సాక్షి, చెన్నై: చెన్నై తిరుమంగళం ఏసీపీ కమిల్ బాషా ఏసీబీ వలలో పడ్డారు. ఆయన కార్యాలయంలో జరిగిన సోదాల్లో రూ.5 లక్షల మేరకు నగదు బయట పడింది. స్థల వివాదం సెటిల్ మెంట్‌లో భాగంగానే ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటూ అవినీతి ఏసీపీ ఏసీబీకి చిక్కారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల కాలంగా పనిభారం, మానసిక ఒత్తిడి కారణంగా పోలీసు విభాగంలోని కింది స్థాయి సిబ్బంది బలవన్మరణాలకు పాల్పడుతూ రావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలీసు బాసుల మీద అవినీతి ఆరోపణలు క్రమంగా పెరుగుతూ రావడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో తిరుమంగళం ఏసీపీ కార్యాలయంలో సోదాలు సాగడం పోలీసుల్ని కలవరంలో పడేసింది. తిరుమంగళం పరిసరాల్లో ఇటీవల కాలంగా నిర్మాణాలు జోరందుకోవడంతో పోలీసు సెటిల్‌మెంట్లు సైతం పెరిగినట్టుగా అందిన రహస్య సమాచారంతో నిఘా వేసి మరీ అవినీతి భాషాను తమ వలలోకి ఏసీబీ వర్గాలు వేసుకున్నాయి.
అవినీతి బాషా : తిరుమంగళం ఏసీపీ కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో జేజే నగర్ ఏసీపీ కార్యాలయంలోనే తిరుమంగళంకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏసీపీగా కమిల్ భాషా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమంగళం ఏసీపీ కార్యాలయంలో పంచాయితీలు పెరిగినట్టు, సెటిల్ మెంట్లు జోరందుకున్నట్టుగా ఏసీబీకి సమాచారం అందిందింది. దీంతో ఏసీబీ వర్గాలు నిఘా వేశాయి. శుక్రవారం రాత్రి పద కొండుగంటల సమయంలో తమ నిఘాకు తగ్గట్టుగా ఆధారం చిక్కడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కొడుంగయూరుకు చెందిన కాంట్రాక్టర్ సెల్వం ఏసీపీ కమిల్ భాషా గదిలో సుదీర్గ చర్చలో ఉన్నట్టు సమాచారం ఏసీబీకి అందింది.
ఏసీబీ ఏఎస్పీ కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. వచ్చి రాగానే నేరుగా ఏసీపీ గదిలోకి ఈ బృందం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ సెల్వం, కమిల్ బాషాఏదో విషయంగా సుదీర్ఘ చర్చలో మునిగి ఉండడం, ఏసీపీ టేబుల్ మీద నోట్ల కట్టలు ఉండటాన్ని ఏసీబీ గుర్తించింది. ఏసీబీ వర్గాల ప్రవేశంతో కమిల్ బాషా, సెల్వంలకు షాక్ తప్పలేదు. ఆ టేబుల్ మీదున్న 2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, ఆ నగదు ఎక్కడిదని ఏసీబీ విచారణ మొదలెట్టింది. తన మిత్రుడి వద్ద అప్పుగా తీసుకున్నది అని కమిల్ బాషా పేర్కొనడం తక్షణం, పక్కనే ఉన్న సెల్వం వద్ద ఉన్న బ్యాగ్‌లో తనిఖీ చేయగా అందులో నుంచి రెండున్నర లక్షలకు పైగా నగదు లభించడంతో తమ విచారణను ముమ్మరం చేశారు. ఆ ఇద్దరు పొంతన లేని సమాధానం ఇవ్వడంతో రాత్రంతా విచారణ సాగింది. శనివారం ఉదయాన్నే విచారణను ముగించిన ఏసీబీ వర్గాలు, ఆ నగదును సీజ్ చేశారు. సరైన వివరణ ఇవ్వని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించి, ఆ ఇద్దరికి కొంత సమయం ఇచ్చి వెళ్లారు.
కమిల్ బాషా ఏసీబీకి చిక్కిన సమాచారం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది. ఇంత పెద్ద మొత్తం సెటిల్ మెంట్ సాగుతున్న నేపథ్యంలో ఇందులో వాటా ఒక్క కమిల్ బాషాకే కాదు, మరి కొందరికి సైతం ఉండ వచ్చన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో జేజే నగర్ ఇన్‌స్పెక్టర్ పాండియరాజన్‌ను సైతం విచారణ వలయంలోకి ఏసీబీ తీసుకొచ్చింది. స్థల వివాదం పరిష్కారంలో భాగంగా ఎనిమిది లక్షలకు బేరం సాగినట్టు, ఇందులో అడ్వాన్స్ తీసుకుంటున్న సమయంలో ఏసీబీ రంగంలోకి దిగినట్టుగా జేజేనగర్ పోలీసు స్టేషన్‌లో చర్చ సాగుతున్నది.
ఈ అవినీతి వెనుక ఒక్క కమిల్ బాషానే కాదు, మరెందరో ఉన్నారని, మరెందరో ఉన్నతాధికారులకు సైతం వాటాలు తప్పనిసరి అన్నట్టుగా కింది స్థాయి సిబ్బంది పెదవి కొరుకుతుండడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి లోతైనా విచారణ సాగించేనా లేదా, ఈ తనిఖీలతో మమా అనిపించేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇది వరకు చెన్నైలో ఐపీఎల్ బెట్టింగ్ వెలుగులోకి రాగా, కమిల్ భాషా నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే, చెన్నైలో ఏదేని కీలక కేసుల విచారణలో ప్రత్యేక బృందంగా కమిల్ బాషా టీం గుర్తింపు పొంది ఉండం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment