కీసర: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ వివేకం కోల్పోయాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కీసర మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంకిరెడ్డిపల్లిలో కేఆర్‌కే డీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ సాంబారెడ్డి కొంతకాలంగా విద్యార్థినులతో వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
విద్యార్థినులను తన కార్యాలయంలోకి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించసాగాడు. వారి సెల్‌ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వికృతానందం పొందుతున్నాడు. విషయం ఎవరికైనా చెబితే హాజరుశాతం లేదని ఫెయిల్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ విషయం విద్యార్థులు కళాశాల డెరైక్టర్ రాధాకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేఆర్‌కే డీఎడ్ కళాశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.
ఆరోపణలు అవాస్తవం
విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండటంతో ప్రిన్సిపాల్ కఠినంగా వ్యవహరించారని, ఇది మింగుపడని విద్యార్థులు అనవసరమైన అభాండాలు వేస్తున్నారని కేఆర్‌కే డీఎడ్ కళాశాల చైర్మన్ రాధాకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. విద్యార్థుల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు.
కీచక ప్రిన్సిపాల్!
Published Tue, Feb 24 2015 12:47 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement