city college
-
అన్యాయంపై తిరుగుబాటు ‘ముల్కీ!’
ముల్కీ ఉద్యమంలో భాగంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి సరిగ్గా 70 ఏళ్లు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంత ప్రజలపై పెత్తనం చలాయించడం, తెలంగాణ విద్యార్థు లకు దక్కాల్సిన ఉద్యోగాలను నాన్ ముల్కీ లైన ఆంధ్ర ప్రాంత ప్రజలు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి పొందడం వంటి చర్యల ద్వారా ఎంతో దోపిడీ చేశారు. దీనిని వ్యతి రేకిస్తూ ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి ప్రజలకే కల్పిం చాల్సిందిగా కోరుతూ ‘నాన్ ముల్కీ గో బ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ నినాదాలతో ముల్కీ ఉద్యమం వరంగల్‌లో ప్రారంభమయ్యింది. ‘ముల్కీ’ అనగా స్థానికుడు అని అర్థం. ఈ ముల్కీ సమస్య 1868 నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. నాన్ ముల్కీలను తొలగించాలని అనేక సమావేశాలు నిర్వహించి, వినతి పత్రాలు అందించి ప్రజల్లో చైతన్యం కలిగించారు నాటి స్థానిక ముస్లిం మేధావులు. పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయింది. పోలీస్ చర్య పిమ్మట ఏర్పడిన అస్థిరత ఒత్తిళ్ళ కారణంగా పోలీస్ శాఖలో గైర్ ముల్కీలను నియమించడం అనివార్యమైందని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలిపారు. కానీ పోలీస్ శాఖలోనే కాకుండా అనేక శాఖల్లో గైర్ ముల్కీల నియామకం జరిగింది. వరంగల్‌లోని డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా నియమించ బడిన పార్థసారథి 1952 జూన్, జూలై నెలల్లో 180 మంది ఉపాధ్యా యులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. తెలంగాణ వారిని మారు మూల గ్రామాలకు, ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీ చేస్తూ... వీరి స్థానాల్లో ఆంధ్ర ఉపాధ్యాయులను నియమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నాన్ ముల్కీ అయిన పార్థసారథి ఇంతటి ఇబ్బందులకు గురి చేయడంతో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులంతా విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షండార్కర్కు 1952 జూలై 26న ఫిర్యాదు చేశారు. ఆ విషయంపై వరంగల్‌లో విచారణ జరిపించారు. న్యాయ పరమైన విచారణ జరగాలని వెంటనే నాన్ ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని వరంగల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. ఆ ర్యాలీనే 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు జూలై 27, 28, 29 తేదీల్లో తరగతులు బహిష్కరించి ముల్కీ సమస్యపై ముఖ్యమంత్రికి తీర్మానాన్ని పంపాలని నిర్ణయిం చారు. ఈ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తమ తమ జిల్లాల్లో విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండడంతో ముఖ్యమంత్రి బూర్గుల విద్యార్థులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేసి సమ్మె విరమించు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ ఎలాంటి పత్రికా ప్రకటన వెలువడలేదు. దీంతో హన్మకొండ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకొని ఉద్యమం తారస్థాయికి చేరుకోకముందే అణచివేయాలని విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా విద్యార్థులు రోడ్లెక్కారు. సెప్టెంబర్ మూడవ తేదీన ముల్కీ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులను అదుపు చేయడం కోసం పోలీసులు సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 కింద ఊరేగింపులు, సభలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు చేశారు విద్యార్థులు. సిటీ కాలేజ్ ఆవరణలోని విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. సిటీ కాలేజ్ పక్కనే గల హైకోర్టులో ఉన్న వకీల్, ఆనాటి శాసనసభ్యుడు కొండా లక్ష్మణ్ విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మేజిస్ట్రేట్ పరిస్థితిని అదుపు చేయడా నికి వెంటనే ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక విద్యార్థికి బుల్లెట్టు తగిలి నేలకు ఒరిగాడు. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వుతూ బస్సులను తగలబెట్టారు. దీంతో మేజిస్ట్రేట్ రెండోసారి ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చాడు. చాలామందికి బుల్లెట్లు తగిలి నేలపై పడి పోయారు. సెప్టెంబర్ 3న సిటీ కాలేజీ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు అక్కడే చనిపోగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఉస్మానియా హాస్పిటల్లో మరణించారు. చనిపోయిన వారి శవాలను తీసుకొని ఊరేగింపు చేయాలని విద్యార్థులు నిర్ణయించుకొని సెప్టెంబర్ 4న ఉస్మానియా హాస్పిటల్‌కి బయలుదేరారు. శవాలను అప్పగించే విషయంలో వాగ్వాదం పెరిగి పోలీసులు మళ్లీ విద్యార్థుల పైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మళ్లీ కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 4న జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు. వందల మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. (క్లిక్: బంగారు బాతును కాపాడుకోవాలి!) ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉండాలనీ, ఆంధ్రలో ఎట్టి పరిస్థి తుల్లో విలీనం చేయరాదన్న తెలంగాణ ప్రజల అంతర్గత ఆకాంక్షకు నిలువెత్తు రూపమే ఈ మహోత్తర ముల్కీ ఉద్యమం! అందుకే ఆ తర్వాత తలెత్తిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ముల్కీ ఉద్యమం నేపథ్యాన్ని ఏర్పరచిందని చెప్పవచ్చు. (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) - జక్కుల శ్రీనివాస్ హెచ్‌సీయూ విద్యార్థి (సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పుల సంఘటనకు 70 ఏళ్లు) -
సిటీ కాలేజీకి 'లాల్' సలాం!
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలం నాటి నిర్మాణ శైలికి అద్దం పట్టే సిటీ కాలేజ్ కొత్త హంగులు సంతరించుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులను అందించిన ఈ కాలేజ్ ‘లాల్’రంగులు అద్దుకుంటోంది. నిజాం పాలకుల కాలంలో చిన్నారుల చదువు కోసం పాఠశాలగా ప్రారంభమై నేడు ప్రఖ్యాత విద్యాలయం స్థాయికి ఎదిగింది. 97 ఏళ్ల క్రితం 30 మంది విద్యార్థులతో మొదలైన ప్రస్థానం.. 31 యూజీ కోర్సులు, 8 పీజీ కోర్సులతో నేడు వేల మందికి విద్యనందిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద సిటీ కాలేజ్‌కి రూ.2 కోట్ల నిధులు కేటాయించింది. జిమ్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు.. కేంద్రం ఇచ్చిన నిధులతో సిటీ కాలేజ్‌లో పలు నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ సి.మంజుల తెలిపారు. రూసా పలు షరతులతో ఈ నిధులను కేటాయించినట్లు చెప్పారు. రూ.1.50 లక్షలతో భవనానికి పెయింటింగ్, మరమ్మతులు, రూ.10 లక్షలతో జిమ్, రూ.40 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదీ కాలేజీ చరిత్ర.. ఆరవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మదర్సా దారుల్ ఉలూమ్ పేరుతో 1865లో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఏడవ నిజాం హయాంలో దీన్ని సిటీ హైస్కూల్‌గా మార్చి, 1921లో భవనాన్ని నిర్మించారు. అదే సంవత్సరం ఇంటర్మీడియట్ (ఎఫ్ఏ)గా మార్చారు. 1929లో హైస్కూల్‌తో పాటు కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసి.. సిటీ కాలేజ్‌గా పేరు మార్చారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక పీయూసీతో పాటు 1962 నుంచి సైన్స్, ఆర్ట్స్ డిగ్రీ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇటాలియన్, హిందూ వాస్తు కళల మిశ్రమంగా రూ.8 లక్షలతో కాలేజ్ నిర్మాణం జరిగింది. తూర్పు, పశ్చిమ దిక్కు నుంచి చూసినా ఈ భవనం ఒకే మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో వెయ్యి మంది కూర్చునేలా గ్రేట్ హాల్ పేరుతో ఓ హాల్‌ను నిర్మించారు. పలు సినిమాల్లో ఈ కాలేజీని రాజమహల్, న్యాయస్థానంగా చూపించారు. రాజకీయ నేతలు శివరాజ్ పాటిల్, పీ శివశంకర్, మర్రి చెన్నారెడ్డి, మాజీ క్రికెటర్ అర్షద్ అయ్యూబ్ లాంటి ప్రముఖులంతా ఇక్కడ చదువుకున్నవారే. -
పిటీ కాలేజీలు
ఆ కాలేజీల దరఖాస్తుఫారాలు కావాలంటే కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టాల్సిందే. రోజులతరబడి కాళ్లరిగేలా కళాశాలల చుట్టూ తిరగాల్సిందే. అడ్మిషన్ల సంగతి సరేసరి! అత్యంత ప్రతిభ చూపినవారికే అక్కడ సీటు. హైదరాబాద్ నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు.. పెద్ద పెద్ద భవనాలు.. విశాలమైన ఆవరణ.. పచ్చని చెట్లు..! ఇదంతా.. ఏదైనా కార్పొరేట్ కళాశాల గురించి అనుకుంటున్నారా? కాదు సుమా! ఇదీ నగరంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఘనత. అవే ఆలియా, మహబూబియా, సిటీ కాలేజీలు. తరగతి గదులు కిటకిటలాడేవి. విద్యాసంవత్సరమంతా కళకళలాడేవి. ఆటపాటలతో అలరించేవి. వాటిల్లో తమ పిల్లలను చదివించడం తల్లిదండ్రులకో డ్రీమ్. అవి నగరానికే తలమానికం. అక్కడి విద్యే ప్రమాణికం. - సాక్షి, సిటీబ్యూరో ఆలియా, మహబూబియా, సిటీ కాలేజీల్లో తగ్గిన అడ్మిషన్లు ఆలియాలో గతంలో అడ్మిషన్లు వెయ్యికిపై మాటే.. నేడు 141 మంది చేరిక.. ఆలియాలో 35 పోస్టులకుగాను ముగ్గురే రెగ్యులర్ అధ్యాపకులు గతమెంతో ఘనమైనది. వర్తమానం మాత్రం దానికి పూర్తి భిన్నం. ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. ఆగస్టు సమీపిస్తున్నా పూర్తిస్థాయిలో అడ్మిషన్లు భర్తీ కాని పరిస్థితి. దరఖాస్తు ఫారాలు కట్టలుకట్టలుగా అలాగే ఉండిపోయాయి. ఇంకా విద్యార్థులు రాకపోతారా.. అని సిబ్బంది ఎదురుచూపులు. సరిపడా లేని అధ్యాపకులు. భర్తీ కాని పోస్టులు.. ఇదీ గత పదేళ్లుగా ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలల దుస్థితి. చారిత్రక నేపథ్యం కలిగిన విద్యాలయాల్లో దుర్భర పరిస్థితులు నెలకొనడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఎంతోమంది ప్రముఖులు ఈ కళాశాలల్లో చదువుకున్నవారే. గత పాలకుల నిర్లక్ష్యంతోపాటు పుష్కర కాలంగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న వ్యాపార దృక్పథమే ఈ దుస్థితికి ప్రధాన కారణాలు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వమైనా ఈ కాలేజీలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేవిధంగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఆలియా.. మహబూబియా.. నిజాం నవాబుల కుటుంబ సభ్యుల విద్యాభ్యాసం కోసం 1910లో ఈ భవనాలను నిర్మించారు. ఆలియా స్కూల్లో అబ్బాయిలకు, మహబూబియా స్కూల్లో అమ్మాయిలకు చదువు చెప్పేవారు. ఆప్పట్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన సాగేది. నిజాంల పాలన అనంతరం అన్నివర్గాల వారికి ఈ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కలిగింది. 1974-75నుంచి పాఠశాల నుంచి జూనియర్ కళాశాలలను ప్రభుత్వం వేరు చేసింది. 2000 సంవత్సరం వరకు ఒక్కో కళాశాలలో విద్యార్థుల సంఖ్య వెయ్యికి పైమాటే. ఫస్టియర్ ఇంటర్లో అడ్మిషన్ కోసం ఒక్కో కళాశాల్లో 580సీట్లకు గాను ఐదారువేలకు పైగా దరఖాస్తులు వచ్చేవి. పోలీసు బందోబస్తు నడుమ నెలరోజులపాటు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగేది. ప్రస్తుతం ఆలియా జూనియర్ కళాశాల్లో ఫస్టియర్ అడ్మిషన్లు 141కి పడిపోగా, మహబూబియా కళాశాలల్లో కేవలం 101 మందే చేరారు. ఆలియాలో 35 మంది అధ్యాపకుల్లో రెగ్యులర్ అధ్యాపకులు ముగ్గురే. మహబూబియాలో 40 పోస్టులకుగాను పనిచేస్తున్నది నలుగురే. ఇక నాన్‌టీచింగ్ సిబ్బంది సంగతి సరేసరి. సిటీ కాలేజీలోనూ ఇదే పరిస్థితి.. 1929 లో సిటీ కాలేజీ నిజాం హయాంలో ఏర్పాటైంది. మదర్సా ఫౌకానియా(8-12వరకు) పేరిట బాలురకు హయ్యర్ సెకండరీ విద్యను అందించేవారు. 1963 తర్వాత కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఉదయం డిగ్రీ, మధ్యాహ్నం నుంచి జూనియర్ కళాశాలలు షిఫ్టు పద్ధతిన నడుస్తున్నాయి. 1975 నుంచి ఇంటర్ విద్య వేరైంది. జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనంలో డిగ్రీ కళాశాల నడిపిస్తున్న అధికారులు తగిన వసతులను కల్పించడంలేదు. ఫలితంగా ఇంటర్ కోర్సులకు డిమాండ్ తగ్గిపోయింది. సుమారు 600 మందికి అవకాశం ఉన్నా.. ఈ ఏడాది ఫస్టియర్ అడ్మిషన్ల సంఖ్య 300 లోపే ఉండడం గమనార్హం. ఆ కళాశాలల దుస్థితికి కారణాలు.. * 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన ఈ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణ నీయంగా పడిపోవడానికి కార్పొరేట్ సంస్థల ప్రవేశమే ప్రధాన కారణం. * టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసిన వెంటనే కార్పొరేట్ జూనియర్ కళాశాలలు వెంటబడి మార్చిలోనే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం నిబంధనల ప్రకారం జూన్ మొదటి వారంలోనే అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. * పుష్కర కాలంగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకం లేదు. ఇటీవల రిక్రూట్ మెంట్ జరిపినా కాలేజీకి ఒకరిద్దరు అధ్యాపకులు మాత్రమే వచ్చారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కాంట్రాక్టు అధ్యాపకులతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. * పభుత్వపరంగా నియామకాల్లేకపోవడం ప్రైవేటు సంస్థలకు కలిసొచ్చింది. వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామంటూ విద్యార్థులకు గాలం వేశాయి. * చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో జవాబుదారీతనం కొరవడింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌విద్య అగమ్యగోచరంగా తయారైంది. * మహబూబియా, ఆలియా, సిటీ క ళాశాలల్లో చదువుకునేందుకు నగరంతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. అవి ఆగిపోవడంతో విద్యార్థులు రావడం లేదు. * శిథిలావస్థకు చేరిన కళాశాల భవనాలకు మరమ్మతులు చేసేందుకు ఇంటర్ బోర్డు ముందుకు వచ్చినా.. చారిత్రక, వారసత్వ కట్టడాలంటూ పురావస్తు శాఖ ససేమిరా అంటోంది. రిపేర్లు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరిన తరగతి గదులు నిరుపయోగంగా ఉన్నాయి. * తెలుగు మాధ్యమంలో విద్యార్థులు చేరడంలేదు. ఆంగ్లమాధ్యమంలో అడ్మిషన్లు అరకొరగా ఉన్నాయి.