ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో పీఆర్‌సీ సిఫారసుల మేరకు మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిల్లల సంరక్షణ కోసం రెండేళ్లు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) డిమాండ్ చేసింది. పీఆర్‌సీ సిఫారసు చేసినా ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతో మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో పడ్డారని ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వెంకట్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ఇచ్చిన 7వ పీఆర్‌సీ చేసిన సిఫారసుల్లో ఒంటరి తండ్రికి కూడా(ఉద్యోగి పురుషుడు) రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని సిఫారసు చేసిందని, అలాంటిది మన రాష్ట్రం లో మహిళలకు కూడా దానిని అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అంతర్‌జిల్లా బదిలీలు జరుగలేదని, వెంటనే చేపట్టాలని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా టీచర్లలో భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో పని చేస్తుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.