మర్రి చెన్నారెడ్డి (ఫైల్) - బూర్గుల రామక్రిష్ణారావు (ఫైల్)
సాక్షి, వికారాబాద్/షాద్‌నగర్: ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరించి మంచి పేరుప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి రామకృష్ణారావుది షాద్‌నగర్ నియోజకవర్గంలోని బూర్గుల స్వగ్రామం. మర్రి చెన్నారెడ్డిది వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం సిరిపురం. జిల్లాల పునర్‌విభజనలో భాగంగా షాద్‌నగర్ రంగారెడ్డి జిల్లాలో కలిసింది. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో 1899లో నర్సింగ్‌రావు, రంగనాయకమ్మ దంపతులకు రామకృష్ణారావు జన్మించారు. 1948 అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆయన విద్యా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు.
వినోబాభావే చేపట్టిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు. 1952లో షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత ఎల్‌ఎల్‌రెడ్డిపై 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ఉండటంతో తొలిముఖ్యమంత్రి పదవిని రామకృష్ణారావు అలంకరించారు. ఆయన తన హయాంలోనే రక్షిత కౌలుదారు(టెనెంట్) చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. అనంతరం 1956లో విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956–1960లో కేరళ, 1960–1962 ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1967 సెప్టెంబరు 14న ఆయన కన్నుమూశారు. బూర్గుల గ్రామంలో రామకృష్ణారావు స్మారక స్థూపాన్ని ప్రజలు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ముద్ర వేసిన మర్రి..
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి‘ పార్టీని ఏర్పాటు చేసి తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఈయన స్వగ్రామం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామం. మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు 1919 జనవరి 13 జన్మించారు. ప్రాథమిక విద్యను సిరిపురంలోనే పూర్తిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారంలో తన మేనమామ కొండా వెంకట రంగారెడ్డి వద్ద ఉంటూ ప్రాథమికోన్నత, వికారాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీసీ పూర్తి చేసి ఉస్మానియాలోనే డాక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1952, 1957లో వికారాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో తాండూరు నుంచి పోటీచేశారు. 1962,1967లో విజయం సాధించారు. అనంతరం 1978లో మేడ్చల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1978–79, 1989–90లో రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. దీంతోపాటు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 27 ఏళ్ల పిన్నవయసులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన తన మేనమామ మీద ఉన్న అభిమానంతో ఆయన పేరుమీదే కొండా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment