సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం కొత్త జిల్లాల ఏర్పాటుకు నాంది పలకనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారం దొరకనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం... రంగారెడ్డి జిల్లాను ఐదు జిల్లాల పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును కూడా పూర్తి చేసిన ఆ పార్టీ అధినాయకత్వం 2016 నాటికి వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీంతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ కార్యరూపం దాల్చనుంది.
పాలనా సౌలభ్యం కోసం..
మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి పేరిట 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో కేవలం 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. నగరీకరణ నేపథ్యంలో వలసల తాకిడి పెరగడంతో జిల్లా జన విస్పోటాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాల స్థానే 14 శాసనసభ సెగ్మెంట్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం పేర జిల్లాను విభజించాలనే చ ర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో... వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే అంశంపై చర్చోపచర్చలు సాగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. దీన్ని ఎన్నికల హామీగా మార్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తే వికారాబాద్ పరిసరాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాగా మలుస్తామని హామీ ఇచ్చాయి.
శాస్త్రీయత పాటించకుండానే..
తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాలను ఏర్పాటు చేయాలనే టీఆర్‌ఎస్ పెద్దల ఆలోచన బాగా నే ఉన్నా.. అనుసరించిన విధానం మాత్రం హేతుబద్ధంగా లేదు. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాను ఐదు కొత్త జిల్లాల పరిధిలో కలపాలని ప్రణాళిక తయారు చేశారు. అయితే, భౌగోళికంగా, రవాణాపరంగా అ నువుగా ప్రాంతాలను జిల్లా కేంద్ర ంగా ప్రతి పాదించారు. తద్వారా పాలనా సౌలభ్యం దే వుడెరుగు ప్రజలకు కొత్త ఇబ్బందులు తప్పేలా లేవు. సగటున 15 లక్షల జనాభా, ఐదు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లా పునర్విభజనకు టీఆర్‌ఎస్ ప్రతిపాదనలు రూపొందించింది.
ఉదాహరణకు హైదరాబాద్‌లోని మలక్‌పేట, దాని సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను నల్గొండ జిల్లా భువనగిరి కేంద్రంగా ఏర్పడే రంగారెడ్డి తూర్పు జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రస్తుతం కూతవేటు దూరంలో ఉన్న జిల్లా కేంద్రం కాస్తా... సుదూరం కానుంది. ఇలాగే పలు నియోజకవర్గాలను కొత్త జిల్లాలో కలిపే అంశంపై శాస్త్రీయత పాటించనట్లు కనిపిస్తోంది. కాగా, పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నాలుగు నియోజక వర్గాలతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది. తాండూరు, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల వాసులు ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పకపోయినా, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రం వికారాబాద్‌లో తమ ప్రాంతాన్ని విలీనం చేసే అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశంలేకపోలేదు.
ఇదిలావుండగా, టీఆర్‌ఎస్ పెద్దలు రూపొందించిన జిల్లాల పునర్వ్యస్థీకరణ బ్లూప్రింట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను అడ్డగోలుగా విభజించాలని చూస్తే సహించేది లేదని, ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని భువనగిరి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపాలనుకోవడం అర్థరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సహేతుక కారణాలు చూపకుండా.. నిపుణులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏకపక్షంగా చేపడితే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
పునర్వ్యస్థీకరణపై కొత్త ప్రభుత్వం ఆలోచన
Published Sat, May 24 2014 11:59 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement