గర్భంలోనే సమాధి..!?  | Abortion Rate Increasing In Karimnagar | Sakshi
Sakshi News home page

గర్భంలోనే సమాధి..!? 

Published Tue, May 21 2019 10:34 AM | Last Updated on Tue, May 21 2019 10:34 AM

Abortion Rate Increasing In Karimnagar - Sakshi

చొప్పదండికి చెందిన దంపతులకు మూడేళ్ల క్రితం ఆడశిశువు జన్మించింది. రెండోసారి గర్భం దాల్చగా కరీంనగర్‌లోని ఓ గైనకాలజిస్టు నర్సింగ్‌హోంలో వైద్యసేవలు పొందుతున్నారు. మూడో నెల మొదలు కడుపులో ఉన్నది ఆడా మగా ఎవరో తెలుసుకునేందుకు  డాక్టర్‌ను సంప్రందించారు. ఆ డాక్టర్‌ ముందుగా లింగనిర్ధారణ చేయబోమని, ఇది చట్టరీత్యా నేరమని వివరించింది. అయినా వినిపించుకోకుండా స్కానింగ్‌ పరీక్షలు చేయకపోతే వేరే హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుంటామని చెప్పి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో వైద్యురాలు స్కానింగ్‌ చేసింది. కడుపులో ఉన్నది మళ్లీ అడశిశువు అని స్కానింగ్‌లో తెలిసింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి నగరంలోని జ్యోతినగర్‌ ప్రాంతంలో ఎలాంటి అర్హతలు లేకుండానే నిర్వహిస్తున్న ఓ క్లీనిక్‌ను సంప్రదించారు. అక్కడ పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని తల్లి గర్భంలోనే తుంచివేశారు.

కరీంనగర్‌హెల్త్‌: నవ మాసాలు మోసి కని పెంచాల్సిన అమ్మా ఆడపిల్లలు వద్దనుకుంటోంది. తను కూడా ఆడే అనే విషయాన్ని మరిచిపోయి ఆడశిశువుల పట్ల వివక్ష చూపుతోంది. కడుపులో ఉన్న శిశువు ఆడ అని తేలగానే గర్భంలోనే సమాధి చేస్తున్నారు. ఆడపిల్లలను వద్దని వివక్ష చూపడం సరైంది కాదని తెలిసినా గర్భంలోనే తుంచివేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న స్కానింగ్‌ సెంటర్ల  నిర్వాహకులు ఆడపిల్ల వద్దనుకుంటున్న వారికి శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు చేయడం చట్టరీత్యా నేరమని బోర్డులు ప్రదర్శిస్తూనే గట్టుచప్పుడు కాకుండా స్కానింగ్‌సెంటర్లలో ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. కొందరు అర్హత లేకున్నా వైద్యులుగా క్లీనిక్‌లు నడుపుతున్న వారు అబార్షన్లు చేస్తున్నారు. కరీంనగర్‌లో భ్రూణహత్యలు నిత్యకృత్యాలుగా మారాయని, జనావాసాల మధ్య ఇలాంటి వాటిని నిర్వహిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. బంగారు తల్లి, కల్యాణలక్ష్మి, బేటీ బచావో.. బేటీ పడావో వంటి పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వాలు భ్రూణహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి.  


బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం
అధికారులు భ్రూణహత్యల నివారణకు వంద శాతం చర్యలు తీసుకుటుంన్నట్లు పేర్కొంటున్నా జిల్లాలో ఆడశిశువుల జననాలు తగ్గిపోతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 1991 జనాభా లెక్కల ప్రకారం 0–6 బాలబాలికల నిష్పత్తి 1000 : 981 ఉంటే 2011 జనాభా లెక్కల వరకు 0–6 వయసు గల బాలబాలికల నిష్పత్తి 1000 :937కు పడిపోయింది. 2001 ప్రకారం బాలబాలికల నిష్పత్తి 1000 :982 ఉంది. ప్రభుత్వం 1994లో గర్భస్థ పిండ ప్రక్రియ నిరోధక చట్టాన్ని(పీఎన్‌డీటీ) ప్రవేశపెట్టింది. చట్టాలపై అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయిలో నిధులు విడుదల అవుతున్నా బాలికల నిష్పత్తి తగ్గుతూనే ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు స్కానింగ్‌సెంటర్లపై పూర్తిగా నిఘా కొరవడింది. వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 140వరకు స్కానింగ్‌ కేంద్రాలు ఉండగా 52 వేర్వేరు కారణాలతో మూసివేశారు. వీటిలో నాలుగు కేసులు మాత్రమే నమోదైనట్లు సమాచారం. 2017లో కరీంనగర్‌ మంకమ్మతోటలోని ఓ స్కానింగ్‌సెంటర్‌ను సీపీ కమలాసన్‌రెడ్డి తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశారు. స్కానింగ్‌ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉంది. కనీసం గర్భిణికి ఎన్నో కాన్పు, గతంలో అబార్షన్లు జరిగాయా, అనే ప్రాథమిక సమాచారం లేకుండానే రికార్డులు నిర్వహించడం వారి డొల్లతనానికి నిదర్శనం. 

తనిఖీలు చేయని కమిటీలు..
నిత్యకృత్యాలుగా మారిన శిశువు లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను అరికట్టడంలో ఏర్పాటైన కమిటీలు ఏనాడూ స్కానింగ్‌ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. భ్రూణహత్యల నివారణకు గతంలో మొబైల్‌ బృందాలు ఏర్పాటు చేసుకొని స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్న సౌకర్యాలు, స్కానింగ్‌ నిర్వహణ, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం ఆ బృందాలు ఉన్నా, అడ్వయిజరీ కమిటీలు వంటివి ఏర్పాటు చేసిన భ్రూణహత్యలు నివారిండంలో విఫలం అవుతున్నారు. నగరంలోని అన్ని గైనకాలజిస్టు హాస్పిటల్స్‌లో స్కానింగ్‌ నిర్వహిస్తున్నా నాలుగేళ్లలో ఒక్క కేసు నమోదు చేయకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. 

చట్టం ఏం చెబుతోంది..

  • గర్బంలోనే ఆడశిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగనిర్ధారణ నిరోధక చట్టం తెచ్చింది. 
  • ఈ చట్టాన్ని అనుసరించి గర్భిణి ఆరోగ్య పరిస్థితిలో మార్పులు, పిండం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తప్ప ఎలాంటి పరిస్థితిలోనూ పరీక్షలు చేయకూడదు. 
  • గర్భస్థ శిశు పరీక్షలు నిర్వహించే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఇతర కేంద్రాలు వైద్య, ఆరోగ్య శాఖలో తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఉండాలి. 

శిశు లింగ నిర్ధారణ చేస్తే చర్యలు..
స్కానింగ్‌ సెంటర్లలో శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 140వరకు శిశు లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉండగా వీటిలో 52 స్కానింగ్‌ సెంటర్లు మూసేయడం జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా మూసివేయగా, మరికొన్ని కేంద్రాలు తొలగించుకోగా మరికొన్నింటిని మూసేశాం. శిశువు లింగనిర్ధారణ నివారణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. లింగనిర్ధారణ నివారణకు దాదాపు 10మందితో కూడిన అడ్బయిజరీ కమిటీ ఉంది. అందులో డీఎంహెచ్‌ఓ, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, న్యాయవాదితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్కానింగ్‌ సెంటర్లు నిర్వహించే హాస్పిటల్స్‌లో ఆ గైనకాలజిస్టు కనీసం ఆరు నెలలపాటు స్కానింగ్‌పై శిక్షణ పొంది ఉండాల్సి ఉంది. స్కానింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేసుకునే వారు తప్పకుండా రిజిష్టర్‌ చేయించుకోవాలి. నిబంధనలు పాటించని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాంమనోహర్‌రావు, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement