- ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో చకచకా ఏర్పాట్లు
- పాల్గొననున్న సీఎం, అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు
- భూముల క్రమబద్ధీకరణ, భూ సేకరణ అంశాలే ప్రధాన ఎజెండా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విబాగం(ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే రెవెన్యూ శాఖ సేకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ, భూ సేకరణకు సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నెరవేర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాస్తవ పరిస్థితులపై రెండ్రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల కమిషనర్లు, కార్పొరేషన్ల మేనేజింగ్ డెరైక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
చర్చకు రానున్న అంశాలివే..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణకు మూడున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినా.. ఎంపికైన లబ్ధిదారుల సంఖ్య 30 శాతానికి మించకపోవడం పై సర్కారు దృష్టి సారించనుంది.
క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక నెమ్మదిం చడం, క్రమబద్ధీకరణ అడ్డంకులపై సమగ్రంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ, రైల్వే , శిఖం భూముల్లో నివాసముంటున్న వారికి స్థలాలను క్రమబద్దీకరించడంపై చర్చించనున్నారు.
‘మిషన్ కాకతీయ’ అమలు, ఇబ్బందులను అధిగమించేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
‘వాటర్‌గ్రిడ్’కు అవసరమైన భూసేకరణపైనా విస్తృతమైన చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టులో పైప్‌లైన్ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం ఇప్పటికే ‘రైట్ టు యూజ్, రైట్ టు వే’ చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో చట్టాల అమలుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు భూముల కేటాయింపు, గతంలో సంస్థలకు కేటాయించిన వినియోగంలోకి రాని భూ ములను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గ్రామాల్లో, పట్టణాల్లో మంచినీటి ఎద్దడిపై చర్చించే అవకాశం ఉంది.
పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రహదారుల ని ర్మాణం పురోగతి, ఆయా రహదారుల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల విని యోగంపై కూడా చర్చించనున్నారు.
‘పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు’ పథకం పదినెలలైనా కార్యరూపం దాల్చకపోవడంపై విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నందున ఈ విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఆసరా పింఛన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, బీడీ కార్మికులందరికీ భృతి అందకపోవడం, ఆహార భద్రతా చట్టం, ఎక్సైజ్ పాలసీ, టూరిజం అభివృద్ధి, భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగాల క ల్పన.. తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.