మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం! | 50 students complaint to the district education officer | Sakshi
Sakshi News home page

మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం!

Published Wed, Aug 30 2017 1:57 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

50 students complaint to the district education officer

నిత్యం లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన
- ఈ హెచ్‌.ఎం. మాకొద్దు.. విధుల నుంచి తొలగించండి
జిల్లా విద్యాధికారికి 50 మంది విద్యార్థినుల ఫిర్యాదు 
 
హాలియా (నాగార్జునసాగర్‌): ‘‘ఈ సారు మాకొద్దు.. ఆయన పెట్టే లైంగిక వేధింపులు భరించలేక మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది’’అంటూ 50 మంది విద్యార్థినులు హెచ్‌ఎంపై మంగళవారం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. నిత్యం తమపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని మొర పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా కృష్ణమూర్తి కొంత కాలంగా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని 8,9 తరగతులకు చెందిన విద్యార్థినులు ఆరోపించారు.

ప్రధానోపాధ్యాయుడి వ్యవహారశైలితో తమకు జీవితంపై విరక్తి కలుగుతుందని, మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి తరి రాములును వారంతా ఒక్కసారిగా చుట్టుముట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు. హెచ్‌ఎం తీరుపై కంటతడి పెట్టారు. సదరు ప్రదానోపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిందితుడు కష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, విద్యార్థినులు సదరు ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారని, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు మండల విద్యాధికారి రాములు చెప్పారు. 
 
ప్రధానోపాధ్యాయుడు వివరణ :ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తిని వివరణ కోరగా.. పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఐక్యత కొరవడిందని, దీంతో తనపై కావాలనే నిందలు వేయిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినులకు క్రమశిక్షణ పాటించాలని చెప్పడంతో తనపై కక్షగట్టారని ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement