
3 నామినేషన్ల పర్వం బోణి
- తొలి రోజు స్పందన అంతంతే
- ఖరారు కాని పొత్తులు
- తేలని ప్రధాన పార్టీల అభ్యర్థులు
- పలు స్థానాల్లో దాఖలు కాని నామినేషన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల పోరులో తొలి ఘట్టం ప్రారంభమైంది. నామినేషన్ల పర్వానికి తెర లేచింది. తొలిరోజు ‘గ్రేటర్’ పరిధిలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసి బోణి చేశారు. పొత్తులు ఖరారు కాకపోవడం.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల్నిప్రకటించకపోవడం.. తదితర కారణాల రీత్యా చాలా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు లోక్‌సభ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలకు గాను బుధవారం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి, ఖైరతాబాద్, పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాలకు ఒక్కో నామినేషన్ వంతున దాఖలయ్యాయి.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీహెచ్ మురహరి (ఎస్‌యూసీఐ)కమ్యూనిస్టు, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా షాబాజ్ రమేశ్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌కు చెందిన గూడెం మహిపాల్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగానే తన నామినేషన్ దాఖలు చేయడం విశేషం.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కంటోన్మెంట్, బహదూర్‌పురా, సికింద్రాబాద్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, మలక్‌పేట, ముషీరాబాద్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీల నుంచి ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఎంఐఎం ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. వారిలోఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇక బీజేపీ- టీడీపీల పొత్తులో భాగంగా ఎవరికే సీట్లో వెల్లడి కాలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల అభ్యర్థుల జాబితా వెలువడాల్సి ఉంది. ఏ క్షణంలో ఏయే పార్టీలు పొత్తు కుదుర్చుకోనున్నాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. గ త అసెంబ్లీ (2009) ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తలపడగా.. చార్మినార్ శాసనసభ స్థానం నుంచి అత్యల్పంగా 14 మంది పోటీ చేశారు.
రంగారెడ్డి జిల్లాలో నామినేషన్లు నిల్
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు రంగారెడ్డి జిల్లాలో ఒక్క దరఖాస్తు కూడా నమోదుకాలేదు. జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని జిల్లా కలెక్టర్ బీ.శ్రీధర్ వెల్లడించారు.
ప్రజల వాణిని వినిపిస్తాం
ప్రజాధనాన్ని దోచుకోవడం రాజకీయ నాయకులకు హక్కుగా మారింది. అవినీతికి వ్యతిరేకంగా, మహిళల రక్షణ కోసం పార్టీ తరపున పెద్దెత్తున ఉద్యమాలు చేశాం. చట్టసభల్లో ప్రజల వాణిని వినిపించేందుకే నేను ఎన్నికల్లో పోటీచేస్తున్నా. ఎంసీపీఐ(యు)పార్టీతో మా పార్టీకి పొత్తు ఉంది. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కచ్చితంగా గెలిచేందుకు పోరాడతాం. ఖైరతాబాద్ నుంచి కూడా మా పార్టీ అభ్యర్థిగా ఇ.హేమలత గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- సిహెచ్.మురహరి, ఎస్‌యుసీఐ(సి) అభ్యర్థి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం