సిరిసిల్ల బంద్ ఉద్రిక్తం
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మంగళవారం బంద్ ఉద్రిక్తంగా మారింది. సిరిసిల్ల జిల్లా సాధన కోసం 48 గంటల బంద్‌కు జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది. తొలి రోజు 3 ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు సాంచాలను బంద్ చేశారు. టెక్స్‌టైల్ పార్క్‌ను మూసేశారు. నేతకార్మికులు రోడ్డె క్కి సిరిసిల్ల జిల్లా కోసం నినదించారు. పట్టణంలో వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, హోటళ్లు మూసేశారు. రోడ్డు పై వంటావార్పు చేసి, సామూహిక భోజ నాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి సిరిసిల్ల జిల్లా కోసం నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. రోడ్డపై టైర్లను కాల్చి నిరసన తెలిపారు. బీజేపీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ పార్టీల నేతల బంద్‌లో పాల్గొన్నారు. కాగా కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి 48 గంటల బంద్ పిలుపు నేపథ్యంలో మంగళవారం పట్టణంలో రాస్తారోకోలు.. ర్యాలీలు.. ధర్నాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు మూడు వేలమంది బీడీ కార్మికులు హైవేపై ర్యాలీ నిర్వహించారు. మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌ను కోరుట్లకు మార్చి అన్యాయం చేయొద్దంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ నిర్వహించారు.