ఆ బస్తీల్లో భయం..భయం | 200 Special Teams For Catch Delhi Nizamuddin Visitors | Sakshi
Sakshi News home page

గల్లీల్లో 'ఢిల్లీ'

Published Wed, Apr 1 2020 7:40 AM | Last Updated on Wed, Apr 1 2020 7:40 AM

200 Special Teams For Catch Delhi Nizamuddin Visitors - Sakshi

పాతబస్తీలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్‌: గ్రేటర్‌కు ఢిల్లీ ఫీవర్‌ పట్టుకుంది. బస్తీవాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. చైనా, ఇటలీ, దుబాయ్, స్కాట్‌లాండ్, ఇండోనేషియా, యూకే, యూఎస్‌ఏల నుంచి వచ్చిన వారితో పోలిస్తే..మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్‌ మార్కెట్‌లోనిర్వహించిన తబ్లీఘీ జమాత్‌కు హాజరై వచ్చిన వారితోనే ఎక్కువ ఆందోళన నెలకొంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కన్నా..
జమాత్‌కు హాజరై వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువ వెలుగు చూస్తుండటంఇందుకు కారణం. తెలంగాణ నుంచి 1030 మంది హాజరు కాగా, వీరిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచే 603 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే పలువురికి కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి.థర్డ్‌ కాంటాక్ట్‌ కూడా చాపకింది నీరులా విస్తరిసంది. సెకండ్‌ కాంటాక్ట్‌ బాధితులే కాదు..వారికి క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నవారిలో చాలా మంది వివరాలు దొరకడం లేదు. దీంతో ఇటు పోలీసులు, అటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. జమాత్‌కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ కూడా ముగియడం, కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటం, ప్రస్తుతం వైరస్‌ మరింత చురుగ్గా విస్తరించే అవకాశం ఉండటంతో గ్రేటర్‌వాసుల్లోఆందోళన నెలకొంది. 

ఆ బస్తీల్లో భయం..భయం
ఖైతరాబాద్‌కు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు గత శుక్రవారం ఖైరతాబాద్‌ గ్లోబల్‌ఆస్పత్రిలో మృతి చెందగా, యూసఫ్‌గూడ వాసి సోమవారం అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. ఇక చంచల్‌గూడకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి సహా నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన మరో 69 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్లు, బస్తీల్లో ఆందోళన మొదలైంది. మృతుల కుటుంబ సభ్యులను ఇప్పటికే క్వారంటైన్‌లో ఉంచారు. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.  కేవలం మృతుల నుంచి కాకుండా వారికి క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఇతరులకు వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. 

ఒక్కరి అశ్రద్ధ..కుటుంబం మొత్తానికి సమస్య
కరోనా అనుమానితులు ఇంట్లో విడిగా ఉండక పోవడం, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరుల మధ్య తిరగడం వల్లే హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులు పెరుగుదలకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్‌ నుంచి దుబాయ్‌ మీదుకు హైదరాబాద్‌కు చేరుకున్న  సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్‌కు చెందిన వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆయన నుంచి ఆయన కుమారునికి, ఆ తర్వాత ఆయన భార్యకు పాజిటివ్‌ వచ్చింది. ఇక యశోద ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు ఇటీవల తిరుపతి వెళ్లివచ్చి, అక్కడ ఓ విదేశీయునితో కలిసి, ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఆస్పత్రిలో సహ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి, కుటుంబ సభ్యులతో యథావిధిగా గడిపాడు. దీంతో ఆయన నుంచి ఆయన భార్యకు, తల్లికి వైరస్‌ సోకింది. ఇక జమాత్‌కు వెళ్లి వచ్చిన నాంపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఆయన కుటుంబంలో ఆరుగురు సభ్యలకు వైరస్‌ సోకింది. ఇదే కార్యక్రమానికి వెళ్లి వచ్చిన కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి నుంచి మరో నలుగురు కుటుంబ çసభ్యులకు వైరస్‌ సోకింది. గోల్కొండకు చెందిన ఓ కుటుంబ బాలుడు సహా ఇటీవల సౌది అరేబియా వెళ్లి వచ్చింది. మూడేళ్ల బాలుడు సహా తల్లిదండ్రులు ఇద్దరూ çకరోనా వైరస్‌ భారిన పడ్డారు. ఇక రంగారెడ్డిజిల్లా కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి నంచి ఆయన భార్యకు వైరస్‌ విస్తరించింది. రెండు రోజుల క్రితం నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ 18 నెలల బాలునికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసింది. బాలుని తల్లికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. లక్షణాలను గుర్తించక పోవడం, కుటుంబ సభ్యుల మధ్య నిర్లక్ష్యంగా గడపడం వల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరిస్తుంది. ఎక్కడ ఈ  వైరస్‌ తమకు సోకుతుందోనని పక్క ఇంట్లోని వారు బస్తీ వాసులు, ఇతర బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

ఇండోనేసియా నుంచి ఢిల్లీకి..అటు నుంచి హైదరాబాద్‌కు...
మార్చి తొమ్మిదో తేదీన పది మంది ఇండోనేసియా నుంచి ఢిల్లీలో దిగారు. వీరు జమాత్‌లో పాల్గొని, 13వ తేదీన సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి రామగుండం, కరీంనగర్‌కు చేరుకున్నారు. ఈ పది మంది సహా వీరికి బస ఏర్పాటు చేసిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగక ముందే వీరికి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. థర్మల్‌స్కాన్‌కు ఏమాత్రం పట్టుబడకుండా విమానంలో ఉండగానే వీరంతా పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌ వేసుకున్నట్లు తెలిసింది. మాత్రలు వేసుకోవడంతో వీరు స్క్రీనింగ్‌లో పట్టుబడకుండా బయటికి వచ్చారు. జమాత్‌లో పాలొన్నారు. వీరి నుంచే అనేక మందికి వైరస్‌ విస్తరించినట్లు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెలుగు చూస్తున్న పాజిటివ్‌ బాధితులంతా ఢిల్లీలో వారితో కలిసి సమావేశంలో పాల్గొన్న వారే కావడం గమనార్హం. ఇలా ఇండోనేసియా నుంచి ఢిల్లీకి...అటు నుంచి హైదరాబాద్‌కు వైరస్‌ విస్తరించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఏ బస్తీ నుంచి ఎంత మంది వెళ్లి వచ్చారంటే..?
మియాపూర్‌లో అదుపులోకి తీసుకున్న 15 మందిలో 10 మంది ఆరోగ్య పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  
కూకట్‌పల్లి జోన్‌ నుంచి 40 మంది వెళ్లిరాగా, వీరిలో ఒకరికి ఇప్పటికే పాజిటివ్‌ వచ్చింది. మరో తొమ్మిది మందికి గాంధీలో వైద్య పరీక్షలు చేయించగా వారికి నెగిటివ్‌ వచ్చింది. 30 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.  
కుత్బుల్లాపూర్‌ నుంచి ఒక వ్యక్తి వెళ్లి వచ్చాడు. ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆయన కుటుంబంలో మరో ముగ్గరికి పాజిటివ్‌ వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రార్థనామందిరంలో మరో 40 మందితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి బృందంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వారిలో 8 మందిని మాత్రమే గుర్తించి, వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. మిగిలిన వారి ఆచూకీ లభించకపోవడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు.  
ఎల్బీనగర్‌ నుంచి నలుగురు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి రాగా, వీరిలో ఇప్పటికే ఇద్దరు గాంధీలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు విజయవాడలో ఉన్నారు.  
సికింద్రాబాద్‌ నుంచి 14 మంది, మల్కాజ్‌గిరి నుంచి 5, ముషీరాబాద్‌ నుంచి 6, బేగంపేట నుంచి 14 మంది, అంబర్‌పేట నుంచి 21 మంది ఢిల్లీ జమాత్‌కు వెళ్లి రాగా, వీరిలో 11 మంది గాంధీ, ఛాతి ఆస్పత్రుల్లో ఉండగా, మరో 39 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  
పాతబస్తీ నుంచి మొత్తం 128 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే పలువురికి పాజిటివ్‌ వచ్చింది. చంచల్‌గూడ, నూర్‌ఖాన్‌ బజార్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే మృతి చెందారు. మరో 15 మంది పాజిటివ్‌ వచ్చింది. వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   
రాజేంద్రనగర్‌ నుంచి ఆరుగురు వ్యక్తులు వెళ్లిరాగా, వారిని ఇప్పటికే గుర్తించారు. వీరిలో ఇప్పటికే పలువురు కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో చికిత్స కోసం గాంధీకి తరలించారు.  
గచ్చిబౌలి నుంచి 8 మంది ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చారు. వీరు మరో ఏడుగురికి క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నారు. వీరందరినీ గాంధీకి పంపి వైద్య పరీక్షలు చేయించారు. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఛావుని ప్రాంతంలో ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు తెలియగానే జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్య శాఖ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిసర ప్రాంతాలన్నింటినీ శానిటైజేషన్‌ చేసారు. అతనితో నేరుగా కాంటాక్ట్‌ అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అవసరమైన మేరకు అందరికి వైద్య పరీక్షలు చేయించడానికి సిద్ధమవుతున్నారు. అతనితో నేరుగా కలిసిన వారందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టీం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.  

15 మందికి పాజిటివ్‌: జమాత్‌ నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు సోకిన కరోనా వైరస్‌
సాక్షి, సిటీబ్యూరో: కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే 15 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యుల్లోనే ఈ కేసులన్నీ నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి సంఖ్య తెలంగాణలో 97కు చేరింది. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా, మరో 14 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం గాంధీ, ఛాతి ఆస్పత్రుల్లో 77 మంది పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తి ఇంట్లోనే మరో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. వీరికి లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారానే వైరస్‌ వ్యాపించింది. తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురిలో కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  

తనిఖీల్లో 200 బృందాలు
ఢిల్లీకి వెళ్లివచ్చిన నగరవాసులు 603 మందిలో ఎవరెవరెవరు..ఎక్కడ ఉన్నదీ తెలుసుకునేందుకు 200 బృందాలు రంగంలోకి దిగాయి. రెవెన్యూ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖలకు చెందిన ఉద్యోగులతో ఏర్పాటు చేసిన బృందాలు ఇప్పటికే 463 మంది ఇళ్లను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 74 మందికి ఆరోగ్య సమస్యలు, కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షల నిమిత్తం గాంధీ, ఛాతి హాస్పిటల్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వీరిలో 348 మందిని హోం క్వారంటైన్‌ చేయగా, మరో 41 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌కు  తరలించారు. మిగిలిన వారి అడ్రసులు సరిగా లేనందున, వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ టీమ్స్‌ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారి  కుటుంబ సభ్యులను కూడా హోమ్‌ క్వారంటైన్‌ చేస్తున్నారు. వృద్ధులు, తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారిని, ఇళ్లల్లో తక్కువ స్థలం వున్న వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement