రాజధానిలో 25 లక్షల మొక్కలు
జూలై 11న నాటుతామన్న మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో జూలై 11న 25 లక్షల మొక్క లు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. హరితహారం కార్యక్రమంపై మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలసి మంత్రి తలసాని అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 6 నుంచి 10 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తలసాని సూచించా రు. మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని 27 కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 20 తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మరోసారి సమావేశమవుతామన్నారు.
హరితమయం చేద్దాం...
మొక్కల పెంపకం ద్వారా నగరాన్ని హరి తమయం చేద్దామని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. రెండేళ్లుగా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయామని, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున విరివిగా మొక్కలు నాటాల న్నారు. కాలుష్యం బారి నుంచి బయట పడాలంటే చెట్ల పెంపకమే ఏకైక మార్గమని నాయిని అన్నారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్‌లో 10కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.