
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనల పునరుద్ధరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో అగ్రవర్ణాల ఆత్మరక్షణకూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్రవర్ణాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసుల నుంచి కాపాడుకునేందుకు అగ్రవర్ణాల ఆత్మరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి పార్లమెంటులో ఆమోదించాలని కోరారు.
కులం అనేది సామాజిక హోదాగా పరిగణించబడుతున్న నేపథ్యంలో కులం పేరుతో ఏ వర్గాన్ని దూషించినా నేరంగా పరిగణించేలా చట్టాన్ని సవరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగమవుతోందని భావించిన అత్యున్నత న్యాయస్థానం చట్టంలో మార్పులు చేసిందని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు, సంఘాల ఒత్తిడికి తలొగ్గి పాత నిబంధనలను పునరుద్ధరించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం సరైంది కాదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దళితులు, అగ్రవర్ణాల మధ్య ఐక్యతను పెంపొందించకుండా కేవలం వారి మధ్య అగాధం సృష్టించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment