Upper castes
-
ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలోని బిలియనీర్ సంపదలో దాదాపు 90 శాతం అగ్రకులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు తేలింది.'ట్యాక్స్ జస్టిస్ అండ్ వెల్త్ రీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా' పేరుతో రూపొందించిన ఈ నివేదికలో సంపద పంపిణీకి సంబంధించిన అంశాలను వివరించారు. దేశంలోని బిలియనీర్ల సంపదలో 88.4 శాతం అగ్రకులాల మధ్య కేంద్రీకృతమై ఉందని నివేదిక డేటా వివరణాత్మక విశ్లేషణను అందిస్తోంది. అత్యంత అణగారిన వర్గాలలో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) సంపన్న భారతీయులలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.ఈ అసమానత బిలియనీర్ సంపదను మించి విస్తరించింది. 2018-19 ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే (ఏఐడీఐఎస్) ప్రకారం జాతీయ సంపదలో అగ్రవర్ణాల వాటా దాదాపు 55 శాతం. సంపద యాజమాన్యంలోని ఈ స్పష్టమైన వ్యత్యాసం భారతదేశ కుల వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఆర్థిక అసమానతలను నొక్కిచెబుతోంది.స్వాతంత్య్రానంతరం క్షీణించిన దేశ ఆదాయం, సంపద అసమానతలు 1980వ దశకంలో పెరగడం ప్రారంభమయ్యాయి. 2000వ దశకం నుంచి మరింత ఉచ్ఛ స్థాయికి పెరిగాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు శిఖరాగ్రానికి పెరగడం గమనార్హం. ముఖ్యంగా టాప్ 1 శాతం జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికి పైగా నియంత్రిస్తున్నారు. ఇది 1980లో ఉన్న 12.5 శాతం కంటే పెరిగింది. మొత్తం ప్రీట్యాక్స్ ఆదాయంలో 22.6 శాతం వీరు సంపాదిస్తున్నారు. ఇది 1980లో ఇది 7.3 శాతంగా ఉండేది. -
కుల గణితంలో... హస్తవ్యస్తమే..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరు సాగుతున్న మధ్యప్రదేశ్‌లో కులాల కుంపట్లు హస్తం పార్టీకి ప్రతికూలంగా మారేలా కన్పి స్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల అగ్రకులాలు అండగా లేకపోవడం కాంగ్రెస్‌కు ఈసారీ నష్టం చేస్తుందంటున్నారు. వారి మద్దతు కూడగట్టుకునేందుకు పార్టీపరంగా పెద్దగా ప్రయత్నాలు కూడా జరగడం లేదు. దాంతో ఈసారి కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి! సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత ఉన్నత వర్గాలను ఆకట్టుకునేలా చర్యలేవీ లేకపోవడం కూడా కాంగ్రెస్ విజయావకాశాలను ప్రభావితం చేసేలా కన్పి స్తోంది... అగ్రకులాలు.. గట్టి శక్తే మధ్యప్రదేశ్ జనాభాలో అగ్ర కులాలు 14 శాతం వరకు ఉన్నాయి. వీరిలో 6 శాతం బ్రాహ్మణులు, 5.8 శాతం రాజపుత్రులు 2.5 బనియాలున్నారు. రాష్ట్రంలో 10కి పైగా జిల్లాల్లో ఏకంగా 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను అగ్రవర్ణాల ఓట్లు గట్టిగా ప్రభావితం చేయగలవు. గ్వాలియర్, నర్సింగఢ్, రేవా, సారన్‌గఢ్, కంకేర్ ప్రాంతాల్లో అగ్రకులాలదే ఆధిపత్యం. ఇక మధ్యప్రదేశ్‌లో ఓబీసీలు 42 శాతం, ఎస్టీలు 21 శాతం, ఎస్సీలు 14 శాతం దాకా ఉన్నారు. క్రమంగా దూరం... మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలన్నీ నిజానికి 2003 వరకు కాంగ్రెస్‌తోనే సాగాయి. ఆ తర్వాత నుంచి పలు కారణాలతో క్రమంగా పార్టీకి దూరమవుతూ వస్తున్నారు... రాష్ట్రంలో బీజేపీ హవా పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు అగ్ర కుల ఓట్లు బాగా తగ్గుతూ వచ్చాయి. 1990 వరకు అగ్రకుల ఓట్లలో కాంగ్రెస్ 40 శాతం దాకా రాబడుతూ వచ్చింది. 2003 నాటికి ఇది సుమారు 37 శాతానికి పరిమితమైంది. 2008లో అగ్రవర్ణ ఓటర్లలో కేవలం 19 శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేశారు. దాదాపు 45 శాతం మందికి పైగా బీజేపీకి జై కొట్టారు. 2013లో అగ్ర కుల ఓట్లలో బీజేపీకి 59 శాతం, కాంగ్రెస్‌కు 24 శాతం దక్కాయి. 2018లో కాంగ్రెస్ కాస్త మెరుగైన ఫలితాలే సాధించింది. అగ్రవర్ణ ఓట్లలో కాంగ్రెస్ 33 శాతం సాధించింది! అయితే బీజేపీకి ఏకంగా 58 శాతం ఓట్లు పడ్డాయి. సింధియా నిష్కమణతో... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు 15 నెలలకే షాక్ తగిలింది. తనను కాదని కమల్‌నాథ్‌ను సీఎం చేయడంపై ముందునుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా అదను చూసి దెబ్బ కొట్టారు. 2020లో ఏకంగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు! దాంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలడం, శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. సింధియా నిష్కమణతో అగ్ర వర్ణాలతో కాంగ్రెస్‌కు దూరం మరింత పెరిగింది. వారిని పార్టీకి దగ్గర చేసేందుకు సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ చొరవ చూపినా పెద్దగా లాభం లేకపోయింది. ఆయన ప్రయత్నాలకు పార్టీ అధిష్టానం నుంచి పెద్దగా సహకారం కూడా లభించలేదంటారు. ఆ కులాల మీదే దృష్టి! రాష్ట్రంలో 42 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు, 35 శాతం దాకా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, పీసీసీ చీఫ్ కమల్ నాథ్ తదితరులు కూడా తమ ఎన్నికల వ్యూహాల్లో అదే చెబుతూ వస్తున్నారు. ఈ సామాజిక వర్గాల ఓట్లమీదే ప్రధానంగా దృష్టి పెట్టాలని అభ్యర్థులకు పదేపదే నొక్కిచెబుతూ వచ్చారు... అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బిహార్ తరహాలో కులగణన జరుపుతామని ఇప్పటికే ప్రకటించారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఓబీసీలకు 62 టికెట్లు, ఎస్టీలకు 34, ఎస్సీలకు 18 టికెట్లు కాంగ్రెస్ కేటాయించింది. ఓబీసీల్లోనూ ఈజీ కాదు...! అయితే కేవలం ఓబీసీ, ఇతర కులాల దన్నుతో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లను అధిగమించడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదని గణాంకాలు చెబుతున్నాయి... 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీల్లో బీజేపీ 41% శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌కు దక్కింది 27 శాతమే. 2013 ఎన్నికల్లోనూ ఓబీసీ ఓట్లలో కాంగ్రెస్‌కు 35 శాతం రాగా బీజేపీ 44 శాతం ఓట్లు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి 48 శాతం ఓబీసీ ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 41శాతం వచ్చాయి. ఇక ఎస్సీ, ఎస్టీ ఓట్లలోనూ కాస్త అటూ ఇటుగా ఇదే ధోరణి ప్రతిఫలించి. ఈ నేపథ్యంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతోనే గట్టెక్కాలనుకోవడం సాహసమేనని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి! -
EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల Economically Weaker Sections ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు(సోమవారం) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సీజేఐతో సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. మొత్తం నలుగురు.. న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంటుందని ప్రకటించగా.. ఒక్కరు మాత్రం తీర్పుతో విభేధించారు. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ విజయం దక్కినట్లయ్యింది. తీర్పు వెలువరించే సయమంలో సీజేఐ యూయూ లలిత్ ఉన్నత విద్యలో ఆర్థికంగా వెనుకబడిన విభాగం (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటు మరియు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ సమస్యలకు సంబంధించిన అంశంపై నాలుగు తీర్పులు వెలువడాల్సి ఉందని తెలిపారు. తొలుత జస్టిస్ దినేశ్ మహేశ్వరి మాట్లాడుతూ, EWS సవరణ సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించదు. రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలను ఉల్లంఘించలేదు. 50% ఉల్లంఘన ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు అని తీర్పు ఇచ్చారు. ఆ వెంటనే.. జస్టిస్ బేలా ఎం త్రివేది మాట్లాడుతూ, తన తీర్పు జస్టిస్ మహేశ్వరితో ఏకీభవించిందని, జనరల్ కేటగిరీలోని EWS కోటా చెల్లుబాటు అయ్యేదని, రాజ్యాంగబద్ధమని చెప్పారు. జస్టిస్ JB పార్దివాలా రాజ్యాంగం యొక్క 103వ సవరణ చట్టం 2019 యొక్క చెల్లుబాటును కూడా సమర్థించారు, ఇది సాధారణ వర్గంలో 10 శాతం EWS రిజర్వేషన్‌ను అందిస్తుందన్నారు. అయితే.. జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం భిన్నాభిప్రాయంతో తీర్పు వెల్లడించారు. 103వ రాజ్యాంగ సవరణ యొక్క చెల్లుబాటును సమర్థిస్తూ మెజారిటీ తీర్పుతో విభేదించారు.దీంతో.. మెజార్టీ తీర్పు కేంద్ర నిర్ణయానికి అనుకూలంగా వచ్చినట్లయ్యింది. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వర్గాలకు 10 శాతం కల్పిస్తూ.. 103వ రాజ్యాంగ సవరణ చేపట్టింది కేంద్రం. అయితే.. చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఐదుగురు న్యామూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. గత నెలలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీం ధర్మాసనం. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) ప్రవేశాలు, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి గల రాజ్యాంగపరమైన చెల్లుబాటు గురించి 40 దాకా పిటిషన్లు దాఖలు అయ్యాయి. చీఫ్ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టి.. అన్ని వాదనలు వింది. ఈడబ్ల్యూఎస్ EWS అభ్యర్థులకు రిజర్వేషన్లలో కోటా కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ రిజర్వేషన్ల చెల్లుబాటును సవాలు చేస్తూ అదే ఏడాది పలు పిటిషన్లు దాఖలు కాగా, అందులో ‘జన్హిత్ అభియాన్’ ప్రముఖంగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తే.. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటుతుందన్నది ప్రధాన అభ్యంతరం. ఇదీ చదవండి: ఒక్కరోజు ముందుగానే వీడ్కోలు -
అగ్రవర్ణ పేదలకు ‘మెడికల్’లో రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019–20 వైద్య విద్యా సంవత్సరంలో భర్తీ చేయబోయే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తారు. దీనికి సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, అందుకు అవసరమైన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినందున ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లల్లో అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా మంజూరయ్యే సీట్లలోనే అమలు చేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ఆర్మీ, ఎన్సీసీ, దివ్యాంగులు, మహిళలకు కూడా కోటా కల్పిస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలను కేవలం తెలంగాణలోనే ఉన్న కులాలకే అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంసీఐకి ప్రతిపాదించింది. కానీ దానిపై స్పష్టత రాకపోవడంతో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లోనే అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. 200 సీట్లు అదనంగా పెరిగే అవకాశం... వాస్తవంగా తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఇతర రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే 25 శాతం అదనంగా సీట్లు పెంచాలి. ఆ ప్రకారం తెలంగాణలో ఏకంగా 387 సీట్లు పెరగాలి. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, అది గరిష్ట పరిమితి వరకు ఉండటంతో అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కాదని అంటున్నారు. ఇక ఈఎస్ఐలోని సీట్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం ఇక్కడి ప్రభుత్వానికి లేదు. ఇక నల్లగొండ, సూర్యాపేటలో ఈ ఏడాది నుంచి ప్రారంభం కాబోయే మెడికల్ కాలేజీలకు కూడా ఈడబ్ల్యూఎస్ సీట్లకు అనుమతి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే అక్కడ మంజూరైన సీట్ల మేరకు కూడా ఫ్యాకల్టీ లేదు. ఈ నేపథ్యంలో అదనపు సీట్లకు అనుమతి రావడం కష్టమని అంటున్నారు. అంటే మిగిలిన కాలేజీల్లోని సీట్ల ఆధారంగా చూస్తే అదనపు సీట్లు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం దాదాపు 200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఐదెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంటే రిజర్వేషన్ వర్తించదు... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాల్లోని పేదల ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంటే అటువంటి వారికి ఈ రిజర్వేషన్ వర్తించదు. ఇంటి స్థలం వెయ్యి చదరపు అడుగులున్నా, నిర్దారించిన మున్సిపాలిటీల్లో 200 చదరపు గజాల స్థలమున్నా అనర్హులే. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీటికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. -
మోదీకి పట్టంకట్టిందీ వారే!
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ అనుకూల పవనాలు స్పష్టంగా కనిపించిన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి కారణాలేమిటీ ? అన్న అంశంపై సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ తర్జనభర్జనలు పడుతున్నారు. దాదాపు అన్ని ఎన్నికల ముందస్తు సర్వేలో బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లు రావని తేల్చాయి. బీజేపీ 300 మార్కును దాటుందని ఎగ్జిట్ పోల్స్‌లోనే తేలింది. అప్పటి వరకు నిశ్శబ్ద పవనాలు మోదీకి అనుకూలంగా వీచాయి. అవి ఏమిటీ? ‘నేషనల్ ఎలక్షన్ స్టడీ 2019’ అధ్యయనం వివరాల ప్రకారం ధనవంతులు, అగ్రవర్ణాల వారు, ఎగువ మధ్య తరగతి వాళ్లు ఎక్కువగా బీజేపీకి ఓటు వేశారు. అగ్రవర్ణాల్లో 61 శాతం మంది బీజేపీకే ఓటు వేశారట. ఈ విషయంలో మరే పార్టీ 50 శాతం మార్కును దాటలేదు. అది పార్లమెంట్ ప్రాతినిథ్యంలో కూడా కనిపించింది. అంటే పార్లమెంట్‌కు ఎన్నికైన వారిలో ఎక్కువ మంది అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. మోదీ కేబినెట్లో కూడా సగానికిపైగా అగ్రవర్ణాల వారికే చోటు లభించింది. ఆ తర్వాత 44 శాతం మంది ధనవంతులు, అంతే శాతం మంది ఎగువ మధ్యతరగతి వారు బీజేపీకే ఓటు వేశారు. దిగువ తరగతుల వారు, పేదల్లో 36 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం పట్లణ ప్రాంతాల్లో 41.1 శాతం సెమీ పట్టణ ప్రాంతాల్లో 32.9 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 37.6 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. మొత్తం రాజకీయ పార్టీల్లో ధనిక పార్టీ బీజేపీయే అవడం, ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీయే ఖర్చు పెట్టడం కూడా ఆ పార్టీకి లాభించింది. మొత్తం అన్ని పార్టీల ఎన్నికల ప్రచారానికి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ‘ది సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అంచనా వేసింది. అందులో 27 వేల కోట్ల (45–50 శాతం) రూపాయలను బీజేపీ ఒక్కటే ఖర్చు చేయగా, కాంగ్రెస్ పార్టీ 15–20 శాతం రూపాయలను మాత్రమే ఖర్చు చేయగలిగిందట. ధనవంతులు, అగ్రవర్ణాల వారు తాము బీజేపీకే ఓటు వేస్తున్నామని మీడియా ముందు చెప్పకపోవడం, ముస్లింలు, దళితులను వ్యతిరేకించే హిందూత్వవాదులే ధనవంతులు, అగ్రవర్ణాల్లో ఎక్కువ ఉండడం వల్ల వారు ఎక్కువ మౌనాన్ని పాటించారని తెలుస్తోంది. అందుకనే మోదీ అనుకూల పవనాలు బయటకు కనిపించలేదు. -
అడగనివారికి రిజర్వేషన్లా?: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: అగ్రకులాల్లో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. అడగని వాళ్లకు, అవసరం లేని వారికి రిజర్వేషన్లు కల్పించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 9 శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో దాదాపు వంద మంది బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రధాన రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 మంది సీఎంలు అయితే ఒక్కరు కూడా బీసీ కులాలకు చెందిన వారు లేరన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు కానీ.. బీసీలు లేరన్నారు. ఆఖరికి బ్యాంక్ చైర్మన్లు, ప్రభుత్వ రంగ చైర్మన్ల పదవుల్లో కూడా అగ్రకులాల వారే ఉన్నారని ధ్వజమెత్తారు. 80 శాతం కీలక పదవులను అనుభవిస్తున్న అగ్రకులాలకు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం ఉందా అని నిలదీశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం
-
పేదలకు కోటా!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎవరూ ఊహించని రీతిలో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ నిరుపేదలు లబ్ధి పొందే విధంగా విద్య, ఉద్యోగావకాశాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. నిజానికి కేంద్రం అగ్రవర్ణ పేదలు అనే మాట వాడలేదు. జనరల్ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు కోటా సదుపాయం ఇస్తున్నట్టు మాత్రమే ప్రకటించింది. ఈ నిర్ణయం అగ్రవర్ణాల్లోని పేదలతోపాటు ఇతర మతాల్లోని పేదలకు కూడా వర్తిస్తుంది. ఆ సంగతలా ఉంచి ఇది సాకారమైతే ఇప్పుడున్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరు తాయి. కోటా పరిమితి 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది గనుక ఈ నిర్ణ యాన్ని సవాలు చేస్తూ ఎవరైనా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. మన రాజ్యాంగం ఆర్థిక వెనుకబాటుతనాన్ని రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకోవటం లేదు. దాన్ని అధి గమించటం కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను కూడా సవరించాల్సి ఉంటుంది. మంగ ళవారం ముగియాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను మరో రోజు పొడిగించాలని నిర్ణయిం చారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించింది. అయితే ప్రస్తుత సమావేశాల్లో ఇది ఆమోదం పొందే అవకాశాలు లేవనే చెప్పాలి. పార్లమెంటు లోపలా, వెలు పలా ఎంతో లోతుగా చర్చించాల్సిన అంశం అలా ఒక్కరోజులో ఆమోదం పొందాలని భావించడం కూడా పొరపాటు. రిజర్వేషన్లు ఉండటం అవసరమా కాదా అన్న చర్చ ఈనాటిది కాదు. స్వాతం త్య్రానికి ముందూ, తర్వాత కూడా ఆ విషయంలో చర్చలు సాగాయి. సాగుతున్నాయి. రిజర్వేషన్లు ఉండరాదని గతంలో ఉద్యమాలు సాగించిన అగ్ర కులాలు తమను కూడా బీసీలుగా పరిగణించి ఆ సదుపాయం వర్తింపజేయాలని గత కొన్నేళ్లుగా కోరుతున్నాయి. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితరచోట్ల అందుకోసం ఉద్యమాలు సాగాయి. ఇతర కారణాలతోపాటు అగ్రవర్ణాల్లో ఉండే ఈ అసంతృప్తి కూడా ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీ వైఫల్యానికి దారి తీసి ఉండొచ్చునని బీజేపీలో అంతర్మథనం మొదలైందని మీడియా కథనాలు చెబుతున్నాయి. విప క్షాలు ఆరోపిస్తున్నట్టు దాని పర్యవసానంగానే ఈ నిర్ణయం వెలువడి ఉండొచ్చు కూడా. పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల సదుపాయం కల్పిస్తూ 1991లో పీవీ నరసిం హారావు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగంలోని 16వ అధికరణాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలిపింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ దాని జోలికి పోలేదు. ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా అప్పట్లో పెల్లుబికిన నూతన అవకాశాల వల్ల కావొచ్చు... రాజ్యాంగాన్ని సవరించి అయినా ఆ కోటా అమలు చేసి తీరాలని ఎవరూ ఉద్యమించ లేదు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ సంస్కరణల కారణంగా పుట్టుకొచ్చిన కొత్త సమస్యలు అన్ని వర్గాలనూ తాకడం మొదలైంది. చేతివృత్తులు దెబ్బతిని అట్టడుగు కులాలు, సాగు సంక్షోభం ఏర్పడి వ్యవ సాయంపై ఆధారపడే కులాలు ఒడిదుడుకుల్లో పడటం ప్రారంభించాయి. అందువల్లే తమకు రిజ ర్వేషన్ల ఫలాలు అందటం లేదని ఎస్సీ కులాల్లో, ఓబీసి కులాల్లోని అత్యంత వెనకబడిన వర్గాల్లో అసం తృప్తి రాజుకుంది. పర్యవసానంగా కొత్తగా రిజర్వేషన్లు కావాలనేవారూ, ఉన్న రిజర్వేషన్లను వర్గీకరిం చాలని కోరేవారు రంగంలోకొచ్చారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వీటిని దృష్టిలో ఉంచుకునే నిరుపేద వర్గాల పిల్లలు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్, వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ, నెలనెలా పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇవి ఆచరణలో మంచి ఫలితాలనిచ్చాయి. అలాంటి పథకాలు లేనిచోట, ఉన్నా సమర్థవంతంగా అమలుకాని చోట రిజర్వేషన్ల డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రాతిపదిక వేరు. తరతరాలుగా సామాజిక అణచివేతకు, వివక్షకూ గుర వుతూ అన్నివిధాలా వెనకబడి ఉన్న కులాలకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు ఉండే ఈ సదుపాయం అనంతరకాలంలో ఓబీ సీలకు కూడా అమలుకావడం మొదలైంది. తాజాగా కల్పిస్తామంటున్న కోటాకు ప్రాతిపదిక పేదరికం అంటున్నారు. పేదరికం కారణంగా ఎవరైనా సామాజిక వెనకబాటుకు గురయ్యారని ఎలా నిరూ పిస్తారో, ఆ నిర్ణయానికి దారితీసిన సర్వే ఏమిటో, దాని డేటా ఏమిటో తెలియాల్సి ఉంది. ఇవి లేన ప్పుడు తాజా నిర్ణయం న్యాయసమీక్షకు నిలిచే అవకాశం లేదు. దాని సంగతలా ఉంచి పేదరికాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్ధారించిన ప్రాతిపదికలు గమనిస్తే ఎంతమంది ఆ కోటాకు అర్హుల వుతారో చెప్పలేం. వార్షికాదాయం రూ. 8 లక్షలు లేదా 5 ఎకరాల లోపు సాగుభూమి లేదా 1,000 చదరపు అడుగుల లోపు నివాస స్థలం, మున్సిపల్ ప్రాంతాల్లో 200 చదరపు అడుగుల లోపు నివా సస్థలం ఉన్నవారే నిరుపేదలుగా పరిగణనలోకి వస్తారు. ఒకపక్క మన ఆర్థిక వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉన్నదని చెప్పుకుంటాం. జీడీపీ అంత కంతకూ పెరుగుతున్నదని మురుస్తుంటాం. కానీ క్షేత్ర స్థాయిలో వాటి ఫలాలు ఎవరికీ చేరటం లేదని వివిధ వర్గాల అసంతృప్తిని చూస్తే అర్ధమవుతుంది. అగ్రవర్ణ పేదలకు సైతం లబ్ధి చేకూరుస్తామంటే కాదనే వారుండరు. కానీ నిజంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలున్నాయా? రిటైరయ్యేవారు అవు తుండగా లక్షలాది ఖాళీలను అలాగే ఉంచుతున్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో కానిస్తు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోటా విస్తరణ నిరుద్యోగాన్ని, పేదరికాన్ని సమూలంగా తుడిచి పెడుతుందా? వివిధ వర్గాల అసంతృప్తికి, ఆర్ధిక సంక్షోభానికి ఉన్న మూలకారణాలను స్పృశించ కుండా, వాటికి పరిష్కారాలను వెదక్కుండా...ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచ కుండా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఏముంటుంది? తాజా నిర్ణయం సమాజంలో కొత్త వైషమ్యాలకు దారితీయరాదని ఆశిద్దాం. -
అగ్రవర్ణ పేదలకు 25 శాతం రిజర్వేషన్లు
లక్నో: అగ్రవర్ణ పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే ప్రతిపాదించారు. అందుకు రిజర్వేషన్ కోటాను 75 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఉన్నత కులాల్లోని పేదలకు 25 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే అది అందరికీ ఉపయోగకరం. 75 శాతానికి రిజర్వేషన్లను పెంచాలి. ఇందుకు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని అన్నారు. ఓబీసీలకు, దళితులకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే విషయంలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే వీలుందని పేర్కొన్నారు. -
‘అగ్రవర్ణాల ఆత్మరక్షణకు చట్టం తేవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనల పునరుద్ధరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో అగ్రవర్ణాల ఆత్మరక్షణకూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్రవర్ణాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసుల నుంచి కాపాడుకునేందుకు అగ్రవర్ణాల ఆత్మరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి పార్లమెంటులో ఆమోదించాలని కోరారు. కులం అనేది సామాజిక హోదాగా పరిగణించబడుతున్న నేపథ్యంలో కులం పేరుతో ఏ వర్గాన్ని దూషించినా నేరంగా పరిగణించేలా చట్టాన్ని సవరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగమవుతోందని భావించిన అత్యున్నత న్యాయస్థానం చట్టంలో మార్పులు చేసిందని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు, సంఘాల ఒత్తిడికి తలొగ్గి పాత నిబంధనలను పునరుద్ధరించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం సరైంది కాదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దళితులు, అగ్రవర్ణాల మధ్య ఐక్యతను పెంపొందించకుండా కేవలం వారి మధ్య అగాధం సృష్టించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓసీలకు 25% రిజర్వేషన్లు ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. మొత్తంగా వారికి 25 శాతం రిజర్వేషన్లను కల్పించడం వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే క్రీమీలేయర్ పద్ధతిని వర్తింపజేయవచ్చన్నారు. ప్రస్తుతం ప్రజల సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే ప్రజల ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత చట్టాల్లో మార్పులను పరిశీలించొచ్చన్నారు. రిజర్వేషన్ల కోసం గుజరాత్లో పాటిదార్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో జాట్లు చేస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లను తాను సమర్థించినట్లు అథవాలే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు ప్రభుత్వం రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తోందని, ఈ మొత్తాన్ని రూ. లక్షకు పెంచాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. గోరక్ష పేరిట దాడులు జరగడం అమానుషమని, గోవులకు రక్షణ ఇవ్వడం మంచిదేనని, కానీ దాని పేరిట మనుషులకు రక్షణ ప్రశ్నార్థకం కారాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కింద ఏటా 42 వేల కేసులు నమోదవుతున్నాయని మంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు అప్పటికప్పుడు స్పందించ డం తప్ప దాడులు జరగకుండా నిరోదించేందుకు కృషి చేయాలని సూచించారు. హెచ్‌సీయూలో రోహిత్‌వేముల లాంటి ప్రతిభావంతుడు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ల భర్తీపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో ఆయన అంతకుముందు సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘అంబేడ్కర్–రాజ్యాంగవాదం’అనే అంశంపై జరిగిన సదస్సులో కూడా అథవాలే పాల్గొన్నారు. -
అగ్ర కులాలకూ రిజర్వేషన్లుః కేంద్ర మంత్రి అథవాలే
సాక్షి,అహ్మదాబాద్: అగ్రవర్ణాల్లో పేదలకూ రిజర్వేషన్లు వర్తింపచేయాలని, ఉద్యోగాల్లో కోటాను ప్రస్తుతమున్న 49.5 నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. గతంలో భారత క్రికెట్ జట్టులో ఎస్సీ, ఎస్టీలకు కోటా కోసం అథవలే డిమాండ్ చేశారు. పటేళ్లు, రాజ్పుట్స్, బ్రాహ్మణులు, బనియాలు, మరాఠాలకూ రిజర్వేషన్లు కల్పించేందుకు కోటాను మరో 25 శాతం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కులాల్లో క్రీమిలేయర్ పరిమితిని ఏడాదికి రూ 8 లక్షలుగా నిర్ణయించాలన్నారు.అగ్ర కులాలకు ఇచ్చే రిజర్వేషన్‌తో ప్రస్తుత కోటా సిస్టమ్‌లో విఘాతం కలుగరాదని, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సి ఉందన్నారు. -
అగ్రకులాలకు వేధింపులా?
విశ్లేషణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989ని మహారాష్ట్రలో అత్యాచారాల చట్టంగా పిలవడం పరిపాటి. అదే ఇప్పుడు ఆ రాష్ట్రంలో వివాదాంశంగా మారింది. ఆధిపత్య కులంగా ఉన్న మరాఠాలు తాము సైతం వెనుకబడి ఉన్నామని, తమకూ రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. దళితులు తమను వేధించడానికి అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. చారిత్రకంగా అణచివేతకు గురవుతున్న దళితులు, తాము అత్యాచారాలకు గురవుతున్నా చాలా సందర్భాల్లో తమ కేసులను పోలీసు స్టేషన్లు నమోదు చేసుకోవడం లేదని, ఇక ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరచినట్టు రాష్ట్ర పౌర హక్కుల పరిరక్షణ విభాగానికి ఇంతవరకు ఒక్క ఫిర్యాదైనా అందలేదు. బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో దళితులు, కలుపుకుపోయే స్వభావం లేని హిందూ మతాన్ని విడనాడి బౌద్ధాన్ని స్వీకరించినప్పటి నుంచి వారి పట్ల ద్వేష భావం ఉంది. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును మహా మానవుని (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్) పేరిట మార్చడానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రాజకీయ చతురుడైన శరద్ పవార్ వంటి నేతకే ఆ పేరు మార్పు కష్టమైంది. నవ బౌద్ధులు సమరశీలత కలిగినవారే అయినా అహింసావాదులు, ఆత్మగౌరవం కలిగినవారు అయిన సామాజిక వర్గం. అది, రిజర్వేషన్లను కోరుతున్న మరాఠాల మధ్య ఉన్న ఏకత్వ భావనంత బలంగా కూడా ఉంది. మరాఠాలు సామాజిక, రాజకీయ ఆధిపత్యం గల సామాజిక వర్గం. అయినా వారు తాము వెనుకబడి ఉన్నామనడానికి... వ్యవసాయ కమతాలను కోల్పోవడం, అధ్వానంగా ఉన్న పంట దిగుబడులు, ఇతరులతో పోలిస్తే ఉద్యోగిత స్థాయి అల్పంగా ఉండటం వంటి పలు కారణాలున్నాయి. రిజర్వేషన్లు కల్పించినా, కల్పించకపోయినా వారి ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవలసినదే. మరాఠాల రిజర్వేషన్ల సమస్య ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. కాబట్టి రిజర్వేషన్లు కావాలనే మరాఠాల కోరిక న్యాయబద్ధమైనదేనని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలను ఒప్పించాల్సి ఉంటుంది. కానీ అది అత్యాచారాల చట్టాన్ని ఉపసంహరించుకోవడం గానీ లేదా ‘‘దుర్వినియోగం’’ కాకుండా దాన్ని మార్చడం గానీ చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. కాకపోతే అలా చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయవచ్చు. ఆ చట్టం పదును తగ్గించమనడం సహా ఇంకా ఏమైనా చేయాలంటే పార్లమెంటులో చట్టం చేయమని కోరగలుగుతుంది. కానీ దళితులు నిజంగానే అణచివేతకు, అత్యాచారాలకు గురువుతున్నవారు. ఓటర్లలో వారు చెçప్పుకోదగిన భాగంగా ఉన్నారు. అందువల్ల అత్యాచారాల చట్టం సవరణకు ఇతర రాష్ట్రాలు, పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉండకపోవచ్చు. మరాఠాలు కోరుతున్న కోటాలను సాధించడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరాఠాలకు భరోసా ఇస్తున్నారు. అయితే అత్యాచారాల చట్టం విషయానికి వచ్చేసరికి ఆయన దానిలోని ఏ అంశాన్నీ నీరుగార్చేది లేదనే దృఢ వైఖరితో ఉన్నారు. అయితే, ఆ చట్టం దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటూ, దళితుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఆయన ఒక శాసనసభా కమిటీని ఏర్పాటు చేశారు. అత్యాచారాల చట్టం కఠినమైనదనడంలో సందేహం లేదు. దాన్ని మరింత బలోపేతం చేసేలా మరి కొన్ని నేరాల జాబితాను ఒక బిల్లు ద్వారా ఆ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ బిల్లు చట్టంగా రూపొంది కొన్ని నెలలే అయింది. తమ రాష్ట్రంలో ఏడాదికి 1,400 నుంచి 2,000 వరకు కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారు. అయితే దళిత కార్యకర్తలు ఈ సంఖ్య మిగతా రాష్ట్రా లతో పోలిస్తే తక్కువే అంటున్నారు. ఈ చట్టాన్ని దాదాపు ఉపయోగించనే లేదన్నంత స్వల్పంగా, ఒక్క శాతం కేసులే నమోదైతే...అగ్ర కులాలను వేధించడానికి దాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడ? అని దళితుల ప్రశ్న. వేధింపులు అంటే కేసులు పెట్టడమే కాదు, ఆ చట్టం కింద కేసులు పెడతామని బెదిరించడం కూడా. ఏదేమైనా ఇప్పటికీ రాష్ట్రంలో ఈ చట్టంకింద కేసుల విచారణకు తగినన్ని ప్రత్యేక న్యాయస్థానాలే ఏర్పాటు కాలేదు. ఒక కేసును నమోదు చేశారంటే... అది ఆ వ్యక్తిని తాను అమాయకుడినని నిరూపించు కునే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియకు కట్టిపడేస్తుంది. కానీ దాదాపుగా దళితులు ఎవరికీ తమ కేసులను కొనసాగించడానికి సరిపడేటన్ని వనరులు ఉండనే ఉండవు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
అన్యాయాలను సహించం
ఇందూరు :అగ్రవర్ణాలు వివక్షతో దళితులపై దాడులు చేస్తే, హింసలకు గురిచేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిం చి వారికి మరోధైర్యాన్ని ఇస్తామన్నారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆమె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎస్సీ సబ్‌ప్లాన్, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల ఆక్రమణ, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, దళిత, గిరిజన సంఘాల నాయకులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు. తొలి సమావేశం ఇక్కడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఇక్కడే సమావేశం నిర్వహిస్తున్నామని కమలమ్మ తెలి పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడుస్తు న్నా దళితులు ఇంకా అన్యాయానికి గురవుతూనే ఉ న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షను చూపినవారిని శిక్షించి, బాధితులకు న్యాయం చేయడానికి ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్ మరింత చురుకుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పోలీ స్, రెవెన్యూ శాఖల నుంచి దళితులు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దళితుల కోసం యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని, చ ట్టం చేసినప్పటికీ దానిని అమలు చేయడంలో లోపాలున్నాయన్నారు. వాటిని సవరించుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు నిజాయితీగా పని చేస్తే ఫలితం ఉంటుందన్నారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు. సొంత భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం దళితుల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశిం చారు. దళితులపై గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలను అరికట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి దళితులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే నిందితులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కమలమ్మ ఆదేశిం చారు. జిల్లాలో 94 అట్రాసిటీ కేసులు నమోదు కాగా, నిజామాబాద్ డివిజన్లో 11, ఆర్మూర్‌లో 9, బోధన్ 6, కామారెడ్డిలో 7, మొత్తం 33 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని త్వరగా పరిష్కరించాలని అ ధికారులను ఆదేశించారు. డీఎఫ్ఓ గంగయ్య హత్య కే సులో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలను వారి కుటుంబ సభ్యులకు అంద జేయాలని సూచించారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ సమావేశంలో కంట తడిపెట్టింది. తన వ్యవసాయ భూమిలోంచి అక్రమంగా దా రి నిర్మించిన వ్యక్తిని ఎదురించినందుకు తనను దూ షించి అసభ్యకరంగా వ్యవహరించినా తనకు న్యా యం జరగలేదని వాపోయింది. ఇందుకు స్పందించి న కమిషన్ సభ్యురాలు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 14 రో జులలో దీనిపై పూర్తి నివేదికను అందించాలన్నారు. సెప్టెంబర్ రెండున హియరింగ్ నిర్వహిస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు ఇచ్చిన పలు ఫిర్యాదు లు, వినతులు స్వీకరించిన ఆమె వాటిని పరిష్కరిస్తామని హామినిచ్చారు. సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, అదనపు ఎస్పీ పాండునాయక్, రాష్ట్ర స్థాయి అ ధికారులు హన్మంత్‌రావు, అజయ్‌కుమార్, అధికారు లు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.