జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్న సీఎం కేసీఆర్ హామీ త్వరలో అమలు కాబోతుంది. జిల్లాలో ఇప్పటికే 500 జనాభా ఉన్న తండాల నివేదికలను జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. వరంగల్ జరిగిన కాకతీయ మేగా టెక్‌స్లైల్ పార్క్ శంకుస్తాపన సభలో సీఎం కేసీఆర్ ఈనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడుతామని ప్రకటించారు.
జిల్లాలో 92 తండాలు
జిల్లాలో అర్హత ఉన్న 92 పంచాయతీల్లో పర్యటించి తుది నివేదికను జిల్లా పంచాయతీ అధికారులకు సమర్పించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అధికారుల, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పంచాయతీలుగా మారే తండాలపై కసరత్తు చేశారు. 2018 జూలైలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగనున్నాయి. వాటితోపాటు పంచాతీలుగా మారే తండాలకు ఎన్నికలు జరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో 20 తండాల వినతులు
జిల్లాలో మరో 20 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఇటీవల వినతులు వచ్చాయి. మా తండాకు అన్ని హంగులు ఉన్నాయని 20 తండాల నుంచి గిరిజనులు వినతులు అందించారు. జిల్లాలోని జడ్చర్ల, నారాయణపేట్, మక్తల్ నియోజవకవర్గాల నుంచి తండా డిమాండ్లు వస్తున్నాయి. ఈ వినతులను సంబందిత మండల ఎంపీడీఓలకు పరిశీలించి డీపీఓ అధికారులు పంపించారు. ఇలా వచ్చిన వినతులను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వినతుల్లో వచ్చిన తండాలకు ఉన్నాయా లేదా అని పరిశీలించనున్నారు. ఇలా పరిశీలించిన అనంతరం నివేదికలను డీపీఓకు సమర్పించనున్నారు. ఇక్కడి నుంచి జిల్లా డీపీఓ అధికారులు రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.
ఆలోపే సర్పంచ్‌ల ఎన్నికలు
సర్పంచుల ఎన్నికలను జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని జరుగుతున్న ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారు. వరంగల్ సభలో సర్పంచుల ఎన్నికల సమయంలోపు నిర్వహిస్తామని చెప్పారు. సమయానుకూలంగానే ఎన్నికలను నిర్వహింస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో ప్రభుత్వం ఎన్నికలకు వెల్లే యోజనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పంచాయతీ అధికారులు నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో ప్రభుత్వం పడింది. వచ్చే ఏడాది జూలై నెలతో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికలకు జరపాలనే యోజనలో ఉన్నట్లు సీఎం ప్రకటనతో అర్థం అవుతుంది.
వడివడిగా ఏర్పాట్లు
జిల్లా యంత్రాంగం ఓటర్ జాబితా, బూత్ వివరాల సేకరించే పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 26 మండలాలు 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 2011 లెక్క ప్రకారం 11,78,574 జనాభా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఓ సర్వే నిర్వహించిన దాని ప్రకారం 15,88, 973 జనాబా ఉంది. ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కావల్సిన మౌళిక సదుపాయాలపై జిల్లా యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికే వివరణ కోరంది. ఈ మేరకు జిల్లాలోని ఉన్న వనరులపై జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఈ సారి ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఎన్ని ఈవీఎంలు, ఎంత మంది సిబ్బంది. ఎన్ని నిదులు అవసరం అనే కోణంలో అధికారులు లెక్కలు తీస్తున్నారు.
జాబితా తయారీకి కసరత్తు...
సీఎం ప్రకటనతో ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాగం ఇప్పటికే వివరాల సేకరణ చేపట్టింది. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుండగా ఎన్నికల నాటికి పూర్తి ఓటరు జాబితా విడుదల కానుంది. జిల్లాలో వార్డులు, పోలింగ్ బూత్‌లు, అవసరమైన సిబ్బంది తదితర వివరాలు ప్రభుత్వానికి అందజేయనుంది. కాగా పదవీ కాలం ముగిసేలోపే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్న పార్టీలకు వచ్చే ఏడాదిలో జరిగే సర్పంచ్ ఎన్నికలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచులు అధికంగా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచే ప్రజల మద్దతు కూడగట్టుకుంటే సార్వత్రిక ఎన్నికల్లోపు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయా పార్టీలు సభ్యత్వ నమోదు పార్టీలో చేరికలు, కమిటీలు ఏర్పాటు జిల్లాలో దాదాపు పూర్తి చేసుకుంటున్నాయి. బూత్ స్థాయిలో బలపడాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు బూత్‌స్థాయి కమిటీలను నియమిస్తు ప్రజల్లోకి వెల్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు
తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా నుంచి చేయాల్సిన తండాల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ఇదే కాకుండా జిల్లా నలు మూలల నుంచి వినతులు వస్తున్నాయి. జిల్లాలో 92 తండాలను గుర్తించాం. దీంతోపాటు మరో 20 ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయం మేరకు కసరత్తు చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment