పేదలకు కోటా! | Editorial On Reservation Of Upper Caste In Sakshi | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 8 2019 1:01 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial On Reservation Of Upper Caste In Sakshi

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎవరూ ఊహించని రీతిలో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ నిరుపేదలు లబ్ధి పొందే విధంగా విద్య, ఉద్యోగావకాశాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. నిజానికి కేంద్రం అగ్రవర్ణ పేదలు అనే మాట వాడలేదు. జనరల్‌ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు కోటా సదుపాయం ఇస్తున్నట్టు మాత్రమే ప్రకటించింది. ఈ నిర్ణయం అగ్రవర్ణాల్లోని పేదలతోపాటు ఇతర మతాల్లోని పేదలకు కూడా వర్తిస్తుంది. ఆ సంగతలా ఉంచి ఇది సాకారమైతే ఇప్పుడున్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరు తాయి. కోటా పరిమితి 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది గనుక ఈ నిర్ణ యాన్ని సవాలు చేస్తూ ఎవరైనా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. మన రాజ్యాంగం ఆర్థిక వెనుకబాటుతనాన్ని రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకోవటం లేదు. దాన్ని అధి గమించటం కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను కూడా సవరించాల్సి ఉంటుంది.

మంగ ళవారం ముగియాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను మరో రోజు పొడిగించాలని నిర్ణయిం చారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం ప్రవేశపెట్టాలని కేబినెట్‌ తీర్మానించింది. అయితే ప్రస్తుత సమావేశాల్లో ఇది ఆమోదం పొందే అవకాశాలు లేవనే చెప్పాలి. పార్లమెంటు లోపలా, వెలు పలా ఎంతో లోతుగా చర్చించాల్సిన అంశం అలా ఒక్కరోజులో ఆమోదం పొందాలని భావించడం కూడా పొరపాటు. రిజర్వేషన్లు ఉండటం అవసరమా కాదా అన్న చర్చ ఈనాటిది కాదు. స్వాతం త్య్రానికి ముందూ, తర్వాత కూడా ఆ విషయంలో చర్చలు సాగాయి. సాగుతున్నాయి. రిజర్వేషన్లు ఉండరాదని గతంలో ఉద్యమాలు సాగించిన అగ్ర కులాలు తమను కూడా బీసీలుగా పరిగణించి ఆ సదుపాయం వర్తింపజేయాలని గత కొన్నేళ్లుగా కోరుతున్నాయి. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తదితరచోట్ల అందుకోసం ఉద్యమాలు సాగాయి. ఇతర కారణాలతోపాటు అగ్రవర్ణాల్లో ఉండే ఈ అసంతృప్తి కూడా ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీ వైఫల్యానికి దారి తీసి ఉండొచ్చునని బీజేపీలో అంతర్మథనం మొదలైందని మీడియా కథనాలు చెబుతున్నాయి. విప క్షాలు ఆరోపిస్తున్నట్టు దాని పర్యవసానంగానే ఈ నిర్ణయం వెలువడి ఉండొచ్చు కూడా.

పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల సదుపాయం కల్పిస్తూ 1991లో  పీవీ నరసిం హారావు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగంలోని 16వ అధికరణాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలిపింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ దాని జోలికి పోలేదు. ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా అప్పట్లో పెల్లుబికిన నూతన అవకాశాల వల్ల కావొచ్చు... రాజ్యాంగాన్ని సవరించి అయినా ఆ కోటా అమలు చేసి తీరాలని ఎవరూ ఉద్యమించ లేదు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ సంస్కరణల కారణంగా పుట్టుకొచ్చిన కొత్త సమస్యలు అన్ని వర్గాలనూ తాకడం మొదలైంది. చేతివృత్తులు దెబ్బతిని అట్టడుగు కులాలు, సాగు సంక్షోభం ఏర్పడి వ్యవ సాయంపై ఆధారపడే కులాలు ఒడిదుడుకుల్లో పడటం ప్రారంభించాయి. అందువల్లే  తమకు రిజ ర్వేషన్ల ఫలాలు అందటం లేదని ఎస్సీ కులాల్లో, ఓబీసి కులాల్లోని అత్యంత వెనకబడిన వర్గాల్లో అసం తృప్తి రాజుకుంది. పర్యవసానంగా కొత్తగా రిజర్వేషన్లు కావాలనేవారూ, ఉన్న రిజర్వేషన్లను వర్గీకరిం చాలని కోరేవారు రంగంలోకొచ్చారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వీటిని దృష్టిలో ఉంచుకునే నిరుపేద వర్గాల పిల్లలు చదువుకోవడానికి  ఫీజు రీయింబర్స్‌మెంట్, వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ, నెలనెలా పింఛన్‌ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇవి ఆచరణలో మంచి ఫలితాలనిచ్చాయి. అలాంటి పథకాలు లేనిచోట, ఉన్నా సమర్థవంతంగా అమలుకాని చోట  రిజర్వేషన్ల డిమాండ్‌ బలంగా ముందుకొచ్చింది.

ప్రస్తుత రిజర్వేషన్ల ప్రాతిపదిక వేరు. తరతరాలుగా సామాజిక అణచివేతకు, వివక్షకూ గుర వుతూ అన్నివిధాలా వెనకబడి ఉన్న కులాలకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు ఉండే ఈ సదుపాయం అనంతరకాలంలో ఓబీ సీలకు కూడా అమలుకావడం మొదలైంది. తాజాగా కల్పిస్తామంటున్న కోటాకు ప్రాతిపదిక పేదరికం అంటున్నారు. పేదరికం కారణంగా ఎవరైనా సామాజిక వెనకబాటుకు గురయ్యారని ఎలా నిరూ పిస్తారో, ఆ నిర్ణయానికి దారితీసిన సర్వే ఏమిటో, దాని డేటా ఏమిటో తెలియాల్సి ఉంది. ఇవి లేన ప్పుడు తాజా నిర్ణయం న్యాయసమీక్షకు నిలిచే అవకాశం లేదు. దాని సంగతలా ఉంచి పేదరికాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్ధారించిన ప్రాతిపదికలు గమనిస్తే ఎంతమంది ఆ కోటాకు అర్హుల వుతారో చెప్పలేం. వార్షికాదాయం రూ. 8 లక్షలు లేదా 5 ఎకరాల లోపు సాగుభూమి లేదా 1,000 చదరపు అడుగుల లోపు నివాస స్థలం, మున్సిపల్‌ ప్రాంతాల్లో 200 చదరపు అడుగుల లోపు నివా సస్థలం ఉన్నవారే నిరుపేదలుగా పరిగణనలోకి వస్తారు. 

ఒకపక్క మన ఆర్థిక వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉన్నదని చెప్పుకుంటాం. జీడీపీ అంత కంతకూ పెరుగుతున్నదని మురుస్తుంటాం. కానీ క్షేత్ర స్థాయిలో వాటి ఫలాలు ఎవరికీ చేరటం లేదని వివిధ వర్గాల అసంతృప్తిని చూస్తే అర్ధమవుతుంది. అగ్రవర్ణ పేదలకు సైతం లబ్ధి చేకూరుస్తామంటే కాదనే వారుండరు. కానీ నిజంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలున్నాయా? రిటైరయ్యేవారు అవు తుండగా లక్షలాది ఖాళీలను అలాగే ఉంచుతున్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో కానిస్తు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోటా విస్తరణ నిరుద్యోగాన్ని, పేదరికాన్ని సమూలంగా తుడిచి పెడుతుందా? వివిధ వర్గాల అసంతృప్తికి, ఆర్ధిక సంక్షోభానికి ఉన్న మూలకారణాలను స్పృశించ కుండా, వాటికి పరిష్కారాలను వెదక్కుండా...ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచ కుండా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఏముంటుంది? తాజా నిర్ణయం సమాజంలో కొత్త వైషమ్యాలకు దారితీయరాదని ఆశిద్దాం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement