సాక్షి, ఆదిలాబాద్: బల్దియా ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా పార్టీల్లోనూ... ఇటు అధికారుల్లోనూ వేగం పెరిగింది. అయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ప్రజలు ఓటువేసి అభివృద్ధి బాటలో నడిచేందుకు సంసిద్ధయ్యారు. నగర పంచాయతీల నుంచి మున్సిపాలిటీగా మారడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. యువత ఎక్కువగా ఓటుహక్కును పొందడంతో ఈసారి వారి ప్రభావం ఫలితాలపై చూపనుంది.
ఆదిలాబాద్‌లో యువచైతన్యం
మున్సిపల్ ఎన్నికలకు పట్టణ ఓటర్లే కీలకం. ఆదిలాబాద్ బల్దియా పరిధిలో గతంలో 36 వార్డులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 49కి చేరింది. శివారు గ్రామాల విలీనంతో వార్డుల సంఖ్యతో పాటు పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలోని ఓటర్లు పెరిగారని చెప్పవచ్చు. 2014 ఎన్నికల సమయంలో ఐదెంకెల సంఖ్యతో ఉన్న ఓటర్ల జాబితా ప్రస్తుతం ఆరంకెలకు చేరింది. అయితే పెరిగిన ఓటర్లు ఎవరికి లాభం చేకూరుస్తారనేది వేచిచూడాల్సిందే.
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 37,429..
ఆదిలాబాద్ బల్దియా పరిధిలో గడిచిన ఐదేళ్లలో భారీగా ఓటర్లు పెరిగారు. గ్రామాల విలీనంతో పాటు ఐదేళ్లుగా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాలు ఫలితాలు ఇచ్చారు. గత నెల 30న విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం 1,27,801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 63,057 మంది, మహిళలు 64,738 మంది ఉన్నారు. ఇతరులు ఆరుగురు ఉన్నారు. బల్దియాకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మున్సిపల్‌లోని పాత 36 వార్డుల పరిధిలో 90,372 మంది ఓటర్లు ఉన్నారు. అంటే గడిచిన ఐదేళ్లలో 37,429 మంది ఓటర్లు పెరిగారు. మున్సిపల్ పరిధిలో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
యువ ఓటర్లు 30,429..
మున్సిపల్ ప్రస్తుతం 49 వార్డుల్లో యువ ఓటర్ల సంఖ్య భారీగానే ఉంది. 18 నుంచి 29 ఏళ్లలోపు యువత 30,429 మంది ఉన్నట్లు సంబంధిత అధికారులు లెక్కతేల్చారు. ఇందులో 18,19 వయస్సుల వారు కేవలం 2వేలలోపే ఉండగా, 20 నుంచి 29ఏళ్లున్న వారు 28వేల మందికిపైగా ఉన్నారు. గ్రామాల విలీనంతో వయసుల వారీగా లెక్కింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఓటరు నమోదు కార్యక్రమాలతోనే పట్టణ ఓటర్ల సంఖ్య పెరిగిందనుకుంటే గ్రామాల విలీనంతో మరింత రెట్టింపైంది.
ఒక్కో వార్డులో భారీగా ఓటర్లు..
ఓటర్ల జాబితా ప్రకారం ఆదిలాబాద్ బల్దియా పరిధిలోని ఒక్కో వార్డులో భారీగా ఓటర్లు ఉన్నారు. వార్డుల విభజనతో పాత వార్డు పరిధిలోని ఓటర్లు మరో వార్డులోకి కలిసిపోగా, సదరు వార్డులోకి శివారు గ్రామాల ఓటర్లు వచ్చి చేరారు. అయితే ఒక్కో వార్డులో 2300 నుంచి 3 వేలకుపైగా మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 49 వార్డులు ఉండగా, 33 వార్డుల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉండగా, మిగతా 16 వార్డులో పురుషులు ఎక్కువగా ఉన్నారు.
నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా
భైంసా: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భైంసా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయాక 1953లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అంతకుముందు నగర పంచాయతీగా ఉండేది. అప్పట్లో 21 వార్డులు ఉండేవి. మొదటిసారి మున్సిపాలిటీగా ఏర్పడిన సమయంలో బాబురావు మైసేకర్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెరిగిన వార్డులు...
రానురాను మున్సిపాలిటీలో వార్డులు పెరిగాయి. 1953లో 21 వార్డులు ఉన్న భైంసా మున్సిపాలిటీలో గత పదేళ్ల క్రితం రెండు వార్డులు పెరిగాయి. తాజాగా మళ్లీ వార్డులు విభజించడంతో ఈ సంఖ్య 26కి పెరిగింది. ప్రస్తుతం భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్‌తో ఈ 26 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 26వార్డుల్లో 41,728 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 20,874 పురుష ఓటర్లు ఉండగా 20,844 మహిళ ఓటర్లు ఉన్నారు.
పంచాయతీ నుంచి బల్దియా దాకా
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర పుటల్లో ఒక ప్రత్యేక గుర్తింపును కలిగిన గ్రామపంచాయతీ. 1964లో ఏర్పడ్డ ఈ పంచాయతీ అభివృద్ధి పథంలో ఎన్నో పుంతలు తొక్కుతూ మున్ముందుకు పయనించింది. పంచాయతీ నుంచి మేజర్ గ్రామపంచాయతీగా.. నేడు మున్సిపాలిటీగా తన ప్రస్థానాన్ని కొనసాగించి మరోసారి చరిత్ర పుటల్లోకెక్కింది. సహజంగానే ఇక్కడ బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉండటంతో ఈ పంచాయతీ ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. పురఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్న తరుణంలో క్యాతనపల్లి మున్సిపాలిటీపై ప్రత్యేక కథనం.
మేజర్ గ్రామపంచాయతీగా...
గ్రామపంచాయతీగా 24ఏళ్ల పాటు కొనసాగిన క్యాతనపల్లిని 1988లో అధికారులు అప్‌గ్రేడ్ చేశారు. మేజర్ గ్రామపంచాయతీగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుంచి మొన్నటి వరకూ ఈ మేజర్ గ్రామపంచాయతీకి 9సార్లు ఎన్నికలు జరిగాయి. గ్రామానికి ఆనుకునే బొగ్గు గనులు ఉండటంతో ఇక్కడి కార్మికుల ఓట్లు కూడా కీలకంగా మారాయి. చిన్నపాటి పంచాయతీ నుంచి మేజర్ గ్రామపంచాయతీగా విస్తరించడంతో పలు చిన్న గ్రామాలు ఇందులో విలీనమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో మేజర్ గ్రామపంచాయతీగా క్యాతనపల్లి నిలువటం గమనార్హం.
నేడు బల్దియాగా సేవలు..
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించిన క్యాతన పల్లి నేడు ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ముందుకు వస్తోంది. మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం గ్రామపంచాయతీగా ఉన్న తిమ్మాపూర్‌ను క్యాతనపల్లిలో విలీనం చేశారు. దీంతో పాత తిమ్మాపూర్, కొత్త తిమ్మాపూర్ గ్రామాలు క్యాతనపల్లిలో కలిశాయి. 3వేల పైచిలుకు జనాభ విలీనమాయ్యారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మున్సిపాలిటీ నేడు మరింత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మున్సిపాలిటీగా ప్రకటించడంతో ఎన్నికల సమరానికి క్యాతనపల్లి సన్నదం కానున్నది.
22 వార్డులు..25 వేల ఓటర్లు..
నూతనంగా ఏర్పడిన క్యాతనపల్లి మున్సిపాలిటీని మొత్తం 22 వార్డులుగా విభజించారు. ఇందులో 25,441 ఓటర్లుండగా 12,982 మంది పురుషులు, 12,458 మంది మహిళా ఓటర్లున్నారు. ఒకరు ట్రాన్స్‌జెండర్ ఓటర్ ఉన్నారు.
1952లోనే మున్సిపాలిటీగా...
నిర్మల్‌టౌన్: సుమారు 400ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన నిర్మల్ పట్టణం 1952లోనే మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఆ సమయంలో కేవలం 12వార్డులతో మున్సిపాలిటీ ఆవిర్భవించింది. తదనంతరం పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేయడంతో ఆ సంఖ్య ప్రస్తుతం 42కి చేరింది. నిర్మల్ మున్సిపాలిటీకి సమీపంలోని గొల్లపేట్, గాజులపేట్, సిద్దాపూర్‌ను విలీనం చేసిన తర్వాత వార్డుల సంఖ్య 28కి చేరింది. అనంతరం వార్డుల విభజనతో ఈ సంఖ్య 36కు చేరింది. తాజాగా 2019 సంవత్సరంలో వెంకటాపూర్, మంజులాపూర్ గ్రామాలు సైతం పట్టణంలో విలీనం చేశారు. దీంతో మళ్లీ జరిగిన వార్డుల విభజనతో ప్రస్తుతం నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఏర్పాటయ్యాయి. 1600 శతాబ్దంలో భద్రాచలం తహశీల్దార్‌గా ఉన్న కంచర్ల గోపన్న(రామదాసు) భద్రాచలంలో రామాలయం నిర్మించడంతో కుతుబ్‌షాహి పాలకులు ఆయనను చెరసాలలో వేశారు. అతనికి సన్నిహితుడైన వెలమ దళవాయి నిమ్మనాయుడు అక్కడ నుంచి వచ్చి నిర్మల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. అతనిపేరిటే ఈ ప్రాంతానికి నిమ్మలగా నామకరణం చేశారు. కాలక్రమంలో నిర్మల్‌గా రూపాంతరం చెందింది. ఇలా చారిత్రకంగా విశేష ప్రాశస్త్యం ఉన్న నిర్మల్ నగరం తొలుత సమితిగా ఉండేది. అనంతర కాలంలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది.
ఖానాపూర్ మున్సిపాలిటీలో...
ఖానాపూర్: పాత తాలుకాగా ఉండే నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలో తొలి అధ్యక్ష పీఠం ఏ పార్టీని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018 ఫిబ్రవరికి ముందు వరకు ఖానాపూర్ మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగింది. రాష్ట్రంలో 15వేల పైచిలుకు ఓటర్లు ఉన్న పంచాయతీని ప్రభుత్వం మున్సిపాలిటీగా చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 70 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కాగా నిర్మల్ జిల్లా నుంచి ఖానాపూర్ మున్సిపల్‌గా అవతరించింది.
రెండోసారి...
ఇది వరకు 1958లోనే ఖానాపూర్ మున్సిపల్‌గా ఏర్పాటైంది. అప్పట్లోనే స్వర్గీయ అబ్దుల్ హమీద్ ఏకగ్రీవంగా తొలి చైర్మన్‌గా ఎన్నికై 1958 నుంచి 61 వరకు కొనసాగారు. నాటి నుంచి ఖానాపూర్‌ను పంచాయతీగా మార్చారు. 1961లో స్వర్గీయ దేశ్‌పాండే తొలిసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తదనంతరం 1963లో జరిగిన ఎన్నికల్లో జబ్బర్‌ఖాన్ సర్పంచ్‌గా ఎన్నికై 1981 వరకు 18 ఏళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగాడు. 1981–87 వరకు నర్సింహరావు జోషి, 1987 నుండి 94 వరకు బక్కశెట్టి రాములు సర్పంచ్‌గా ఉన్నారు. 1994 నుండి 97 వరకు విలాస్‌రావు దేశ్‌పాండే సర్పంచ్ ఉన్నారు. తదనంతరం విలాస్‌రావు సతీమణి శోభారాణి సర్పంచ్ చేసి ఉద్యోగం రావడంతో మద్యలో వెల్లిపోవడంతో వారి స్తానంలో శికారి లక్షి్మనారాయణ, బక్కశెట్టి లక్ష్మణ్‌లు సర్పంచ్‌గా కొనసాగారు. 2001 తర్వాత నుండి జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల రత్నకుమారి, మైలారపు గంగాదర్, ఆకుల శ్రీనివాస్, నేరెళ్ల సత్యనారాయణలు వరుసగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 15604 ఓటర్లతో పాటు 8020 మహిళలు, 7584 పురుషులు ఉన్నారు.
50ఏళ్ల క్రితమే...
చెన్నూర్: చెన్నూర్ 1957లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అనాటి నుంచి 1963 వరకు తహసీల్దార్‌లే మున్సిపాల్ కమిషనర్‌గా వ్యవహరించారు. 1963లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో పట్టణానికి చెందిన బేరంబాగ్స్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1968 వరకు బేరంబాగ్స్ చైర్మన్‌గా ఉన్నారు. రెండ సారి 1968లో జరిగిన ఎన్నికల్లో చిల్లప్ప రాంచందర్‌రావు, 1970వరకు చైర్మన్‌గా కొనసాగారు.
1970లో మేజర్ గ్రామ పంచాయతీగా...
1970లో చెన్నూర్‌ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 1970లో చెన్నూర్ గామ పంచాయతీకి ఎన్నికలు జరుగగా చెన్నూర్‌కు తొలి సర్పంచ్‌గా శ్రీరాంభట్ల (కాంగ్రెస్) రామన్న ఎన్నికయ్యారు. 1995 వరకు 30 ఏళ్లు పాటు రామన్న సర్పంచ్‌గా పని చేశారు. 1995–2000 వరకు రేగళ్ల మధుసూధన్, 2000–05 వరకు మైదం కళావతి, 2006 –12 రేగళ్ల విజేత, 2012 – 18 వరకు సాధనబోయిన కృష్ణ సర్పంచ్‌లుగా కొనసాగారు.
2018లో మున్సిపాలిటీగా
2 ఆగష్టు 2018లో చెన్నూర్‌ను మళ్లీ మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి జరిగే ఎన్నికల్లో తొలి చైర్మన్ పదవి ఎవరిని వరిస్తొందోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పట్టణంలో ఎన్నికల హడావుడి మొదలైంది.
నస్పూర్‌లో మొదటిసారిగా
శ్రీరాంపూర్: మొదటి దఫా మున్సిపల్ ఎన్నికలకు నస్పూర్ మున్సిపాలిటీ సిద్ధమైంది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం నస్పూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కొత్త మున్సిపాలిటీలో మొత్తం 62670 మంది ఓటర్లు ఉన్నారు. అంతకు ముందు 62431 మంది ఓటర్లు ఉంటే కొత్తగా 239 మంది ఓటర్లుగా చేరారు. మొత్తం ఓటర్లలో పురుషులు 32476 మంది, మహిళల ఓట్లు 30182 ఉన్నాయి. థార్డ్ జెండరు ఓట్లు కూడా 12 నమోదయ్యాయి.
మేజర్ పంచాయతీ నుంచి...
మున్సిపాలిటీ జూన్ 2, 2018లో ఏర్పడింది. మున్సిపాలిటీ ఏర్పడక ముందు నస్పూర్ మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. సింగరేణి కోల్‌బెల్ట్ గ్రామాలైన నస్పూర్, సింగపూర్, తాళ్లపల్లి, తీగల్‌పహడ్ గ్రామాలు గ్రామ పంచాయతీలుగా ఉండేవి. చాలా ఏళ్లుగా ఇవి గ్రామ పంచాయతీలుగా కొనసాగాయి. ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీను ఏర్పాటు చేయడంలో భాగంగా నాలుగు గ్రామాలను కలిసి నస్పూర్ మున్సిపాలిటీని చేశారు. కార్యాలయం ప్రస్తుతం మునుపటి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే సాగుతోంది. కమిషనర్‌గా రాధాకిషన్, ప్రత్యేక అ«ధికారిగా శ్యామల దేవి వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయి సిబ్బందిని నియమించలేదు. అంతకు ముందు గ్రామ పంచాయతీలోని సిబ్బందిని మున్సిపల్ శాఖకు మార్పు చేసినా ఇంకా టౌన్‌ప్లానింగ్ వంటి ముఖ్య విభాగాలను మంచిర్యాల చెందిన వారే ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్నారు. మొదటి సారి నస్పూర్ మున్సిపాలిటీలో ఎవరు అడుగుపెడుతారో అన్నది చర్చనీయాంశంగా మారింది.
లక్సెట్టిపేట మున్సిపాలిటీ
లక్సెట్టిపేట(మంచిర్యాల): లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఆగష్టు 2వ తేదీ 2018వ కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటైంది. అంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండేది. మొత్తం ఓటర్లు 16439 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 8065, మహిళలు 8372 ఉండగా ఇతరులు 02 ఉన్నారు. మున్సిపాలిటిలో ఊత్కూరు, మోదెల, ఇటిక్యాల మూడు గ్రామాలు లక్సెట్టిపేటలో విలీనమయ్యాయి. మొత్తం వార్డులు 15గా కేటాయించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ
కాగజ్‌నగర్: కుమురంభీం జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ కాగజ్‌నగర్. దీనిని 1958లో ఏర్పాటు చేశారు. 1967లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ పరిధిలో 45,156 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుçషులు 22,425, మహిళలు 22,731 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 306 మంది ఎక్కువగా ఉన్నారు. ఎస్సీలు 7375, ఎస్టీలు 205, బీసీలు 28595, ఇతరులు 8981 మంది ఓటర్లు ఉన్నారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో 70.56 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 43,633 మంది ఓటర్లు ఉండగా అందులో 30,786 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 15527, మహిళలు 15259 మంది ఓటు వేశారు. ఈ సారి వంద శాతం పోలింగ్ జరిగేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఓటర్ల గల్లంతుపై ఆందోళన
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా ముసాయిదాపై ఆయా పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి రూపొందించిన ఓటరు జాబిత సైతం తప్పులతడకగా ఉందని ఆరోపనలు ఉన్నాయి. అభ్యంతరాలు సక్రమంగా సవరించకపోవడంతో శుక్రవారం మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. స్వయంగా ఓటర్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పరిష్కరించడం లేదని ఆరోపించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నూతనంగా 30 వార్డులు ఏర్పాటు చేశారు. వార్డుల పునర్విభజన హద్దులు, ఓటరు జాబిత తయారు సక్రమంగా జరుగలేదని వాపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు రెండు వార్డుల్లో చేర్చారని, మృతి చెందిన ఓటర్లను తొలగించకుండా ఓటరు జాబితా రూపొందించడంతో అసహనం వ్యక్తం చేశారు. గల్లంతైన ఓట్లు సైతం జాబితలో చేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఓటరుకు 5చోట్ల ఓటు కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడంతోనే తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. జరిగిన తప్పిదాలను సవరిస్తామని చెప్పడంతో నాయకులు ఆందోళన విరమించారు. నేడు తుది ఓటరు జాబితా విడుదల కానుంది.
ముగిసిన పరిశీలన..
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలని 77మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫలాన వార్డు నుంచి ఫలాన వార్డులోకి ఓట్లు మార్చాలని, ఓట్లు గల్లంతయ్యాయని, తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. ఇన్‌చార్జి కమిషనర్ సతీష్, టీపీబీవో సాయిక్రిష్ణ, ఆర్‌ఐ క్రాంతి, తదితరులు దరఖాస్తులను పరిశీలించారు. శుక్రవారం జేసీ రాంబాబు, తహసీల్దార్ యుగేందర్‌లు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండ, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment