సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. మొత్తంగా వారికి 25 శాతం రిజర్వేషన్లను కల్పించడం వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే క్రీమీలేయర్ పద్ధతిని వర్తింపజేయవచ్చన్నారు. ప్రస్తుతం ప్రజల సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే ప్రజల ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత చట్టాల్లో మార్పులను పరిశీలించొచ్చన్నారు.
రిజర్వేషన్ల కోసం గుజరాత్‌లో పాటిదార్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో జాట్లు చేస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లను తాను సమర్థించినట్లు అథవాలే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు ప్రభుత్వం రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తోందని, ఈ మొత్తాన్ని రూ. లక్షకు పెంచాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. గోరక్ష పేరిట దాడులు జరగడం అమానుషమని, గోవులకు రక్షణ ఇవ్వడం మంచిదేనని, కానీ దాని పేరిట మనుషులకు రక్షణ ప్రశ్నార్థకం కారాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కింద ఏటా 42 వేల కేసులు నమోదవుతున్నాయని మంత్రి అన్నారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు అప్పటికప్పుడు స్పందించ డం తప్ప దాడులు జరగకుండా నిరోదించేందుకు కృషి చేయాలని సూచించారు. హెచ్‌సీయూలో రోహిత్‌వేముల లాంటి ప్రతిభావంతుడు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ల భర్తీపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో ఆయన అంతకుముందు సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘అంబేడ్కర్–రాజ్యాంగవాదం’అనే అంశంపై జరిగిన సదస్సులో కూడా అథవాలే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment