ఆస్తులున్నా ఆసరా! | Pensions to the not eligibles | Sakshi
Sakshi News home page

ఆస్తులున్నా ఆసరా!

Published Sun, Jun 21 2015 4:14 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఆస్తులున్నా ఆసరా! - Sakshi

ఆస్తులున్నా ఆసరా!

సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలకు, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, గీత కార్మికులకు ఆసరా కల్పించేందుకు పింఛన్ల పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తూ సిరిసిల్ల మున్సిపల్ అధికారులు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. అనర్హులకు పింఛన్లు ఇవ్వొద్దని, ఒక్క అర్హుడికి అన్యాయం జరుగొద్దని రాష్ట్ర ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కె.తారకరామారావు పలుమార్లు ప్రకటించారు. కానీ, ఇందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఆసరా పింఛన్లను స్వాహా చేస్తున్నారు. చనిపోయినవారి పేరిట పింఛన్ సొమ్ము కాజేస్తున్నారు. వైకల్యం లేకపోయినా వికలాంగులుగా పేర్కొంటూ ఆసరా పొందుతున్నారు. రాజకీ య నాయకుల జోక్యం, పారదర్శకతలేని అధికారులతో సిరిసిల్ల మున్సిపాలిటీలో మూడో వంతు పింఛన్లు పక్కదారి పడుతున్నాయి.

 ప్రతి నెల రూ.35 లక్షలు స్వాహా
 సిరిసిల్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. 34 వార్డులుగా తయారు చేశారు. సిరిసిల్లలో 2,934 వితంతు పింఛన్లు, 2,630 నేత కార్మిక పింఛన్లు, 3,075 వృద్ధాప్య పింఛన్లు, 1,322 వికలాంగుల పింఛన్లు, 54 గీత కార్మిక పింఛన్లు ఉన్నాయి. ప్రతి నెల రూ.1.06 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో మూడో వంతు పింఛన్లు రూ.35 లక్షల మేర స్వాహా అవుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలో 16 వేల కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైంది. ఇందులో 10,015 పింఛన్లు అందిస్తున్నారు. అంటే కేవలం ఆరువేల కుటుంబాలకే పింఛన్లు లేవు. ఇంటికి ఒకే పింఛన్ నిబంధన కూడా పట్టించుకోకుండా ఒక్కో ఇంట్లో మూడు, నాలుగేసి మంజూరు చేశారు.

 అక్రమాలకు ఆనవాళ్లు
► పట్టణంలోని శాంతినగర్‌లోని ఇంటి నంబర్ 3-4-61 చెందిన దొంతు లక్ష్మికి రెండు పింఛన్లు ఉన్నాయి.
► అనంతనగర్‌కు చెందిన మేర్గు వీరేశంకు రెండు పింఛన్లు ఇస్తున్నట్లు మున్సిపల్ రికార్డుల్లో ఉంది.
► టీడీపీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు తీగల శేఖర్‌గౌడ్‌కు మార్కెట్లో పెద్ద ఇల్లు ఉండగా, బార్ యజమాని. వికలాంగుడిగా రూ.1500 ఆసరా పింఛన్ పొందుతున్నారు.
► సిద్దులవాడకు చెందిన బల్యాల మల్లమ్మ జనవరి 14న చనిపోయింది. ఆమె పేరిట పింఛన్‌ను ప్రతినెల అందిస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. ఆమె పింఛన్ సొమ్ము రూ.వెయ్యి నొక్కేస్తున్నారు.
► నెహ్రూనగర్‌కు చెందిన అన్నారం బాలయ్య బీడీ కంపెనీ టేకేదారు. కౌన్సిలర్ మామ. ఆయన నేత కార్మిక పింఛన్ పొందుతున్నారు.
► వెంకంపేటలో గౌడ విఠల్ పేరిట వృద్ధాప్య, నేత కార్మిక పింఛన్లు అందిస్తున్నారు. విఠల్ కొడుకు కౌన్సిలర్.
► ఆర్‌టీఏ ఏజెంటుగా పనిచేసే రాములు నేత కార్మికుడిగా పింఛన్ పొందుతున్నారు.
► పదేళ్ల బాబు చాంద్‌బీ మహ్మద్ వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు.
► సాయినగర్‌కు చెందిన ఎల్‌ఐసీ ఏజెంటు విశ్వనాథుల శ్రీధర్ 40 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ పొందుతున్నారు.
► 7వ వార్డుకు చెందిన పోలు ప్రకాశ్ వ్యాపారి. కిరాణ దుకాణం నడిపే ప్రకాశ్ గీత కార్మికుడిగా పింఛన్ తీసుకుంటున్నారు.
► సాయినగర్‌కు చెందిన కూల్ల హన్మయ్య స్థానికేతరుడు. స్థానికుడిగా పేర్కొంటూ పింఛన్ పొందుతున్నారు.
► సాయినగర్‌కు చెందిన వెల్గం రాజేశం పేరిట వృద్ధాప్య, చేనేత, వికలాంగుల పింఛన్ మూడు పింఛన్లు పొందుతున్నారు. వేర్వేరు ఇంటినంబర్లతో పింఛన్ పొందుతున్నారు.
► పోచమ్మ వీధి ఇంటి నంబర్ 4-7-20కి చెందిన మంచాల నర్సప్ప పేరిట రెండు పింఛన్లు ఉన్నాయి.

 అడ్డగోలుగా స్వాహాకార్యం
 రెండు,మూడు పింఛన్లు రికార్డుల్లో ఉండగా, ఆ మేరకే మున్సిపల్ సిబ్బందే పింఛన్ల సొమ్ముని స్వాహా చేస్తున్నారు. పట్టణంలో చనిపోయిన వారి పేరిట రద్దు చేయకుండా అలాగే కొనసాగిస్తూ ఫోర్జరీ సంతకాలతో సొమ్ములు కాజేస్తున్నారు. కొందరు కౌన్సిలర్లు తమ సన్నిహితులకు, బంధువులకు అర్హతలు లేకపోయినా పింఛన్లు మంజూరు చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేయలేదని అన్ని అర్హతలు ఉన్నవారికి ఆసరా పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.

సిరిసిల్లలో నెలకు రూ.కోటికి పైగా పింఛన్లు పంచుతుండగా, మూడో వంతు పింఛన్లు రూ.35 వేల మేర పక్కదారి పడుతున్నాయి. ఎనిమిది నెల లుగా రూ.2.80 కోట్లు ప్రజాధనం వృథా అ యింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సిరిసిల్లలో జరుగుతున్న స్వాహాకార్యంపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో విచారిస్తే అర్హులకు పిం ఛన్లు అందుతాయి.మంత్రి కేటీఆర్ బోగస్ పిం ఛన్లపై దృష్టి సారించాలని సిరిసిల్ల అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు.
 
 బోగస్ పింఛన్లు ఏరివేస్తాం
 సిరిసిల్లలో బోగస్ పింఛన్లను ఏరివేస్తాం. ఎవర్ని వదిలిపెట్టం. ఆసరా పింఛన్లలో పొరపాట్లు జరిగాయి. వాటిని గుర్తించాం. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేస్తున్నాం. తప్పులను సవరించి అర్హులకు ఆసరా కల్పిస్తాం. అనర్హుల వివరాలను అందిస్తే వెంటనే రద్దు చేస్తాం.
 - బడుగు సుమన్‌రావు, మున్సిపల్ కమిషనర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement