అగ్రకులాలకు వేధింపులా?
విశ్లేషణ
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989ని మహారాష్ట్రలో అత్యాచారాల చట్టంగా పిలవడం పరిపాటి. అదే ఇప్పుడు ఆ రాష్ట్రంలో వివాదాంశంగా మారింది. ఆధిపత్య కులంగా ఉన్న మరాఠాలు తాము సైతం వెనుకబడి ఉన్నామని, తమకూ రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. దళితులు తమను వేధించడానికి అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. చారిత్రకంగా అణచివేతకు గురవుతున్న దళితులు, తాము అత్యాచారాలకు గురవుతున్నా చాలా సందర్భాల్లో తమ కేసులను పోలీసు స్టేషన్లు నమోదు చేసుకోవడం లేదని, ఇక ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరచినట్టు రాష్ట్ర పౌర హక్కుల పరిరక్షణ విభాగానికి ఇంతవరకు ఒక్క ఫిర్యాదైనా అందలేదు.
బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో దళితులు, కలుపుకుపోయే స్వభావం లేని హిందూ మతాన్ని విడనాడి బౌద్ధాన్ని స్వీకరించినప్పటి నుంచి వారి పట్ల ద్వేష భావం ఉంది. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును మహా మానవుని (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్) పేరిట మార్చడానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రాజకీయ చతురుడైన శరద్ పవార్ వంటి నేతకే ఆ పేరు మార్పు కష్టమైంది. నవ బౌద్ధులు సమరశీలత కలిగినవారే అయినా అహింసావాదులు, ఆత్మగౌరవం కలిగినవారు అయిన సామాజిక వర్గం. అది, రిజర్వేషన్లను కోరుతున్న మరాఠాల మధ్య ఉన్న ఏకత్వ భావనంత బలంగా కూడా ఉంది.
మరాఠాలు సామాజిక, రాజకీయ ఆధిపత్యం గల సామాజిక వర్గం. అయినా వారు తాము వెనుకబడి ఉన్నామనడానికి... వ్యవసాయ కమతాలను కోల్పోవడం, అధ్వానంగా ఉన్న పంట దిగుబడులు, ఇతరులతో పోలిస్తే ఉద్యోగిత స్థాయి అల్పంగా ఉండటం వంటి పలు కారణాలున్నాయి. రిజర్వేషన్లు కల్పించినా, కల్పించకపోయినా వారి ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవలసినదే. మరాఠాల రిజర్వేషన్ల సమస్య ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. కాబట్టి రిజర్వేషన్లు కావాలనే మరాఠాల కోరిక న్యాయబద్ధమైనదేనని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలను ఒప్పించాల్సి ఉంటుంది. కానీ అది అత్యాచారాల చట్టాన్ని ఉపసంహరించుకోవడం గానీ లేదా ‘‘దుర్వినియోగం’’ కాకుండా దాన్ని మార్చడం గానీ చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు.
కాకపోతే అలా చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయవచ్చు. ఆ చట్టం పదును తగ్గించమనడం సహా ఇంకా ఏమైనా చేయాలంటే పార్లమెంటులో చట్టం చేయమని కోరగలుగుతుంది. కానీ దళితులు నిజంగానే అణచివేతకు, అత్యాచారాలకు గురువుతున్నవారు. ఓటర్లలో వారు చెçప్పుకోదగిన భాగంగా ఉన్నారు. అందువల్ల అత్యాచారాల చట్టం సవరణకు ఇతర రాష్ట్రాలు, పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉండకపోవచ్చు. మరాఠాలు కోరుతున్న కోటాలను సాధించడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరాఠాలకు భరోసా ఇస్తున్నారు. అయితే అత్యాచారాల చట్టం విషయానికి వచ్చేసరికి ఆయన దానిలోని ఏ అంశాన్నీ నీరుగార్చేది లేదనే దృఢ వైఖరితో ఉన్నారు. అయితే, ఆ చట్టం దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటూ, దళితుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఆయన ఒక శాసనసభా కమిటీని ఏర్పాటు చేశారు.
అత్యాచారాల చట్టం కఠినమైనదనడంలో సందేహం లేదు. దాన్ని మరింత బలోపేతం చేసేలా మరి కొన్ని నేరాల జాబితాను ఒక బిల్లు ద్వారా ఆ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ బిల్లు చట్టంగా రూపొంది కొన్ని నెలలే అయింది. తమ రాష్ట్రంలో ఏడాదికి 1,400 నుంచి 2,000 వరకు కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారు. అయితే దళిత కార్యకర్తలు ఈ సంఖ్య మిగతా రాష్ట్రా లతో పోలిస్తే తక్కువే అంటున్నారు. ఈ చట్టాన్ని దాదాపు ఉపయోగించనే లేదన్నంత స్వల్పంగా, ఒక్క శాతం కేసులే నమోదైతే...అగ్ర కులాలను వేధించడానికి దాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడ? అని దళితుల ప్రశ్న.
వేధింపులు అంటే కేసులు పెట్టడమే కాదు, ఆ చట్టం కింద కేసులు పెడతామని బెదిరించడం కూడా. ఏదేమైనా ఇప్పటికీ రాష్ట్రంలో ఈ చట్టంకింద కేసుల విచారణకు తగినన్ని ప్రత్యేక న్యాయస్థానాలే ఏర్పాటు కాలేదు. ఒక కేసును నమోదు చేశారంటే... అది ఆ వ్యక్తిని తాను అమాయకుడినని నిరూపించు కునే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియకు కట్టిపడేస్తుంది. కానీ దాదాపుగా దళితులు ఎవరికీ తమ కేసులను కొనసాగించడానికి సరిపడేటన్ని వనరులు ఉండనే ఉండవు.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com