వారెవ్వా ‘వాలెట్‌’! | 33.31 lakh RTA M wallet App Users | Sakshi
Sakshi News home page

వారెవ్వా ‘వాలెట్‌’!

Published Sat, Sep 14 2019 10:12 AM | Last Updated on Sat, Sep 14 2019 10:12 AM

33.31 lakh RTA M wallet App Users - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఎం–వాలెట్‌. ఇప్పుడు మరోసారి వాహనదారులంతా దీనిపైనే దృష్టిసారించారు. వివిధ రకాల ధృవపత్రాలను మొబైల్‌ ఫోన్‌లోనే భద్రపరుచుకొనే  అద్భుతమైన సదుపాయం, డాక్యుమెంట్‌లను వెంట తీసుకెళ్లవలసిన అవసరం లేకపోవడం, కేవలం మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఆపరేట్‌ చేసే వీలుండడంతో వాహనదారులు ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. ఈ యాప్‌ ఉంటే అన్నిరకాల డాక్యుమెంట్‌లు జేబులో ఉన్నట్లే  లెక్క.  డ్రైవింగ్‌ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్‌ వంటి వివిధ రకాల సర్టిఫికెట్‌లను ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకొనేవిధంగా రవాణాశాఖ ఎం–వాలెట్‌ మొబైల్‌ యాప్‌ను  అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్‌ యాప్‌  ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది వాహనదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. డాక్యుమెంట్‌లను ఎం–వాలెట్‌లో  భద్రపరుచుకున్నారు. ఈ వాలెట్‌కు రవాణాశాఖ చట్టబద్ధత కల్పించడంతో అనూహ్యంగా డిమాండ్‌ నెలకొంది. ఇటీవల కేంద్రంకూడా ఈ వాలెట్‌ను గుర్తించింది. దీంతో  దేశంలో ఎక్కడైనా ఎం–వాలెట్‌ సేవలను వినియోగించుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  ఈ యాప్‌ తాజాగా మరోసారి వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తగా సవరించిన రోడ్డు భద్రతా చట్టం దృష్ట్యా మరో సారి ఎం–వాలెట్‌కు డిమాండ్‌ ఏర్పడింది. 

ఒక్క వాలెట్‌ చాలు...
రోడ్డు భద్రత నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంతో వాహనదారులంతా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ  ఈ చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల ఉల్లంఘనలపై రూ.1000 నుంచి రూ.10,000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనదారులు  జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేంద్రం విధించిన జరిమానాలను తగ్గించి అమలు చేసే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఏ క్షణంలోనైనా కొత్త చట్టంకొరడా ఝళిపించే  అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం జరిమానాలను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ  ఇప్పుడు ఉన్న పెనాల్టీల కంటే పెద్ద మొత్తంలోనే భారం పెరగనుంది. దీంతో వాహనదారులు  ఇప్పటి నుంచే కొత్త చట్టానికి అనుగుణంగా నిబంధనలను పాటిస్తున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్సీ వంటి వివిధ రకాల డాక్యుమెంట్‌లపైన కూడా శ్రద్ధ చూపుతున్నారు. దీంతో మూడేళ్ల క్రితమే రవాణాశాఖ  అమల్లోకి తెచ్చిన ఎం–వాలెట్‌ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా మారింది. అన్ని రకాల  డాక్యుమెంట్‌లను ఎలక్ట్రానిక్‌ పత్రాల రూపంలో ఈ వాలెట్‌ ద్వారా భద్రపరుచుకుంటున్నారు. గత వారం రోజుల్లో సుమారు 15 వేల మందికి పైగా వాహనదారులు తమ మొబైల్‌ ఫోన్‌లలో ఎం–వాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అంచనా.

33 లక్షలకు పైగా వాహనదారులు
మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎం–వాలెట్‌ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 33.31 లక్షలకు పెరిగింది. ఈ వాహనదారులు 68.81 లక్షల డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఎక్కువ శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ పత్రాలు, ఇన్సూరెన్స్‌ ఉన్నాయి. ఆ తరువాత పర్మిట్‌లు, ఫిట్‌నెస్‌ పత్రాలను ఎక్కువ మంది తమ మొబైల్‌ ఫోన్‌లలో ఎం–వాలెట్‌ యాప్‌ ద్వారా భద్రపరుచుకున్నారు. త్వరలో కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్‌లను కూడా ఈ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీఏ అధికారులు  తెలిపారు. మరోవైపు తమ వాహనాలపైన నమోదైన ట్రాఫిక్‌ ఉల్లంఘనలను సైతం ఈ యాప్‌ ద్వారా తెలుసుకొని ఆన్‌లైన్‌లో చెల్లించే సదుపాయం ఉంది. తెలంగాణతో పాటు దేశంలో ఎక్కడైనా సరే ఎం–వాలెట్‌లో ఉన్న  ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్‌లకు చట్టబద్ధతను కల్పిస్తూ కేంద్రం  ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో  ఈ వాలెట్‌ వినియోగం బాగా పెరిగింది. ఆన్‌లైన్‌ సేవల వినియోగంలో  రవాణాశాఖ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉందని  రవాణాశాఖ ఉన్నతాధికారి  ఒకరు  తెలిపారు. రవాణాశాఖలో ఇటీవల కాలంలో స్మార్ట్‌కార్డులకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది, స్టేషనరీ మెటీరియల్‌ లేకపోవడంతో లక్షలాది స్మార్ట్‌ కార్డుల ముద్రణ నిలిచిపోయింది. దీంతో ఎం–వాలెట్‌ వినియోగం మరింత పెరిగిపోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement