
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019–20 వైద్య విద్యా సంవత్సరంలో భర్తీ చేయబోయే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తారు. దీనికి సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, అందుకు అవసరమైన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినందున ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లల్లో అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా మంజూరయ్యే సీట్లలోనే అమలు చేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ఆర్మీ, ఎన్‌సీసీ, దివ్యాంగులు, మహిళలకు కూడా కోటా కల్పిస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలను కేవలం తెలంగాణలోనే ఉన్న కులాలకే అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంసీఐకి ప్రతిపాదించింది. కానీ దానిపై స్పష్టత రాకపోవడంతో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లోనే అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
200 సీట్లు అదనంగా పెరిగే అవకాశం...
వాస్తవంగా తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఇతర రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే 25 శాతం అదనంగా సీట్లు పెంచాలి. ఆ ప్రకారం తెలంగాణలో ఏకంగా 387 సీట్లు పెరగాలి. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, అది గరిష్ట పరిమితి వరకు ఉండటంతో అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కాదని అంటున్నారు. ఇక ఈఎస్‌ఐలోని సీట్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం ఇక్కడి ప్రభుత్వానికి లేదు. ఇక నల్లగొండ, సూర్యాపేటలో ఈ ఏడాది నుంచి ప్రారంభం కాబోయే మెడికల్ కాలేజీలకు కూడా ఈడబ్ల్యూఎస్ సీట్లకు అనుమతి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే అక్కడ మంజూరైన సీట్ల మేరకు కూడా ఫ్యాకల్టీ లేదు. ఈ నేపథ్యంలో అదనపు సీట్లకు అనుమతి రావడం కష్టమని అంటున్నారు. అంటే మిగిలిన కాలేజీల్లోని సీట్ల ఆధారంగా చూస్తే అదనపు సీట్లు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం దాదాపు 200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి.
ఐదెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంటే రిజర్వేషన్ వర్తించదు...
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాల్లోని పేదల ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంటే అటువంటి వారికి ఈ రిజర్వేషన్ వర్తించదు. ఇంటి స్థలం వెయ్యి చదరపు అడుగులున్నా, నిర్దారించిన మున్సిపాలిటీల్లో 200 చదరపు గజాల స్థలమున్నా అనర్హులే. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీటికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment