శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడిని లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. అందులో 700 గ్రాముల బంగారు బిస్కెట్టు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాగా వరంగల్ జిల్లాలోని కాజీపేట జంక్షన్ లో గురువారం ఉదయం 14 కిలోల బంగారాన్ని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీల సందర్భంగా రెండు బ్యాగుల్లో అనుమాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. బ్యాగులో ప్యాకింగ్ ఉన్న 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ బజ్జూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్టు విచారణలో తేలింది. అయితే బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చలాన్ లో ఉందని, కానీ నిందితుల దగ్గర 14.700 కిలోల మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. పట్టబడిన బంగారం, రసీదులలో తేడా ఉండటంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి , బంగారాన్ని సీజ్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.