సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరు సాగుతున్న మధ్యప్రదేశ్‌లో కులాల కుంపట్లు హస్తం పార్టీకి ప్రతికూలంగా మారేలా కన్పి స్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల అగ్రకులాలు అండగా లేకపోవడం కాంగ్రెస్‌కు ఈసారీ నష్టం చేస్తుందంటున్నారు. వారి మద్దతు కూడగట్టుకునేందుకు పార్టీపరంగా పెద్దగా ప్రయత్నాలు కూడా జరగడం లేదు. దాంతో ఈసారి కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి! సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత ఉన్నత వర్గాలను ఆకట్టుకునేలా చర్యలేవీ లేకపోవడం కూడా కాంగ్రెస్ విజయావకాశాలను ప్రభావితం చేసేలా కన్పి స్తోంది...
అగ్రకులాలు.. గట్టి శక్తే
- మధ్యప్రదేశ్ జనాభాలో అగ్ర కులాలు 14 శాతం వరకు ఉన్నాయి.
- వీరిలో 6 శాతం బ్రాహ్మణులు, 5.8 శాతం రాజపుత్రులు 2.5 బనియాలున్నారు.
- రాష్ట్రంలో 10కి పైగా జిల్లాల్లో ఏకంగా 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను అగ్రవర్ణాల ఓట్లు గట్టిగా ప్రభావితం చేయగలవు.
- గ్వాలియర్, నర్సింగఢ్, రేవా, సారన్‌గఢ్, కంకేర్ ప్రాంతాల్లో అగ్రకులాలదే ఆధిపత్యం.
- ఇక మధ్యప్రదేశ్‌లో ఓబీసీలు 42 శాతం, ఎస్టీలు 21 శాతం, ఎస్సీలు 14 శాతం దాకా ఉన్నారు.
క్రమంగా దూరం...
- మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలన్నీ నిజానికి 2003 వరకు కాంగ్రెస్‌తోనే సాగాయి. ఆ తర్వాత నుంచి పలు కారణాలతో క్రమంగా పార్టీకి దూరమవుతూ వస్తున్నారు...
- రాష్ట్రంలో బీజేపీ హవా పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు అగ్ర కుల ఓట్లు బాగా తగ్గుతూ వచ్చాయి.
- 1990 వరకు అగ్రకుల ఓట్లలో కాంగ్రెస్ 40 శాతం దాకా రాబడుతూ వచ్చింది.
- 2003 నాటికి ఇది సుమారు 37 శాతానికి పరిమితమైంది.
- 2008లో అగ్రవర్ణ ఓటర్లలో కేవలం 19 శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేశారు. దాదాపు 45 శాతం మందికి పైగా బీజేపీకి జై కొట్టారు.
- 2013లో అగ్ర కుల ఓట్లలో బీజేపీకి 59 శాతం, కాంగ్రెస్‌కు 24 శాతం దక్కాయి.
- 2018లో కాంగ్రెస్ కాస్త మెరుగైన ఫలితాలే సాధించింది. అగ్రవర్ణ ఓట్లలో కాంగ్రెస్ 33 శాతం సాధించింది! అయితే బీజేపీకి ఏకంగా 58 శాతం ఓట్లు పడ్డాయి.
సింధియా నిష్కమణతో...
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు 15 నెలలకే షాక్ తగిలింది. తనను కాదని కమల్‌నాథ్‌ను సీఎం చేయడంపై ముందునుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా అదను చూసి దెబ్బ కొట్టారు. 2020లో ఏకంగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు! దాంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలడం, శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. సింధియా నిష్కమణతో అగ్ర వర్ణాలతో కాంగ్రెస్‌కు దూరం మరింత పెరిగింది. వారిని పార్టీకి దగ్గర చేసేందుకు సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ చొరవ చూపినా పెద్దగా లాభం లేకపోయింది. ఆయన ప్రయత్నాలకు పార్టీ అధిష్టానం నుంచి పెద్దగా సహకారం కూడా లభించలేదంటారు.
ఆ కులాల మీదే దృష్టి!
- రాష్ట్రంలో 42 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు, 35 శాతం దాకా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, పీసీసీ చీఫ్ కమల్ నాథ్ తదితరులు కూడా తమ ఎన్నికల వ్యూహాల్లో అదే చెబుతూ వస్తున్నారు. ఈ సామాజిక వర్గాల ఓట్లమీదే ప్రధానంగా దృష్టి పెట్టాలని అభ్యర్థులకు పదేపదే నొక్కిచెబుతూ వచ్చారు...
- అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బిహార్ తరహాలో కులగణన జరుపుతామని ఇప్పటికే ప్రకటించారు.
- ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు.
- ఈసారి ఎన్నికల్లో ఓబీసీలకు 62 టికెట్లు, ఎస్టీలకు 34, ఎస్సీలకు 18 టికెట్లు కాంగ్రెస్ కేటాయించింది.
ఓబీసీల్లోనూ ఈజీ కాదు...!
- అయితే కేవలం ఓబీసీ, ఇతర కులాల దన్నుతో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లను అధిగమించడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదని గణాంకాలు చెబుతున్నాయి...
- 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీల్లో బీజేపీ 41% శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌కు దక్కింది 27 శాతమే.
- 2013 ఎన్నికల్లోనూ ఓబీసీ ఓట్లలో కాంగ్రెస్‌కు 35 శాతం రాగా బీజేపీ 44 శాతం ఓట్లు సాధించింది.
- 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి 48 శాతం ఓబీసీ ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 41శాతం వచ్చాయి.
- ఇక ఎస్సీ, ఎస్టీ ఓట్లలోనూ కాస్త అటూ ఇటుగా ఇదే ధోరణి ప్రతిఫలించి.
- ఈ నేపథ్యంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతోనే గట్టెక్కాలనుకోవడం సాహసమేనని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి!
Comments
Please login to add a commentAdd a comment