
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంటిపై ఏసీబీ దాడులు
* రూ.2 కోట్ల విలువైన అరకిలో బంగారం,
* 52 ప్లాట్ల డాక్యుమెంట్లు స్వాధీనం
నిజామాబాద్; న్యూస్‌లైన్: నిజామాబాద్ ట్రాన్స్‌కో ఈఆర్‌వో ఆఫీసులో జూనియర్ అకౌంటెంట్ పడాల సత్తయ్య ఇంటిపై 15మంది ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేసి రెండు కోట్ల ఆస్తులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు కథనం ప్రకారం.. ద్వారకానగర్‌కాలనీవాసి సత్తయ్య పై అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటలకే సత్తయ్య ఇంటికి చేరుకున్న అధికారులు సాయంత్రం 5 గంటల వరకు సోదాలు జరిపారు. 52 ప్లాట్ల డాక్యుమెంట్లు, రూ.25 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, అరకిలో బంగారం, రూ.87 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సత్తయ్యకు రూ. 5 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 12 బ్యాంకు అకౌంట్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు బైకులున్నాయి. పలు రియల్‌ఎస్టేట్ వెంచర్లలో భాగస్వామికూడా. సత్తయ్యను అరెస్టు చేశామని, నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తామని డీస్పీ తెలిపారు.