5 నెలల్లో 550 కోట్ల బకాయి! | 550 crore debt for 5 months in Women free loans Scheme | Sakshi
Sakshi News home page

5 నెలల్లో 550 కోట్ల బకాయి!

Published Tue, Mar 18 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

5 నెలల్లో 550 కోట్ల బకాయి!

5 నెలల్లో 550 కోట్ల బకాయి!

వడ్డీ లేని రుణ పథకంపై సర్కారు నిర్లక్ష్యం
రూ. 1,600 కోట్లకు గాను బడ్జెట్‌లో ప్రతిపాదించిందే రూ. 700 కోట్లు
5 నెలలుగా మహిళల ఖాతాల్లో జమకాని వడ్డీ

 
సాక్షి, హైదరాబాద్: ‘సంక్షేమ పథకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధుల సమస్య రానీయం. ఇతర పథకాలకు నిధులు ఆగినా, సంక్షేమ పథకాలకు మాత్రం గ్రీన్‌చానల్ నుంచి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే నిధులు ఠంఛనుగా సంబంధిత శాఖలకు వెళ్లిపోతాయి. అన్ని పథకాలూ అమలవుతాయి’ అంటూ అధికారంలో ఉన్నప్పుడు పాలకులు ఊదరగొడితే మహిళలు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వడ్డీలేని రుణ పథకం కింద తీసుకున్న రుణాలకు గత ఐదు నెలలుగా వడ్డీ విడుదల కాకపోవడంతో మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో బ్యాంకులు మహిళల నుంచే వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. మార్చితో కలిపి ఐదు నెలల వడ్డీ మొత్తం దాదాపు రూ.550 కోట్లను ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా వడ్డీని బ్యాంకుల ద్వారా మహిళా సంఘాల ఖాతాల్లోకి నేరుగా చెల్లిస్తామన్న ప్రభుత్వం నెలల తరబడి వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకులు మహిళల ముక్కుపిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నాయి.
 
 - 2012 జనవరి ఒకటో తేదీ నుంచి వడ్డీ లేని రుణాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
 - రూ.5 లక్షల లోపు రుణం తీసుకున్న మహిళా సంఘాలకే ఈ పథకాన్ని పరిమితం చేశారు.
 - రాష్ట్రంలోని ఏడు లక్షల మహిళా సంఘాలు.. అంటే సుమారు 70 లక్షల మంది మహిళలు వడ్డీలేని రుణాలు పొందారు.
-  మహిళా సంఘాలు తీసుకున్న రుణ వాయిదాలను ప్రతి నెలా నిర్ణీత గడువులోగా చెల్లిస్తేనే వడ్డీ పొందేందుకు అర్హులని ప్రభుత్వం నిబంధన విధించింది.
-  మహిళా సంఘాలు సకాలంలో అసలు చెల్లిస్తున్నా, ప్రభుత్వం వడ్డీ చెల్లించడం లేదు.
-  ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 1,600 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంది.
-  కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో వడ్డీ చెల్లింపులకు ప్రతిపాదించిన మొత్తమే రూ. 700 కోట్లు.
 - గత ఐదు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో బకారుుల మొత్తం రూ. 550 కోట్లకు చేరింది.
-  బకారుుల విడుదలకు పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) అధికారులు లేఖలు రాస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది.
-  రాబడి తగ్గి రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో వడ్డీ బకాయిలు విడుదలయ్యే పరిస్థితీ కనిపించడం లేదు.
-  ఇక ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు.
 
 మూడుసార్లు లేఖ రాశాం
 మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిలపై ప్రభుత్వానికి మూడుసార్లు లేఖలు రాశాం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మొత్తమే కాకుండా బంగారు తల్లి కింద రూ.20 కోట్లు కూడా విడుదల చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులూ రావడం లేదు.
 -‘సెర్ప్’ ఉన్నతాధికారి
 
 వడ్డీలేని రుణాలు అంతా మోసం
 ప్రభుత్వం పేరుకే వడ్డీలేని రుణాలని చెప్పింది. మా సంఘ సభ్యులం యాచారం ఎస్‌బీెహ చ్‌లో రూ. 40 వేల రుణం తీసుకున్నాం.  నెల నెలా సక్రమంగా చెల్లించాం. మరోసారి మూడు నెలల కిందే తీసుకున్న అప్పు కూడా పూర్తిగా చెల్లించాం. కానీ తీసుకున్న అప్పుకు రూ.2 వడ్డీ పడింది. అంతా మోసం        
 - కొప్పు సుకన్య,
 అంబేద్కర్ మహిళా పొదుపు సంఘం,  
 యాచారం (రంగారెడ్డి జిల్లా)

 
 రూ. 2 వరకు వడ్డీ పడుతోంది
 వూ సంఘ సభ్యులం నక్కర్త ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకుంటాం. మొదట్లో తీసుకున్న రూ. 2 లక్షల అప్పుకు పావలా వడ్డీ కూడా జమ కాలేదు. బ్యాంకులో, ఐకేపీ సిబ్బందిని అడిగితే జమ అవుతుందని అంటున్నారు. కానీ కాలేదు.  వడ్డీలేని రుణాలంటున్నారు కానీ రూపాయి నుంచి రూ. 2 వరకు వడ్డీ పడుతోంది.        
 - రామావత్ కౌసల్య,
 ఝాన్సీబాయి మహిళా పొదుపు సంఘం,
 తక్కళ్లపల్లి తండా (రంగారెడ్డి జిల్లా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement