96 స్కూల్ కాంప్లెక్సులు రద్దు
పాలమూరు : విద్యాశాఖ చేపట్టిన మార్పుల్లో భాగంగా జిల్లాలో స్కూల్ కాంప్లెక్సుల మదింపునకు చర్యలు చేపట్టారు. పాఠశాలల నిర్వహణలో కీలకమైన 96స్కూల్ కాంప్లెక్సులను రద్దుచేస్తూ రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఒక్కో కాంప్లెక్స్ కింద 5 నుంచి 7పాఠశాలలుంటే.. ఇప్పుడు 18 పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్సును నిర్ణయించారు. రద్దు నిర్ణయంతో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై మరింత భారం పడనుంది. జిల్లాలో 3,650 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఉన్నత పాఠశాలల పరిధిలోని 5నుంచి7 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పక్కనే ఉన్నత పాఠశాలలకు కలిపి పాఠశాల సముదాయాలుగా ఏర్పాటు చేశారు. వీటి అధ్యక్షులుగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వ్యవహరించేవారు. అధ్యక్షుడు సమీప పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థులకు బోధన, పాఠశాల గ్రాంట్ల ఖర్చు, పర్యవేక్షణ చేయాలి. ఇప్పటివరకు 353 పాఠశాలలుండగా వీటిసంఖ్య తగ్గించాలని 16 నుంచి 18 పాఠశాలలను కలిపి ఒకటిగా ఏర్పాటు చేశారు. తక్కువ పాఠశాలలున్న దాన్ని పక్క సముదాయానికి కలిపారు. దీంతో 96 స్కూల్ కాంప్లెక్స్‌లు తగ్గి సంఖ్య 257కు చేరింది. ఒక్కో పాఠశాల సముదాయానికి ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలను ఆర్‌వీఎం కేటాయిస్తోంది. గతేడాది వరకు ఏటా రూ.70.60 లక్షలు మంజూరు చేసింది. రద్దు కారణంగా రూ. 51.40లక్షలే మంజూరవనున్నాయి. రూ. 19.20 లక్షల వరకు ఆదాకు అవకాశం ఉంది. ఈ నిధులతో సముదాయ సమావేశాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్‌వీఎం ఉన్నతాధికారులు నిర్ణయించారు.
హెచ్‌ఎంలపై భారం
స్కూల్ కాంప్లెక్స్ అధ్యక్షుడు అయిన ప్రధానోపాధ్యాయుడు సమీప పాఠశాలల నిర్వహణ బాధ్యత చూడాలి. ఇప్పటి వరకు 5నుంచి7 పాఠశాలలు ఉండేవి. తాజాగా 18 కానుండటంతో నిర్వహణ భారం పడనుంది. వారంలో మూడుసార్లు తనిఖీలు చేసి ఎంఈఓ ద్వారా ఎస్‌ఎస్‌ఏకు నివేదికలు పంపాలి. పాఠశాలల సంఖ్య పెరగడంతో తనిఖీలకే సమయం సరిపోనుంది. పనిచేస్తున్న చోట పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరపలేమని పలువురు స్కూల్ కాంప్లెక్సు హెచ్‌ఎంలు పేర్కొన్నారు.
సీఆర్పీలపై వేటు?
జిల్లాలో ప్రస్తుతం 340 స్కూల్ కాంప్లెక్సులకు సీఆర్పీ (క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు)లున్నారు. వీరు సముదాయ పాఠశాలల్లో ఉంటూ విధులు నిర్వహిస్తారు. ఆ పరిధిలోని పాఠశాలల్లో బోధన, ఎస్‌ఎస్‌ఏ ఆదేశాలు స్వీకరించి వివరాలు సేకరించి మండల విద్యాధికారి ద్వారా నివేదికలు పంపుతారు. సీఆర్పీకి నెలకు రూ.8,500 చెల్లిస్తున్నారు. ఇప్పుడు సంఖ్య తగ్గడంతో ఒక్కో సముదాయానికి ఇద్దరు సీఆర్పీలు విధులు నిర్వర్తించాలని ఆదేశాలిచ్చారు. భవిష్యత్తులో 96మంది సీఆర్పీలను తొలగించే అవకాశాలున్నట్లు విద్యాశాఖవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.