కంటి తుడుపు పట్టింపు
విశ్లేషణ
భారత జనాభాలో రెండు శాతానికి పైగా వికలాంగులు. ఇతర దేశా లతో పోలిస్తే మన దేశంలో వికలాంగుల శాతం తక్కువే. కానీ సంఖ్య రీత్యా మూడు కోట్ల వరకు ఉన్న వివిధ రకాల వికలాంగులంటే ఓ మధ్యస్త స్థాయి దేశ జనాభా అంత. ఇదేమీ పట్టించుకోకుండా వదలేయ గలిగేది కాదు. ఆందోళన కలిగించాల్సిన వాస్తవం, ఏమైనా చేయాల్సి ఉన్న విషయం.
‘బెస్ట్’ అనే పొట్టి పేరుతో పిలిచే ముంబై ముని సిపల్ రవాణా వ్యవస్థ వైఖరి మాత్రం అందుకు విరుద్ధమనిపిస్తుంది. వికలాంగులకు ఎక్కడం, దిగ డం సులువుగా ఉండే లో-ఫ్లోర్డ్ బస్సులను ప్రవేశ పెట్టడానికి వ్యతిరేకంగా అది తీర్మానం చేసింది. ఏదో కంటి తుడుపుగా అలాంటి కొన్ని బస్సులను నడిపితే చాలనేదే దాని సాధారణ వైఖరిగా ఉంది. బస్సులన్నిటినీ వికలాంగులకు అనువైనవిగా ఉండేట్టు చేసి, తద్వారా గర్వించదగ్గ గుర్తింపును సాధించాలనే మంచి ఆలోచన మాత్రం వారికి పుట్టలేదు. పేవ్‌మెంట్లన్నీ రోడ్డు మీది నుంచి ఒకే ఎత్తులో ఉండేలా చేయాలనీ, బస్సుల్లోకి ఎక్కి దిగడం సులువుగా అవి పేవ్‌మెంట్ అంచుకు దగ్గరగా ఆగేలా చేయాలనీ తన మాతృసంస్థయైన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబైని కోరాలనే యోచన సైతం దానికి రాలేదు.
వాస్తవంలో వికలాంగులు బస్సులోకి ముందు ద్వారం గుండా ఎక్కి, దిగాల్సిందే. వారికి కేటా యించిన సీటు సరిగ్గా ముందు టైరుకు ఎగువన ఉంటుంది. వికలాంగుల పట్ల మనకున్న శ్రద్ధ ఆపాటిది... అసలంటూ అది ఉంటే. రోడ్డు పక్క పాదచారులు నడిచే బాటలు మునిసిపల్ సంస్థల ప్రమాణాలకు తగ్గట్టుండవు. అలాంటివి ఉన్న సందర్భాల్లో కూడా... ఒక్క నడవడానికి తప్ప, పార్కింగ్ నుంచి వ్యాపారాల వరకు వాటికి ఇతర ఉపయోగాలుంటాయి. ఈ నామమాత్రపు పట్టిం పునకు తగ్గట్టు 42,000 బస్సుల్లో ఓ 30 బస్సులంటే పెద్దగా లెక్కలోకొచ్చేవి కావు. వికలాంగులకు అవి మరింత ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చేయ డం ఎలా? అనేది ఎన్నడూ బహిరంగ చర్చకు రాలేదు. విమానాశ్రయంలో సైతం సమస్యను ఎదుర్కొనే వికలాంగులకు టీవీ చానల్ అందు బాటులో ఉండటం గురించి చెప్పనవసరమే లేదు.
ఒక దేశంగా మనం వికలాంగుల పట్ల సాను కూల వైఖరిని చూపే బాపతు కాదు. అంధులను ‘విజ్యువల్లీ ఇంపైర్డ్’ అనీ, బధిరులను ‘హియరింగ్ -ఛాలెంజ్డ్’ అనేసి, వారికి ఆ పాటి గౌరవ ప్రదర్శన చాలని భావిస్తాం. ఇక చేతల్లోనైతే, సమస్యలనె దుర్కొనే ఈ ప్రజా సమూహం పట్ల రవ్వంత గౌరవమైనా చూపం. వారి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనదంతా చేయడానికి బదులు మనం కంటి తుడుపువాదంలో లోతుగా కూరుకుపోయాం.
ఉదాహరణకు, ముంబై నగర రైళ్లలో వికలాం గుల కోసం కంపార్ట్‌మెంట్‌లో ఒక భాగాన్ని రిజర్వు చేసి, కాలి నడక వంతెనలకు బాగా దగ్గరగా అవి ఆగే ఏర్పాటు చేశారు, అంతే. కిటకటలాడే జనం మధ్య నుంచి వారు ఆ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కడం ఎలా? అసలా వంతెన మెట్లు ఎక్కి దిగేదెలా? అనేది ఎవరికీ పట్టలేదు. తమను ఎత్తుకుని మోయడానికి వాళ్లు పోర్టర్‌లను పెట్టుకోలేరు. ఆ రైళ్లు వర్ణనాతీత మైనంత అసాధారణంగా కిక్కిరిసి ఉంటాయని ఎవరైనా అంగీకరించాల్సిందే. అయినాగానీ, ఆరో గ్యవంతుడైన ఏ వ్యక్తీ ఆ కంపార్ట్‌మెంట్‌ను దురా క్రమించే ప్రయత్నం చేయడు. అంటే సమాజం వికలాంగుల పట్ల శ్రద్ధ చూపుతోందిగానీ, అధికా రులు, సేవలను అందించేవారికి మాత్రమే అది లేదని అర్థం. వైకల్యమంటే ఏమిటో సామాన్యునికి తెలుసు. అధికారులకు మాత్రం చాలా విషయాల్లో అదీ ఒకటి, అంతే.
ఈ శతాబ్ది మొదటి దశాబ్దిలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. నెలల తరబడి ఆయన రెండు కాళ్లూ కట్లతో ఉండాల్సి వచ్చింది.
సెక్రటేరియట్‌లో ఆయన లిఫ్ట్‌లను చేరుకోవడం కోసం వాలు దారిని (ర్యాంప్) నిర్మించారు. అసెంబ్లీ హాల్‌లో ట్రెజరీ బెంచీల వరకూ కూడా వాలు దారి వేశారు. కొట్ట వచ్చినట్టున్న ఈ మార్పులను చూసి ఏ సభ్యుడూ... ఆయనలాంటి మిగతా వారికి కూడా ఏ ఇబ్బందీ కలుగకుండా ఇలాంటి శ్రద్ధ చూపిస్తారా? అని అడగ లేదు. పాటిల్‌ది తాత్కాలిక వైకల్యమే. నేను ఈ విష యాన్ని లేవనెత్తేవరకు, ఆయన సైతం ప్రభుత్వ భవ నాలైనా వికలాంగులకు అనువుగా ఉండేలా చేయ డానికి నామమాత్రపు నిధులను కేటాయించలేదు.
కాళ్లూచేతుల తొలగింపునకు గురైనవారి నుంచి అంధత్వం, బధిరత్వాల వరకు వైకల్యాలు విభిన్న మైన వి. అందరికీ చక్రాల కుర్చీ లేదా ఊత కర్రలు అవసరం లేకపోవచ్చు. బహుశా బ్రెయిలీ మాత్రమే వికలాంగులకు కల్పించిన ఏకైక ప్రత్యేక సదుపా యం కావచ్చు. ఆటిజం, హైపర్ యాక్టివ్ సిండ్రోమ్ మొదలైన వాటికి కూడా మద్దతు అవసరమని గుర్తించడం అవసరం. ఆటిజంతో బాధపడుతున్న బాలుడిని బయటకు తీసుకుపోవడానికి వెంట ఓ టీచర్‌ను పంపడానికి జేబులు ఖాళీ అయ్యేంత భారీ ఫీజును వసూలు చేసే ఒక స్కూలు గురించి నాకు తెలుసు!
ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సురక్షి తంగా నడవగలిగే ఫుట్‌పాత్ వంటి చిన్న సదు పాయాలను సైతం వికలాంగులకు నిరాకరి స్తున్నాయి. రోడ్డు పక్క గతుకులతో కూడిన గరుకైన పాదచారుల బాటమీద ఊతకర్రలతో నడవడాన్ని లేదా చక్రాల కుర్చీని ఉపయోగించడాన్ని ఊహించు కోండి. ఇక తెల్ల బెత్తాన్ని ఉపయోగించేవారు పడితే, ఒక్కోసారి మూతలేని మ్యాన్‌హోల్‌లోనైనా పడ వచ్చు. ఎక్కడైనా ఫుట్‌పాత్‌లుంటే, అవి కుంటి తనం, అంధత్వం లాంటివేవీ లేని సాధారణ వ్యక్తులను సైతం గాయపరచి, వైకల్యానికి గురిచేయవచ్చు.
- మహేష్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com