అరవింద్ మృతదేహం
మెదక్: జిల్లాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు మరుగుతున్న పప్పు చారు మీద పడి బాలుడు మృతి చెందాడు. ఈ హృదయ విచారక ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్ల స్వప్న, సురేష్‌ల ఏకైక కుమారుడు అరవింద్(2) సోమవారం సాయంత్రం ఆడుకుంటూ కట్టెల పొయ్యి మీద మరుగుతున్న సాంబారు పాత్రను తాకాడు. దీంతో పప్పు చారు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని వెంటనే గాంధీ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక కొడుకు మరణించడంతో ఆ తల్లి తండ్రులు రోదనలు ప్రతి ఒక్కరికి కన్నీటిని తెప్పించాయి.