
255 షాపులు రూ.92.76 కోట్లు
కొత్త మద్యం పాలసీతో జిల్లాలో మద్యం వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా మద్యం షాపులకు ఏడాది కాలపరిమితితో లెసైన్సులు జారీ చేసే ప్రక్రియను షురూ చేసింది. సోమవారం గెజిట్ ప్రకటన వెలువరించింది. 23వ తేదీన బహిరంగ వేలం ద్వారా దుకాణాలను కట్టబెట్టనుంది..!!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :పాత విధానానికి కొత్త సవరణలతో, సరికొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే జిల్లా ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకు వేలం నిర్వహిస్తోంది. జిల్లాలోని 255 షాపుల వేలానికి సబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచే మద్యం షాపులకు దరఖాస్తులు విక్రయించ డం మొదలు పెట్టింది. దీనికోసం అప్పుడే టెండరు బాక్సునూ సీల్ చేసింది. ఈ నెల 23న నల్లగొండలోని టౌన్‌హాలులో మద్యం షాపులకు బహిరంగ వేలం నిర్వహించనున్నా రు. ఏడాది కాలపరిమితి ఉన్న మద్యం షాపు ల కోసంఎన్ని వేల దరఖాస్తులు టెండరు బాక్సులో పడతాయో 23న తెలిసిపోతుంది.
జనాభా ప్రాతిపదికన విభజన..
జిల్లా వ్యాప్తంగా 255 షాపులను జనాభా ప్రాతిపదికన విభజించి మూడు శ్లాబులను నిర్ణయించారు. దీని ప్రకారం 91 షాపులకు ఏడాది లెసైన్సు ఫీజు ఒక్కో షాప్‌నకు రూ.42ల క్షల చొప్పున రూ.38.22కోట్లు, 83 షాపులకు రూ.34లక్షల చొప్పున రూ.28.22 కోట్లు, 81షాపులకు ఏడాది లెసైన్సు ఫీజు రూ.32.50లక్షల చొప్పున నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం 255 షాపులకు జిల్లా నుంచి లెసైన్సు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.92.76కోట్ల ఆదాయం ఏటా సమకూరనుంది. ఇక, వేలంలో పాల్గొనడానికి ప్రతి దరఖాస్తుదారుడూ రూ.25వేలు చెల్లించాల్సిందే.
దరఖాస్తుదారులు పార్టిసిపేషన్ ఫీజుతో పాటు 10శాతం ధరవాతు సొమ్ము చెల్లించాలి. వేలం తర్వాత ఎవరికీ పార్టిసిపేషన్ ఫీజు మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వరు. కేవలం 255 మందికి మాత్రమే దుకాణాలు దక్కుతాయి. ఇక, మిగిలిన వారందరి పార్టిసిపేషన్ ఫీ ప్రభుత్వానికే చెందుతుంది. వేలంలో దుకాణం దక్కించుకున్న వారు మాత్రం లెసైన్సు ఫీజులో 1/3వంతు వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. కాగా, 2014-15 మద్యం పాలసీ మేరకు జరుగుతున్న ఈ వేలం తర్వాత కొత్త షాపులు జూలై 1వ తేదీ నుంచి మద్యం విక్రయాలు మొదలు పెడతాయి. కాగా, ప్రభుత్వం ఇంకా, బార్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, ఆ తర్వాతే బార్లకు కొత్త అనుమతులు మంజూరు చేస్తామని ‘ఆబ్కారీ’ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
నల్లగొండ రూరల్ : మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ లోపు ఆసక్తి గల అభ్యర్థులు మద్యం దుకాణాల కోసం రూ.25 వేల చలాన్‌ను, వార్షిక లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరు మీద డీడీ తీయాలని కోరారు. ఈ నెల 23న నల్లగొండ పట్టణంలోని టౌన్‌హాల్‌లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తు ఫారాలను రామగిరిలోని ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూర్యదేవి కోరారు.