిఫికేషన్‌కయ్యే ఖర్చులో రూ. 2లక్షలకు మించకుండా 50% రాయితీ.
 
 ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు..
 
 వంద శాతం మహిళల యాజమాన్యం, షేర్లు ఉన్న కంపెనీలనే ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు అదనంగా 10 శాతం పెట్టుబడి రాయితీ (గరిష్టంగా రూ.10 లక్షల ప్రయోజనం) వరిస్తుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు వర్తించే ప్రోత్సాహకాలన్నీ ఈ కేటగిరీకి కూడా వర్తిస్తాయి.
 
 మెగా ప్రాజెక్టులకు..
 
 రూ. 200 కోట్ల పెట్టుబడి లేదా 1000 కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేవి మెగా ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులకు వాటి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది.
 
 విస్తృతంగా మౌలిక సదుపాయాలు
 
 పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ కింద ప్రతి ఏడాది రోడ్లు, విద్యుత్, నీరు, వ్యర్థాల నిర్వహణకు బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయిస్తారు. జాతీయ రహదారులతో పాటు, నేషనల్ మాన్యుఫాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌లను బలోపేతం చేసేందుకు కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రోత్సాహకాలు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు టీఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసే పారిశ్రామిక ఎస్టేట్‌లలో 30 నుంచి 40 శాతం భూమిని రిజర్వు చేయటం. ఎస్సీలకు  15.4 %, ఎస్టీలకు 9.3 శాతం, మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్లాట్ల కేటాయింపు.
 
 టెక్స్‌టైల్‌కు చేయూత
 
 టెక్స్‌టైల్ పరిశ్రమకు కేంద్రం అమలు చేస్తున్న టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ (టీయూఎఫ్) స్కీమ్‌కు తోడుగా వడ్డీ రాయితీ తిరిగి చెల్లింపు
 
 స్పిన్నింగ్‌కు ఇచ్చే వడ్డీ రాయితీలో ఐదేళ్ల పాటు  4 శాతం రీయింబర్స్‌మెంట్
 
 స్పిన్నింగ్, వీవింగ్, నిట్టింగ్, డైయింగ్, గార్మెంటింగ్ సంయుక్త కార్యకలాపాలకు లభించే 6 శాతం వడ్డీ రాయితీ ఐదేళ్ల పాటు రీయింబర్స్‌మెంట్
 
 ఎస్సీ, ఎస్టీలకు మరింత అదనం..
 
 వంద శాతం ఎస్సీ ఎస్టీల యాజమాన్యం, షేర్లు ఉన్న కంపెనీలకు ఈ కేటగిరీ కింద రాయితీలు అందజేస్తారు. ఈ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి కనీసం ఆరేళ్ల పాటు పూర్తిగా ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యంతోనే కొనసాగాల్సి ఉంటుంది. లేకపోతే రాయితీల సొమ్మును తిరిగి వసూలు చేస్తారు.
 
 పారిశ్రామిక పార్కు/ఎస్టేట్‌లలో స్థలాలకు 33.3 శాతం రాయితీ. (గరిష్టంగా 10 లక్షలు)
 
 ఉత్పాదన మొదలుపెట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున తిరిగి చెల్లింపు
 
 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యంత్రా ల కొనుగోలుకు 20% పెట్టుబడి సాయం. పెట్టుబడి రాయితీ నుంచి మినహాయింపు.
 
 పరిశ్రమలకు 35 శాతం పెట్టుబడి రాయితీ.. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించే ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అదనంగా మరో 5 శాతం రాయితీ (గరిష్ఠంగా రూ. 75 లక్షల వరకు), మహిళా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామి క వేత్తలకు అదనంగా మరో 10% రాయితీ.
 
 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించే భూమిని తొలుత ఎకరానికి రూ. 100 చొప్పున పదేళ్ల కాలానికి లీజుకు ఇస్తారు. ఆ భూమి విలువలో 25 శాతాన్ని 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తంపై రెండేళ్ల మారటోరియం ఉంటుంది. ఆ తర్వాత ఈ 75 శాతం సొమ్మును ఎనిమిది వార్షిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
 
 
 నాణ్యత ధ్రువపత్రాలు/పేటెంట్ రిజిస్ట్రేషన్ల విలువలో 100 శాతం సబ్సిడీ.
 
 ఇవిగాక ఇతర దాదాపు ప్రోత్సాహకాలన్నీ ఇతర పారిశ్రామికవేత్తలకు వర్తించిన విధంగానే ఎస్సీ,ఎస్టీలకు వర్తిస్తాయి.
 
 ఐదేళ్లలో 200 మంది ఎస్సీఎస్టీ కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించిన 5వ తరగతి పనులు నిర్వహించగల 200 మంది ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లను రాను న్న ఐదేళ్లలో తయారు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాక్‌లో శిక్షణ ఇవ్వనుంది. వారికి  పెట్టుబడి వ్యయం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం సైతం అందజేనుంది.
 
 ఐఐపీపీ గడువు పొడిగింపు..
 
 పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విధానం(ఐఐపీపీ) 2010-15 కింద పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాల గడువును 2019 అక్టోబర్ 31 వరకు పెంచుతూ శనివారం పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధం గా టెక్స్‌టైల్ పరిశ్రమలకు ‘టీ-ఐడియా’ కింద  ప్రోత్సాహకాలను 2019 అక్టోబర్ 31 వరకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేసింది.
 
 
 11 రంగాలకే పెట్టుబడి రాయితీ
 పెట్టుబడి రాయితీకి అర్హత ఉన్నట్లుగా గుర్తించిన 11 రంగాల పరిశ్రమల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. పారిశ్రామిక ఉత్పత్తుల పరీక్షల ల్యాబ్‌లు, పరిశోధన-అభివృద్ధి కేంద్రాలు, ప్రింటింగ్ ప్రెస్‌లు, సీడ్ గ్రేడింగ్ కేంద్రాలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కేంద్రాలు, పవర్ లాండ్రీలు, రూ. 5 లక్షలకు మించి పెట్టుబడి ఉండే రెడీమేడ్ వస్త్ర తయారీ యూనిట్లు, ఆటో సర్వీసింగ్ అండ్ రిపేరింగ్, ప్యాకేజింగ్, జనరల్ ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్, మిషన్ ఆధారిత బుక్ బైండింగ్, నోట్‌బుక్‌ల పరిశ్రమలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర స్థాయి కమిటీ నోటిఫై చేసిన సేవారంగ పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement