పగలే 9 గంటల విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ సరఫరా సరిగాలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు మూడు విడతలుగా, అదీ రాత్రివేళల్లో సరఫరా చేస్తుండటం రైతులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఖరీఫ్ నుంచి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకట్ నారాయణ, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులతో సమీక్ష జరిపారు. వ్యవసాయ పంపు సెట్లన్నింటికీ 9 గంటల కరెంటు ఇచ్చేందుకు అవసరమయ్యే విద్యుత్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేయాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నిరంతర విద్యుత్ సరఫరా జరగనందున కచ్చితమైన లెక్కలు లేవన్నారు. వ్యవసాయ డిమాండు తీవ్రంగా ఉండే ఆగస్టులో పరిశ్రమలకు ఒక రోజు పూర్తిగా విద్యుత్‌ను నిలిపివేసి, సాగుకు 9 గంటలు సరఫరా చేయాలని, అప్పుడు వ్యవసాయానికి ఎన్ని మెగావాట్లు అవసరమో తేలుతుందని చెప్పారు.
డిమాండు ఎంతుందో తేలితే ఏర్పాట్లు సులభమవుతాయన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ, వ్యవసాయ ఫీడర్లను రెండు విభాగాలుగా విభజిస్తామని, ఒక భాగం ఫీడర్లకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరో భాగం ఫీడర్లకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు సరఫరా చేస్తామని సీఎంకు చెప్పారు. ఇందుకోసం రూ.10వేల కోట్లతో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం మీద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు అధిక విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుందని, లోడ్‌ను తట్టుకునేందుకు రూ.7,500 కోట్లతో 5,200 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, వచ్చే మార్చి నాటికి మరో 3వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానున్నందున 9 గంటల సరఫరా సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. సాగుకు 9 గంటలు, గృహాలు, పరిశ్రమలకు 24 గంటల సరఫరా లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
డిస్కంలకు దివ్య నామాలు
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సైతం సీఎం కేసీఆర్ తెలంగాణ పుణ్యక్షేత్రాల పేర్లను పెట్టారు. వరంగల్ కేం ద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) పేరును శ్రీ రాజరాజేశ్వరి విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్‌ఆర్‌ఆర్‌పీడీసీఎల్)గా, హైదరాబాద్ కేంద్రం గా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పేరును యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి విద్యుత్ పంపిణీ సంస్థ (వైఎల్‌ఎన్‌ఎస్‌పీడీసీఎల్)గా పేర్లను ఖరారు చేశారు. కొత్తగా నిర్మిస్తున్న రెండు విద్యుత్ కేంద్రాలకు భద్రాద్రి (మణుగూరు), యాదాద్రి (దామరచర్ల)గా గతంలో నామకరణం చేసిన విషయం తెలిసిందే.