వడపోత
రేపటిలోగా జీఓ 59 దరఖాస్తుల పరిశీలన
ఆ తర్వాత క్షేత్రస్థాయికి అధికారులు
ఆరు కేటగిరీలు మినహా అన్నింటికీ మోక్షం
ఆగస్టులో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జీఓ 59 దరఖాస్తుల వడపోత మొదలైంది. అభ్యంతరకర స్థలాల జాబితాను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల పరిశీలనకు నడుంబిగించిన జిల్లా యంత్రాంగం.. ముందుగా క్రమబద్ధీకరణకు అనువుగాని స్థలాలకు సంబంధించిన అర్జీలను వేరు చేస్తోంది. ఆగస్టు నెలాఖరులోగా జీఓ 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు గడువు నిర్ధేశించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్గదర్శకాలను కూడా జారీచేసింది. 27 అంశాలతో కూడిన చెక్‌లిస్ట్‌ను కూడా అందజేసింది. ఈ మేరకు స్థలాల క్రమబద్ధీకరణ పర్వాన్ని కొనసాగించాలని నిర్ధేశించింది. 125 గజాల్లోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీఓ 58 కింద ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన అధికార యంత్రాంగం.. చెల్లింపు కేటగిరీలోనూ అదే తరహాలో ముందుకు నడవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా వివాదాస్పద /అభ్యంతరకర స్థలాల క్రమబద్ధీకరించకూడదని సంకల్పించిం ది. మరీ ముఖ్యంగా అభ్యంతరకర భూములుగా తేల్చిన వక్ఫ్, రైల్వే, రక్షణ, రిజర్వ్‌ఫారెస్ట్‌లు, ఖాళీ స్థలాలు, పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల జోలికి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఇవేకాకుండా ఎఫ్‌టీఎల్, శిఖం, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శ్మశానవాటికల్లో కట్టడాలను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, జీఓ 58 కింద వచ్చిన ఇలాం టి దరఖాస్తులను రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించినట్లు చెప్పారు.
భూమి స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటున్న సర్కారు.. ఒక్కో దరఖాస్తును ని శితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇదే సూత్రం చెల్లింపు కేటగిరీలో వచ్చిన దరఖాస్తులకూ వర్తిస్తుందని చెప్పారు. కాగా, అభ్యంతరకర స్థలాల జాబితా సోమవారంలోపు కొలిక్కివస్తుందని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికారుల బృందాలు పర్యటించి క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలిస్తారని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, జీఓ 59 కింద జిల్లావ్యాప్తంగా 11,744 దరఖాస్తులు రాగా, దీనికి సంబంధించి ఖజానాకు రూ.68.92 కోట్ల రాబడి వచ్చింది. క్రమబద్ధీకరణకు నోచుకునే నిర్మాణదారులు ఐదు విడతలుగా నిర్ధేశిత కనీస ధర చెల్లించే వెసులు బాటు కల్పించిన తరుణంలో.. క్రమబద్ధీకర ణతో సుమారు రూ.250 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.