బెయిల్‌పై సుప్రీంకు ఏసీబీ
* రేవంత్ తదితరులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేయాలని నిర్ణయం
* తీవ్రంగా కసరత్తు చేస్తున్న అధికారులు
* ఎమ్మెల్యే సండ్రపైనా దృష్టి.. కోర్టును ఆశ్రయించే యోచన
* ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
* సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఏసీబీ డీజీ ఏకేఖాన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో రేవంత్‌రెడ్డి సహా ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. ప్రజా ప్రతినిధులకు డబ్బు ఎర వేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరిగిందని ఆరోపిస్తున్న ఏసీబీ.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరించాలని భావిస్తోంది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత ఏసీబీ దానిని క్షుణ్నంగా పరిశీలించి.. ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ వ్యవహారానికి సంబంధించి రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు ఇంకా ఇస్తానని చెప్పిన రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని సుప్రీంకు వివరించనుంది. అంతేగాక నాలుగో నిందితుడు మత్తయ్యను ఇంకా విచారించలేదని, నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తమ ముందు హాజరుకాలేదని... ఇలాంటి సమయంలో ప్రధాన నిందితులకు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని నివేదించనుంది. దీంతోపాటు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఏసీబీ నిర్ణయించింది.
తదుపరి టార్గెట్ సండ్ర
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటివరకు సాక్షిగా పరిగణించిన ఎమ్మెల్యే సండ్ర విషయంలో ఏసీబీ సీరియస్‌గా ఉంది. ఈ కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహలను విచారించి సమాచారాన్ని రాబ ట్టిన ఏసీబీ.. అందుకనుగుణంగా ఎమ్మెల్యే సండ్రకు సీఆర్‌పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం నోటీసులు జారీచేసింది. కానీ ఆయన అనారోగ్యం సాకుతో తమ ముందుకు రాకపోవడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించింది. ఆయన కోరిన గడువు పది రోజులు పూర్తయినా తప్పించుకు తిరుగుతున్న సండ్రను ఇక ఉపేక్షించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు. దర్యాప్తునకు సహకరించని ఆరోపణలపై సండ్రను కూడా నిందితుల జాబితాలో చేర్చడంపై సాధ్యాసాధ్యాలను న్యాయ నిపుణుల సహాయంతో పరిశీలిస్తున్నారు.
‘బాస్’కు నోటీసులు!
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంది. బాబు తనతో ఫోన్‌లో మాట్లాడారని స్టీఫెన్‌సన్ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. ఈ వ్యవహారంలో రికార్డు చేసిన ఆడియో, వీడి యో టేపులు అసలైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా స్పష్టం చేసింది. దీంతో బాబుకు నోటీసులివ్వాలని ఏసీబీ యోచిస్తోంది. మరోవైపు ఈ కుట్రలో డబ్బు సమకూర్చిన వ్యక్తుల పాత్ర కీలకమని భావిస్తున్న ఏసీబీ వారిపైనా దృష్టి పెట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఎం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కేసు దర్యాప్తు అంశాలను ఆయనకు వివరించారు.