
నాయకన్‌గూడెం వద్ద అలుగులోకి దూసుకెళ్లిన బస్సు
కూసుమంచి: హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం వేకువజామున ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద అదుపు తప్పి అలుగుల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్యకు తీవ్ర గాయం కాగా.. మరో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన టీఎస్04 జెడ్ 0230 నంబరు గల రాజధాని ఏసీ బస్సు కూకట్‌పల్లి నుంచి ఖమ్మం బయలుదేరింది.
బస్సు నాయకన్‌గూడెం గ్రామం దాటగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ అలుగుల ప్రాంతంలోని లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ముందు వరుసలో కూర్చున్న మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య పెదవి పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి గాయపడిన మాజీ ఎమ్మెల్యేను ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తలించారు. మిగిలిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఎదురుగా వస్తున్న లారీలను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పినట్లు డ్రైవర్ గుగులోతు భద్రు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment