సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? | Activists fire to ponnala, damodara | Sakshi
Sakshi News home page

సిగ్గులేకుండా ఎందుకొచ్చారు?

Published Wed, May 21 2014 1:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? - Sakshi

సిగ్గులేకుండా ఎందుకొచ్చారు?

మీ వల్లే పార్టీ నాశనమైంది..
మా నోట్లో మట్టికొట్టారు
పొన్నాల, దామోదర్, ఉత్తమ్‌పై కార్యకర్తల ఫైర్

 
తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి
టీపీసీసీ నేతలను తూర్పారబట్టిన పార్టీ వర్గాలు
కార్యకర్తల తిట్ల ధాటికి తలవంచుకుని జారుకున్న నేతలు


హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల  ఫలితాల తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పరాజయం పాలవడానికి టీపీసీసీ పెద్దలే కారణమంటూ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీవల్లే పార్టీ సర్వనాశనమైంది. పాతికేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మాలాంటి వాళ్ల నోట్లో మన్నుకొట్టారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహలను గాంధీభవన్‌లో నిలదీశారు. కార్యకర్తల ఆగ్రహానికి విస్తుపోయిన సదరు నేతలు చేసేదేమీ లేక తలదించుకుని వెళ్లిపోయారు.

అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేసేందుకు పొన్నాల ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో మంగళవారం అందుబాటులో ఉన్న టీపీసీసీ ముఖ్య నేతలు సమావేశ మయ్యారు. ఉత్తమ్, దామోదరతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు రేణుకా చౌదరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.

టీపీసీసీ తీర్మానాన్ని దామోదర రాజనర్సింహ చదివి విన్పించగా.. మిగిలిన వారు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శులు బొల్లు కిషన్, బొట్టు వెంకన్న, జ్ఞానసుందర్ తదితరులు లేచి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వేదికపైనున్న నేతలు మైకు ఇవ్వకుండా సమావేశం ముగిసినట్లు ప్రకటించి వేదిక దిగబోయారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు నాయకులు, కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. ‘‘మీవల్లే కాంగ్రెస్ నాశనమైంది. ముమ్మాటికీ నాయకత్వ లోపమే. ఈ వాస్తవాన్ని మీరేందుకు ఒప్పుకోవడం లేదు? పాతికేళ్లుగా పార్టీని నమ్ముకుని రక్తం ధారపోసిన మా నోట్లో మన్నుకొట్టారు. తెలంగాణ ఇచ్చినా జనంలోకి వెళ్లలేక పార్టీని సర్వనాశనం చేశారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఘోరంగా ఓడిపోయిన పొన్నాల ఆ పదవిలో ఉండటానికి వీల్లేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉంటూ సొంత జిల్లాకే పరిమితమైన దామోదర రాజనర్సిహ... తనకు, తన భార్యకే టికెట్లు తెచ్చుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

దీంతో ఖిన్నులైన టీపీసీసీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. వారిని చుట్టుముట్టిన కార్యకర్తలు.. పొన్నాల, దామోదర, ఉత్తమ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేణుకాచౌదరి, పొంగులేటి తదితరులు వారిని బుజ్జగించేందుకు య త్నించినా ఫలితం లేకపోయింది. ఒకదశలో ఆ ముగ్గురు నేతలను ఉద్దేశించి పత్రికలో రాయలేని పదాలతో తిట్ల దండకం చదివారు. అయినప్పటికీ చేసేదేమీ లేక పొన్నాల, దామోదర సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి వాహనం ఎక్కారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం వారి వెంట బయటకు వచ్చి తీవ్ర పద జాలాన్ని ఉపయోగిస్తూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఒక దశలో సహనం కోల్పోయిన దామోదర అక్కడి వారిపై రుసరుసలాడారు.

‘ఏం కిషన్.. మీడియా ముందు హీరో కావాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో పో..’ అని వ్యాఖ్యానించారు. ‘అవసరం తీరాక ఇట్లనే ఉంటుంది. నువ్వు దళితుడివై ఉండి సాటి దళితుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? మేం టికెట్ అడిగితే మమ్మల్ని కాదని పార్టీకి సంబంధం లేని అద్దంకి దయాకర్‌కు టికెట్ ఇప్పించుకున్నవ్. నీలాంటోడివల్లే పార్టీ నాశనమైంది’ అని అక్కడి నేతలు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. అదే సమయంలో కొందరు నగర కార్యకర్తలు మాజీ మంత్రి దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న దానం అనుకూలవర్గం వారిపై దాడికి దిగింది. పరిస్థితి ఉద్రిక్తమవుతుందని గ్రహించిన టీపీసీసీ ముఖ్యులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం కిషన్, జ్ఞాన సుందర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ.. పొన్నాల, దామోదర, ఉత్తమ్ తమ పదవులకు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు.. పార్టీ కార్యకర్తలకు ఎలా మనోధైర్యాన్నిస్తారని ప్రశ్నించారు.

కార్యకర్తల ఆవేదనకు అర్థముంది: పొంగులేటి
కార్యకర్తల ఆవేదనలో అర్థముందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. పదేళ్లుగా కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే పార్టీ ఓడిపోయిందన్నారు. ఓటమికి తామంతా సమష్టి బాధ్యత వహించడంతోపాటు కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నామన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యకర్తల ఆవేదనను అర్ధం చేసుకున్నామని, ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేణుకా చౌదరి అన్నారు.

నోరు మెదపని పొన్నాల
గాంధీభవన్‌లో జరిగిన ఘటనపై మాట్లాడేందుకు పొన్నాల లక్ష్మయ్య నిరాకరించారు. ఎన్నికల ఫలితాలపై జూన్ మొదటి వారం నుంచి జిల్లాలవారీగా సమీక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు. హంగ్ నెలకొన్న మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లను కైవసం చేసుకునేందుకు తగిన వ్యూహాన్ని రూపొందించామన్నారు. డీకే అరుణకు మహబూబ్‌నగర్, రాజనర్సింహకు మెదక్, సబితా ఇంద్రారెడ్డికి మెదక్ జెడ్పీ చైర్మన్ ఎన్నికల బాధ్యతను అప్పగించినట్లు చెప్పారు.
 
ఓటమికి టీపీసీసీదే ఉమ్మడి బాధ్యత
సోనియా, రాహుల్ నాయకత్వంలోనే పనిచేస్తాం 
టీపీసీసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

 
తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి ఉమ్మడిగా బాధ్యత వహిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పేర్కొంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చేసిన రాజీనామాలను తిరస్కరిస్తూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. సోని యా, రాహుల్ నాయకత్వంలోనే పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో మంగళవారం గాంధీభవన్‌లో అందుబాటులో ఉన్న టీపీసీసీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి కె.జానారెడ్డి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రెడ్డి, అమోస్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ఎన్నికల్లో పార్టీ ఓటమి బాధాకరమైనప్పటికీ నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రాజనర్సింహ టీపీసీసీ రూపొందించిన తీర్మానాన్ని చదివి విన్పించగా నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

తీర్మానం సారాంశమిదే...
‘‘2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాజీనామాకు సిద్ధపడటాన్ని మన్మోహన్‌సింగ్ సహా సీడబ్ల్యూసీ తిరస్కరిస్తూ తీర్మానించింది. ఓటమికి ప్రభుత్వపరంగా బాధ్యత తీసుకుంటానని మన్మోహన్‌సింగ్ చెప్పడాన్ని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ టీపీసీసీ తీర్మానించింది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పార్టీని తిరిగి బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానించింది.

రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. తెలంగాణలో పార్టీ ఓటమికి తనదే బాధ్యతగా పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. అయితే దేశంలో ఏర్పడిన రాజకీయ కారణాల వల్లే పార్టీ ఓటమి పాలైందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రాథమికంగా అంచనా వేస్తూ అందుకు ఉమ్మడి బాధ్యత స్వీకరిస్తుంది. భవిష్యత్తులో సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, రాహుల్‌గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజాపక్షాన నిలబడాలని టీపీసీసీ తీర్మానించింది’’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement