Marri Channa Reddy
-
నేటి నుంచి ‘ఆగ్నేయాసియా’ సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయాసియా దేశాల సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రారంభిస్తారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన సివిల్ సర్వెంట్లకు ఈ పేమెంట్లు, ఆర్థిక చేకూర్పు, సామాజిక భద్రత అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎఫ్ఓ సంజయ్ సక్సేనా, ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందూభూషణ్, చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు
సాక్షి, వికారాబాద్/షాద్‌నగర్: ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరించి మంచి పేరుప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి రామకృష్ణారావుది షాద్‌నగర్ నియోజకవర్గంలోని బూర్గుల స్వగ్రామం. మర్రి చెన్నారెడ్డిది వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం సిరిపురం. జిల్లాల పునర్విభజనలో భాగంగా షాద్‌నగర్ రంగారెడ్డి జిల్లాలో కలిసింది. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో 1899లో నర్సింగ్‌రావు, రంగనాయకమ్మ దంపతులకు రామకృష్ణారావు జన్మించారు. 1948 అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆయన విద్యా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. వినోబాభావే చేపట్టిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు. 1952లో షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత ఎల్ఎల్రెడ్డిపై 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ఉండటంతో తొలిముఖ్యమంత్రి పదవిని రామకృష్ణారావు అలంకరించారు. ఆయన తన హయాంలోనే రక్షిత కౌలుదారు(టెనెంట్) చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. అనంతరం 1956లో విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956–1960లో కేరళ, 1960–1962 ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1967 సెప్టెంబరు 14న ఆయన కన్నుమూశారు. బూర్గుల గ్రామంలో రామకృష్ణారావు స్మారక స్థూపాన్ని ప్రజలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ముద్ర వేసిన మర్రి.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి‘ పార్టీని ఏర్పాటు చేసి తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఈయన స్వగ్రామం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామం. మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు 1919 జనవరి 13 జన్మించారు. ప్రాథమిక విద్యను సిరిపురంలోనే పూర్తిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారంలో తన మేనమామ కొండా వెంకట రంగారెడ్డి వద్ద ఉంటూ ప్రాథమికోన్నత, వికారాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీసీ పూర్తి చేసి ఉస్మానియాలోనే డాక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1952, 1957లో వికారాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తాండూరు నుంచి పోటీచేశారు. 1962,1967లో విజయం సాధించారు. అనంతరం 1978లో మేడ్చల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1978–79, 1989–90లో రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. దీంతోపాటు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 27 ఏళ్ల పిన్నవయసులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన తన మేనమామ మీద ఉన్న అభిమానంతో ఆయన పేరుమీదే కొండా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. -
9, 10 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఎంసీఆర్హెచ్ఆర్డీలో చకచకా ఏర్పాట్లు పాల్గొననున్న సీఎం, అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు భూముల క్రమబద్ధీకరణ, భూ సేకరణ అంశాలే ప్రధాన ఎజెండా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విబాగం(ఎంసీఆర్ హెచ్ఆర్డీ) వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే రెవెన్యూ శాఖ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ, భూ సేకరణకు సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నెరవేర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాస్తవ పరిస్థితులపై రెండ్రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల కమిషనర్లు, కార్పొరేషన్ల మేనేజింగ్ డెరైక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. చర్చకు రానున్న అంశాలివే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణకు మూడున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినా.. ఎంపికైన లబ్ధిదారుల సంఖ్య 30 శాతానికి మించకపోవడం పై సర్కారు దృష్టి సారించనుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక నెమ్మదిం చడం, క్రమబద్ధీకరణ అడ్డంకులపై సమగ్రంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ, రైల్వే , శిఖం భూముల్లో నివాసముంటున్న వారికి స్థలాలను క్రమబద్దీకరించడంపై చర్చించనున్నారు. ‘మిషన్ కాకతీయ’ అమలు, ఇబ్బందులను అధిగమించేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ‘వాటర్‌గ్రిడ్’కు అవసరమైన భూసేకరణపైనా విస్తృతమైన చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టులో పైప్‌లైన్ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం ఇప్పటికే ‘రైట్ టు యూజ్, రైట్ టు వే’ చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో చట్టాల అమలుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు భూముల కేటాయింపు, గతంలో సంస్థలకు కేటాయించిన వినియోగంలోకి రాని భూ ములను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో మంచినీటి ఎద్దడిపై చర్చించే అవకాశం ఉంది. పంచాయితీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రహదారుల ని ర్మాణం పురోగతి, ఆయా రహదారుల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల విని యోగంపై కూడా చర్చించనున్నారు. ‘పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు’ పథకం పదినెలలైనా కార్యరూపం దాల్చకపోవడంపై విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నందున ఈ విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఆసరా పింఛన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, బీడీ కార్మికులందరికీ భృతి అందకపోవడం, ఆహార భద్రతా చట్టం, ఎక్సైజ్ పాలసీ, టూరిజం అభివృద్ధి, భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగాల క ల్పన.. తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
పునర్వ్యస్థీకరణపై కొత్త ప్రభుత్వం ఆలోచన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం కొత్త జిల్లాల ఏర్పాటుకు నాంది పలకనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారం దొరకనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... రంగారెడ్డి జిల్లాను ఐదు జిల్లాల పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును కూడా పూర్తి చేసిన ఆ పార్టీ అధినాయకత్వం 2016 నాటికి వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీంతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ కార్యరూపం దాల్చనుంది. పాలనా సౌలభ్యం కోసం.. మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి పేరిట 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో కేవలం 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. నగరీకరణ నేపథ్యంలో వలసల తాకిడి పెరగడంతో జిల్లా జన విస్పోటాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాల స్థానే 14 శాసనసభ సెగ్మెంట్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం పేర జిల్లాను విభజించాలనే చ ర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో... వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే అంశంపై చర్చోపచర్చలు సాగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. దీన్ని ఎన్నికల హామీగా మార్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తే వికారాబాద్ పరిసరాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాగా మలుస్తామని హామీ ఇచ్చాయి. శాస్త్రీయత పాటించకుండానే.. తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాలను ఏర్పాటు చేయాలనే టీఆర్ఎస్ పెద్దల ఆలోచన బాగా నే ఉన్నా.. అనుసరించిన విధానం మాత్రం హేతుబద్ధంగా లేదు. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాను ఐదు కొత్త జిల్లాల పరిధిలో కలపాలని ప్రణాళిక తయారు చేశారు. అయితే, భౌగోళికంగా, రవాణాపరంగా అ నువుగా ప్రాంతాలను జిల్లా కేంద్ర ంగా ప్రతి పాదించారు. తద్వారా పాలనా సౌలభ్యం దే వుడెరుగు ప్రజలకు కొత్త ఇబ్బందులు తప్పేలా లేవు. సగటున 15 లక్షల జనాభా, ఐదు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లా పునర్విభజనకు టీఆర్ఎస్ ప్రతిపాదనలు రూపొందించింది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని మలక్‌పేట, దాని సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను నల్గొండ జిల్లా భువనగిరి కేంద్రంగా ఏర్పడే రంగారెడ్డి తూర్పు జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రస్తుతం కూతవేటు దూరంలో ఉన్న జిల్లా కేంద్రం కాస్తా... సుదూరం కానుంది. ఇలాగే పలు నియోజకవర్గాలను కొత్త జిల్లాలో కలిపే అంశంపై శాస్త్రీయత పాటించనట్లు కనిపిస్తోంది. కాగా, పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నాలుగు నియోజక వర్గాలతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. తాండూరు, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల వాసులు ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పకపోయినా, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రం వికారాబాద్‌లో తమ ప్రాంతాన్ని విలీనం చేసే అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశంలేకపోలేదు. ఇదిలావుండగా, టీఆర్ఎస్ పెద్దలు రూపొందించిన జిల్లాల పునర్వ్యస్థీకరణ బ్లూప్రింట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను అడ్డగోలుగా విభజించాలని చూస్తే సహించేది లేదని, ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని భువనగిరి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపాలనుకోవడం అర్థరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సహేతుక కారణాలు చూపకుండా.. నిపుణులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏకపక్షంగా చేపడితే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.