తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు
మెదక్ రూరల్: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు కలవరపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. పాఠశాలలో 298 మంది విద్యార్థినులు చదువుతుండగా సోమవారం సుమారు 30 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సైతం ఫుడ్ పాయిజన్ కారణంగా ఏకంగా 46 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాల య్యారు. విద్యార్థులు ఆస్పత్రి పాలుకావడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్లే తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ నగేష్, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సుధాకర్‌లు హుటాహుటిన మెదక్ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితిని చూసి నిర్ఘాంత పోయారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు సూచించారు. జేసీ నగేష్ మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలో భోజనాలకు వాడుతున్న సరుకులను పూర్తిగా తొలగించి, కొత్త వాటిని తీసుకు రావాలని, తాగే నీటిని పరీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment