అన్యాయంపై తిరుగుబాటు ‘ముల్కీ!’ | Mulki Agitation: Hyderabad City College Incident Completes 70 Years | Sakshi
Sakshi News home page

అన్యాయంపై తిరుగుబాటు ‘ముల్కీ!’

Published Sat, Sep 3 2022 12:42 PM | Last Updated on Sat, Sep 3 2022 12:42 PM

Mulki Agitation: Hyderabad City College Incident Completes 70 Years - Sakshi

ముల్కీ ఉద్యమంలో భాగంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి సరిగ్గా 70 ఏళ్లు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంత ప్రజలపై పెత్తనం చలాయించడం, తెలంగాణ విద్యార్థు లకు దక్కాల్సిన ఉద్యోగాలను నాన్‌ ముల్కీ లైన ఆంధ్ర ప్రాంత ప్రజలు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి పొందడం వంటి చర్యల ద్వారా ఎంతో దోపిడీ చేశారు. దీనిని వ్యతి రేకిస్తూ ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి ప్రజలకే కల్పిం చాల్సిందిగా కోరుతూ ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌’, ‘ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌’ నినాదాలతో ముల్కీ ఉద్యమం వరంగల్‌లో ప్రారంభమయ్యింది.

‘ముల్కీ’ అనగా స్థానికుడు అని అర్థం. ఈ ముల్కీ సమస్య 1868 నుంచి హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉంది. నాన్‌ ముల్కీలను తొలగించాలని అనేక సమావేశాలు నిర్వహించి, వినతి పత్రాలు అందించి ప్రజల్లో చైతన్యం కలిగించారు నాటి స్థానిక ముస్లిం మేధావులు. పోలీస్‌ చర్య తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయింది. పోలీస్‌ చర్య పిమ్మట ఏర్పడిన అస్థిరత ఒత్తిళ్ళ కారణంగా పోలీస్‌ శాఖలో గైర్‌ ముల్కీలను నియమించడం అనివార్యమైందని అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలిపారు. కానీ పోలీస్‌ శాఖలోనే కాకుండా అనేక శాఖల్లో గైర్‌ ముల్కీల నియామకం జరిగింది.

వరంగల్‌లోని డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌గా నియమించ బడిన పార్థసారథి 1952 జూన్, జూలై నెలల్లో 180 మంది ఉపాధ్యా యులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. తెలంగాణ వారిని మారు మూల గ్రామాలకు, ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీ చేస్తూ... వీరి స్థానాల్లో ఆంధ్ర ఉపాధ్యాయులను నియమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నాన్‌ ముల్కీ అయిన పార్థసారథి ఇంతటి ఇబ్బందులకు గురి చేయడంతో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులంతా విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌  డాక్టర్‌ షండార్కర్‌కు 1952 జూలై 26న ఫిర్యాదు చేశారు. ఆ విషయంపై వరంగల్లో విచారణ జరిపించారు. న్యాయ పరమైన విచారణ జరగాలని వెంటనే నాన్‌ ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని వరంగల్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. ఆ ర్యాలీనే 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చెప్పుకోవచ్చు.

విద్యార్థులు జూలై 27, 28, 29 తేదీల్లో తరగతులు బహిష్కరించి ముల్కీ సమస్యపై ముఖ్యమంత్రికి తీర్మానాన్ని పంపాలని నిర్ణయిం చారు. ఈ ఉద్యమం హైదరాబాద్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తమ తమ జిల్లాల్లో విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండడంతో ముఖ్యమంత్రి బూర్గుల విద్యార్థులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి సబ్‌ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేసి సమ్మె విరమించు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  కానీ ఎలాంటి పత్రికా ప్రకటన వెలువడలేదు. దీంతో హన్మకొండ గవర్నమెంట్‌ స్కూల్‌ విద్యార్థులు సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకొని ఉద్యమం తారస్థాయికి చేరుకోకముందే అణచివేయాలని విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా విద్యార్థులు రోడ్లెక్కారు.

సెప్టెంబర్‌ మూడవ తేదీన ముల్కీ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులను అదుపు చేయడం కోసం పోలీసులు సైఫాబాద్‌ సైన్స్‌ కాలేజ్‌ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేశారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ లాల్‌ హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 22 కింద ఊరేగింపులు, సభలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు చేశారు విద్యార్థులు. సిటీ కాలేజ్‌ ఆవరణలోని విద్యార్థులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు, విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. 

సిటీ కాలేజ్‌ పక్కనే గల హైకోర్టులో ఉన్న వకీల్, ఆనాటి శాసనసభ్యుడు కొండా లక్ష్మణ్‌ విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మేజిస్ట్రేట్‌ పరిస్థితిని అదుపు చేయడా నికి వెంటనే ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక విద్యార్థికి బుల్లెట్టు తగిలి నేలకు ఒరిగాడు. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వుతూ బస్సులను తగలబెట్టారు. దీంతో మేజిస్ట్రేట్‌ రెండోసారి ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చాడు. చాలామందికి బుల్లెట్లు తగిలి నేలపై పడి పోయారు. సెప్టెంబర్‌ 3న సిటీ కాలేజీ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు అక్కడే చనిపోగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఉస్మానియా హాస్పిటల్‌లో మరణించారు. చనిపోయిన వారి శవాలను తీసుకొని ఊరేగింపు చేయాలని విద్యార్థులు నిర్ణయించుకొని సెప్టెంబర్‌ 4న ఉస్మానియా హాస్పిటల్‌కి బయలుదేరారు. శవాలను అప్పగించే విషయంలో వాగ్వాదం పెరిగి పోలీసులు మళ్లీ విద్యార్థుల పైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మళ్లీ కాల్పులు జరిపారు. సెప్టెంబర్‌ 4న జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు. వందల మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. (క్లిక్‌: బంగారు బాతును కాపాడుకోవాలి!)

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉండాలనీ, ఆంధ్రలో ఎట్టి పరిస్థి తుల్లో విలీనం చేయరాదన్న తెలంగాణ ప్రజల అంతర్గత ఆకాంక్షకు నిలువెత్తు రూపమే ఈ మహోత్తర ముల్కీ ఉద్యమం! అందుకే ఆ తర్వాత తలెత్తిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ముల్కీ ఉద్యమం నేపథ్యాన్ని ఏర్పరచిందని చెప్పవచ్చు. (క్లిక్‌: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు)


- జక్కుల శ్రీనివాస్‌ 
హెచ్‌సీయూ విద్యార్థి 
(సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పుల సంఘటనకు 70 ఏళ్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement