
జమ్మికుంట: దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసులు ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలిపించడం ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అయింది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంటవాసులు ప్రతిరోజు జాతీయ గీతం 'జనగణమన'ను ఆలపించడం ప్రారంభించారు. బుధవారానికి వందరోజులు కావడంతో జమ్మికుంటవాసులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జమ్మికుంటలో ప్రతిరోజూ ఉదయం 8 గం.లకు ఊరు మొత్తం స్పీకర్లలో జనగణమన వినిపిస్తుంది. జాతీయ గీతం వినపడగానే ఎక్కడి వారు అక్కడే తమ పనులను ఆపేసి, గీతం పూర్తయ్యే వరకు నిల్చొని సెల్యూట్ చేస్తారు. ఆగస్టు 15 నుంచి ఇలా ప్రతిరోజూ జాతీయ గీతాన్ని గౌరవించుకోవాలని ఆ పట్టణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పోలీసులు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో స్పీకర్లను ఏర్పాటు చేశారు. జాతీయ గీతం ప్రారంభమవడానికి ఐదు నిమిషాల ముందు ఒక ప్రకటన వస్తుంది. దాంతో ప్రజలంతా సిద్ధమవుతారు. తర్వాత జనగణమన వస్తున్న 52 సెకన్ల పాటు వారు నిల్చునే ఉంటారు.