కూకట్‌పల్లి ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంట్లో శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. సంజీవరావుకు సంబంధించిన వివిధ ప్రాంతాలలోని ఆరు చోట్ల ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కూకట్ పల్లి కార్యాలయం సహా అల్వాల్ లోని ఇళ్లు, వరంగల్, కరీంనగర్లలో దాడులు కొనసాగుతున్నాయి.
ఈ దాడుల్లో 75 తులాల బంగారం, షాపింగ్ కాంప్లెక్స్, ఐటీ కాలనీలో రెండు ఇళ్లు, షామీర్ పేటలో ఓ ఫాం హౌజ్, తూప్రాన్లో 30 ఎకరాలు, మూలుగులో 10 ఎకరాలు, రామన్నపేటలో 10 ఎకరాల స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక కంటోన్మెంట్ వాసవీ కాలనీలో బినామీ పేర్ల మీద సంజీవరావు ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీపీ డీఎస్పీ సునీత వెల్లడించారు. సంజీవరావుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. సోమవారం బ్యాంకు లాకర్లను తెరవనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు రెండుకోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.