ఈ టెన్షన్‌ ఎటువైపో? | 471 Positive Cases in Gandhi Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ టెన్షన్‌ ఎటువైపో?

Published Wed, May 6 2020 8:01 AM | Last Updated on Wed, May 6 2020 8:01 AM

471 Positive Cases in Gandhi Hospital Hyderabad - Sakshi

కోవిడ్‌ భయంతో నగరంలోని పలు ప్రాంతాలు వణుకుతున్నాయి. రోజురోజుకు కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 40 రోజులపాటు ఎలాంటి పాజిటివ్‌లు లేని ప్రాంతాల్లో సైతం కొత్తగా వైరస్‌ వెలుగుచూస్తుండడం కలవరపెడుతోంది. ఎన్నారైలు, మర్కజ్‌ మూలాలు లేని వారికి సైతం వైరస్‌ సోకుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వనస్థలిపురంలో కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగా రెండు కుటుంబాలకు చెందిన 16 మంది వైరస్‌బారిన పడ్డారు. జియాగూడలోనూ ఒకే వ్యక్తి నుంచి ఏడుగురికి వైరస్‌ సోకింది. వీరిలో ఒకరు మృతిచెందారు. మొత్తానికి కరోనా వైరస్‌ గ్రేటర్‌ వాసులను తీవ్రంగా భయపెడుతోంది.

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ పలు ప్రాంతవాసుల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 40 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉన్న ప్రాంతాలు హఠాత్తుగా రాత్రికి రాత్రే.. కంటైన్మెంట్‌ జోన్లుగా మారుతుండటంతో ఆయా ప్రాంతవాసుల్లో టెన్షన్‌ మొదలైంది. ఎన్నారై.. మర్కజ్‌ మూలాలతో సంబంధం లేని వ్యక్తులు వైరస్‌ భారిన పడుతుండటం, వారి నుంచి వారి కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుండటం, వీరిలో వృద్ధులు మృత్యువాత పడుతుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఒక వ్యక్తి కుటుంబంలో 10 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరో వ్యక్తి కుటుంబంలో 6 కేసులు నమోదయ్యాయి. కేవలం ఇద్దరి వ్యక్తుల ద్వారా వనస్థలిపురం ఎ–క్వార్టర్స్, ఎస్‌కేడీనగర్, హుడాసాయినగర్, హిల్‌కాలనీల్లోని 16 మందికి వైరస్‌ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. 

ఆ ఇద్దరి నుంచి 16 మందికి...
మలక్‌పేట్‌గంజ్‌లో పల్లినూనె వ్యాపారం చేసే వ్యక్తి(52) ద్వారా శారదానగర్‌లో ఉన్న ఆయన భార్యతో పాటు వనస్థలిపురం ఎ–క్వార్టర్స్‌లో ఉంటున్న ఆయన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరుడి భార్య, వారి ఇద్దరు పిల్లలు సహా ఎస్‌కేడీనగర్‌లో ఉంటున్న వారి సోదరి సహా బావ.. ఇలా మొత్తం 10 మందికి వైరస్‌ విస్తరించింది. ఇక వనస్థలిపురం హుడా సాయినగర్‌ కాలనీకి చెందిన వృద్ధురాలు(64) ఇటీవల హిల్‌కాలనీలోని తన కూతురి వద్దకు వెళ్లింది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా వ్యాధి నిర్ధారణ పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆమెకు సన్నిహితంగా మెలిగిన కుమారుడు, అల్లుడు, కుమార్తె, ఇద్దరు మనవళ్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్‌ వచ్చింది. కోడలు సహా మరో ఇద్దరు మనమళ్లకు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వృద్ధురాలి అల్లుడు హిల్‌కాలనీలో జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. ఆయన నుంచి మరెంత మందికి వైరస్‌ విస్తరించి ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇలా కేవలం ఇద్దరు వ్యక్తుల ద్వారా 16 మందికి వైరస్‌ సోకడంతో స్థానికులు భయం.. భయంగా గడుపుతున్నారు.

కొత్తగా మరో 17 సస్పెక్టెడ్‌ కేసులు
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 471 పాజిటివ్‌ కేసులు ఉండగా, వీరిలో 50 మంది పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరిద్దరి మినహా మిగిలిన వారందరి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో రెండు పాజిటివ్, ఒక సస్పెక్టెడ్‌ కేసు ఉంది. కొత్తగా ఒకరు అడ్మిట్‌ కాగా, ఇప్పటికే ఇక్కడ ఉన్న వారిలో నలుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో కొత్తగా 8 మంది చేరారు. కొత్తగా ఇక్కడ 3 పాజిటివ్‌ కేసులు రిపోర్ట్‌ కాగా, 10 మందిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మంది ఉండగా, 12 మంది నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఇక నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కొత్తగా మరో 8 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు.

ఎంపీ రేవంత్‌రెడ్డి పర్యటన...
మల్కాజ్‌గిరి ఎంపీ .రేవంత్‌రెడ్డి మంగళవారం వనస్థలిపురం హుడా సాయినగర్‌లో పర్యటించారు. కరోనా కేసుల గురించి జీహెచ్‌ఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా సోకిన వారికి కాంట్రాక్ట్‌లో ఉన్న అందరికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సకాలంలో కరోనా బాధితులను గుర్తించి వారికి వైద్యసేవలు అందించకపోవడం వల్లనే   వనస్థలిపురంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఎంపీ వెంట కొప్పుల నర్సింహారెడ్డి, మకుటం సదాశివుడు, దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి  పాల్గొన్నారు.

కంటైన్మెంట్‌ జోన్లుగా..
వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఉన్న హుడా సాయినగర్‌కాలనీ, కమలానగర్, వనస్థలిపురం ఏ, బీ–టైప్‌ క్వార్టర్స్, సచివాలయనగర్, బీఎన్‌రెడ్డినగర్, ఎస్‌కేడినగర్‌ తదితర కాలనీలను కంటైన్మెంట్‌ జోన్లుగా మార్చారు. ఈ కాలనీలకు రాకపోకలు నిలిపి వేశారు. సిబ్బంది ద్వారా కాలనీలకే నిత్యావసరాలు, కూరగాయలు సరఫరా చేస్తున్నారు.

లక్ష్మీనగర్‌లో ఓ వ్యక్తికి...
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. తాజాగా జంగమ్మెట్‌ డివిజన్‌లోని లక్ష్మీనగర్‌లో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో అంతా కలవరానికి గురవుతున్నారు. వారం రోజులుగా దగ్గు, దమ్ముతో బస్తీలో తిరిగిన వ్యక్తికి కరోనా సోకడంతో.. అతడి ప్రభావం ఎంతమందిపై పడిందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీనగర్‌కు చెందిన వ్యక్తి(45) మలక్‌పేట గంజ్‌లోని ఐటీసీలో పని చేస్తున్నాడు. వారం రోజుల నుంచి దగ్గుతో బాధ పడుతుండటంతో ఐదు రోజుల క్రితమే ఛత్రినాక పోలీసుల సాయంతో ఉస్మానియాకు.. అక్కడి నుంచి ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రికి వెళ్లాడు. సాధారణ దగ్గు అని వైద్యులు చెప్పడంతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం అతడిని స్థానికులు కింగ్‌ కోఠి ఆస్పత్రికి పంపించగా.. పాజిటివ్‌గా తేలడంతో గాంధీకి తరలించారు. ఈ కాంప్లెక్స్‌లో ఏడు కుటుంబాల్లో దాదాపు 30 మంది వరకు నివాసం ఉన్నట్లు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతడిని ఛాతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ను కూడా హోం క్వారంటైన్‌ చేశారు.  

మెడికల్‌ షాప్‌ యజమానికి
చాదర్‌ఘాట్‌: అక్బర్‌బాగ్‌ డివిజన్‌ పల్టాన్‌ కాలనీకి చెందిన మెడికల్‌ షాప్‌ యజమానికి(57) కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈయన మల్లేపల్లిలో మెడికల్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం జ్వరంగా ఉందని ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్‌ రావటంతో గాంధీకి తరలించారు.  

ఓ వ్యక్తి మృతి, జీహెచ్‌ఎంసీ  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి పాజిటివ్‌..
జియాగూడ: కరోనా పాజిటివ్‌తో ఓ వ్యక్తి మృతి చెందగా ఒకే కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఏడుగురికి పాజిటివ్‌ ఉన్నట్లు కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సబ్జిమండి గంగపుత్రనగర్‌కు చెందిన వ్యక్తి(51) సబ్జిమండి కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తుంటాడు. వారం రోజుల నుంచి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. జియాగూడలోని సాయిదుర్గానగర్‌లో నివసిస్తున్న జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్స్‌ ఉద్యోగి(50)కి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఇదే కుటుంబం నుంచి ఇప్పటివరకు ఏడుగురికి పాజిటివ్‌గా తేలిందని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement