శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థానంలో నిర్మించి ఇవ్వనున్న టీ సర్కారు
హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో జీ+2 అపార్ట్‌మెంట్లుగా నిర్మాణం
మూడో తేదీన సీఎం శంకుస్థాపన
హైదరాబాద్: హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థలంలోనే తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఫ్లాట్లను నిర్మించి ఇవ్వనుంది. దీనిపై గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 37 కోట్లను మంజూ రు చేస్తూ ఫైలుపై సోమవారం సంతకం చేశారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన నియోజకవర్గంలోని పేదలను ఇటీవల ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం అక్కడిక్కడే కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ఐడీహెచ్ కాలనీ, అంబూగూడ, సుభాష్ చంద్రబోస్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, పార్థీవాడల్లోని నిరుపేదలైన దాదాపు 400 మందికి.. ఒక్కో ఫ్లాట్‌ను 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి అందజేయనున్నారు. వీటిని జి+2 అపార్ట్‌మెంట్లుగా నిర్మిస్తారు. విజయదశమి రోజున సీఎం కేసీఆర్ వీటికి శంకుస్థాపన చేయనున్నారు. దళితులకు ఎస్సీ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. మైనారిటీలు, బీసీలకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫైలు వచ్చిన గంటలోపే సీఎం సంతకం చేసి పంపించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం తలసాని సీఎంను కలిసి వెళ్లడం.. ఈ ఫైలును పెండింగ్‌లో పెట్టకుండా సీఎం వెంటనే ఆమోదించడం గమనార్హం.
కుమార్తె పెళ్లి నిశ్చితార్థం కోసం..
సీఎం కేసీఆర్‌ను తన కుమార్తె వివాహ నిశ్చితార్థానికి ఆహ్వానించడం కోసం కలిశానని టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. తలసాని సోమవారం ఉదయం కేసీఆర్‌ను కలిశారు. ఆయన టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కేసీఆర్‌ను కలవడానికి రాజకీయ కారణాలేమీ లేవని తలసాని చెప్పారు. 3వ తేదీన తన కుమార్తె వివాహా నిశ్చితార్థం ఉందని, కార్యాక్రమానికి కేసీఆర్‌తోపాటు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానించానని తెలిపారు.
పేదలకు ఉచితంగా 400 ఫ్లాట్లు!
Published Tue, Sep 30 2014 2:29 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM
Advertisement
Advertisement